ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఐసిఎంఆర్ చరిత్ర కాలపట్టిక ఆవిష్కరించిన డాక్టర్ హర్ష వర్ధన్

వాక్సిన్ వెబ్ పోర్టల్, కోవిడ్ జాతీయ చికిత్సా నమోదు పట్టిక,

సంచార గుండెపోటు యూనిట్ ప్రారంభం

ఐసిఎంఆర్ వందేళ్ళ ఉజ్జ్వల చరిత్రకు, అసాధారణ పనితీరుకు అద్దంపట్టిన కాలపట్టిక

Posted On: 28 SEP 2020 5:15PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు భారతీయ వైద్య పరిశోధనామండలి కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంస్థ సాధించిన చారిత్రక విజయాలను సూచించే కాలపట్టికను ఆవిష్కరించారు. అదే విధంగా వాక్సిన్ వెబ్ పోర్టల్, కోవిడ్ జాతీయ చికిత్సా నమోదు పట్టిక, సంచార గుండెపోటు యూనిట్  ను కూడా ప్రారంభించారు. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, ఐసిఎంఆర్- జాతీయ పౌష్ఠికాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత పలువురు సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారతదేశపు ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనామండలి ఐసిఎంఆర్ 1911 లో ప్రారంభమైననాటి నుంచి దాని 108 ఏళ్ళ  చరిత్ర గతిని ప్రతిబింబించే కాలపట్టికను మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించారు. అప్పట్లో దానిని ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అని పిలిచేవారు. ఈ కాలపట్టికలో అనేక విధానపరమైననిర్ణయాలు, సంస్థ చేపట్టిన కార్యక్రమాలు, అది కనిపెట్టిన అంశాలు, వ్యాధి నియంత్రణలో దాని సంస్థలు చేసిన కృషి, బాలింతలు, శిశువుల ఆరోగ్య రంగంలో చేసిన కృషి, హెచ్ ఐ వి, కాన్సర్ వంటి రంగాలతోబాటు పోషకాహారంలో చేసిన కృషిని ఇందులో ప్రస్తావించారు.

108 ఏళ్ళ  సుదీర్ఘ కాలపు  ఐసిఎంఆర్ చరిత్ర కాలపట్టికను తాను ఆవిష్కరించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, “ ఒకవైపు వైద్య రంగంలో పెరుగుతున్న అవసరాలకు తగినట్టుగా వ్యవహరిస్తూ, మరోవైపు దేసపు ఆరోగ్య సమస్యలకు ఆచరణీయమైన పరిష్కారాలు కనుక్కోవటంలో నిమగ్నమైందని అభినందించారు. ఐసిఎంఆర్ ఉజ్జ్వల చరిత్రను ఇలా ప్రదర్శించిన ఈ ఘట్టం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

దేశంలో ఆరోగ్య పరిశోధనలో ఐసిఎంఆర్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటూ వచ్చిందని, ఇప్పుడు కూడా ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని కరోనా మహమ్మారి ఎదురైన సమయంలో దీన్ని ఎదుర్కోవటంలో శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు. దేశ సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన విషయాన్ని అక్కడ ప్రదర్శనలో ఉంచిన నమూనాలే చెబుతున్నాయని, ఇవన్నీ తెలుసుకొని ప్రజలు ఎంతగానో గర్విస్తారని మంత్రి అన్నారు.

సంచార గుండెపోటు యూనిట్ ను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రజలు చాలామంది గుండెపోటు, రక్తపోటుతో మరణించటం బాధాకరమని చెబుతూ, సకాలంలో చికిత్స అందితే ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునన్నారు. అస్సాంలో గుండెపోటు రక్షణకు తగిన సదుపాయాలు లేనందున ఈ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. టెలి సంప్రదింపుల ద్వారా ఈ మొబైల్ యూనిట్ సకాలంలో తగిన చికిత్స అందించగలదన్నారు.  కోవిడ్ కారణంగా వనరులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ నిస్వార్థంగా సేవలందించిన వైద్య సిబ్బందిని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభినందించారు.

వాక్సిన్ పోర్టల్ ను, కోవిడ్ చికిత్సా నమోదు పట్టిక మీద మరో పోర్టల్ ను కూడా ఆయన ఆవిష్కరించారు. వాక్సిన్ తయారీకి సంబంధించిన  విస్తృతమైన సమాచారాన్ని పారదర్శకంగా అందించాల్సిన అవసరాన్ని  నొక్కి చెబుతూ, ఈ పోర్టల్ ఆ కృషిలో విజయం సాధిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ లో పురోగతిని తెలియజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో వాక్సిన్ తయారీని అందరూ నిశితంగా గమనిస్తూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారని అందుకే తాజా పరిస్థితిని తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు.

భారతదేశం కోవిడ్-19 మీద జరుపుతున్న పోరు గురించి మాట్లాడుతూ, కోలుకుంటున్న కోవిడ్ బాధితుల సంఖ్య భారత్ లో చాలా ఎక్కువగా ఉందని, మరణాల శాతం బాగా తగ్గుతూ వచ్చిందని అన్నారు. వ్యాధిని కట్టడి చేయటంలో మన అంకితభావానికి ఇవే నిదర్శనమన్నారు. ఒకప్పుడు దేశంలో ఒకే లాబ్ లో పరీక్షలు జరపాల్సి ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 1800 కు చేరిందన్నారు. రోజుకు 15 లక్షల శాంపిల్స్ ను పరీక్షించగలిగే స్థితికి చేరటం మన దేశపు గొప్పదనంగా అభివర్ణించారు.

ప్రజలు కోవిడ్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ,  పాటించాల్సిన నియమనిబంధనలన్నీ పాటించాలని కోరారు. మాస్కులు ధరించటమే సామాజిక వాక్సిన్ అని చెబుతూ, పరిశుభ్రత,  శ్వాస సంబంధమైన విషయాల్లో  క్రమశిక్షణ, భౌతికదూరం పాటించటం మరువవద్దని చెప్పారు. రెండు గజాల దూరంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుందా చూసుకోవచ్చునన్నారు.

 

****

 

 



(Release ID: 1659927) Visitor Counter : 136