ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సండే సంవాద్ -3లో భాగంగా సోషల్ మీడియా వాడకందారులతో డాక్టర్ హర్ష వర్ధన్ మాటా మంతీ

దో గజ్ కీ దూరీ ఔర్ థోడీ సమజ్ దారీ పడోగీ కరోనా పే భారీ : కొత్త నినాదం సృష్టి


ప్రార్థనాస్థలంలోనూ మాస్క్ తప్పనిసరి: పరవాలేదన్న నిర్లక్ష్యం తగదని హెచ్చరిక


సామూహిక రోగనిరోధకతకు భారత్ ఇంకా దూరంలోనే ఉందని ఐసిఎంఆర్ సర్వే వెల్లడి


ఆరోగ్యరంగంలో ప్రోత్సాహం పుంజుకున్న ఆత్మనిర్భర్ భారత్: ఎగుమతులకు సిద్ధం


వైద్యకళాశాలలు, మౌలిక సదుపాయాలతో ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కట్టుబడ్డ ప్రభుత్వం


ప్రజారోగ్య వ్యయం వాటా 2025 నాటికి జిడిపిలో 1.15 నుంచి 2.5% కి

Posted On: 27 SEP 2020 4:39PM by PIB Hyderabad

సండే సంవాద్ మూడో ఎపిసోడ్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ సోషల్ మీడియా వాడకం దారులతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుత కోవిడ్ సంక్షోభంతో బాటు వైద్య మౌలికసదుపాయాలు, భారత్ లో ప్రజారోగ్యం భవిష్యత్తు, వాతావరణ మార్పుల  పరిశోధనలో భారత్ పాత్ర లాంటి అనేక ప్రశ్నలు ఈ కార్యక్రమంలో వచ్చాయి.

దశలవారీగా విద్యా సంస్థలు ప్రారంభించే విషయంలో ఎదురవుతున్న అనేక భయాలను కేంద్ర ఆరోగ్యమంత్రి ఈ సందర్భంగా త్రోసిపుచ్చారు. క్షౌరశాలలకు వెళ్ళే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కోవిడ్ నిబంధనలు ఎవరు పాటించక పోయినా నచ్చజెప్పాలని విజ్ఞప్తి చేశారు. తాను కూడా కారు ఆపి మరీ మాస్కు ధరించనివాళ్లను మాస్కు ధరించాల్సిందిగా చెబుతుంటానని గుర్తు చేశారు. ప్రార్థనాస్థలాలలో సైతం మాస్క్ ధరించాలని ప్రత్యేకంగా చెప్పారు.

ప్రభుత్వం, సమాజం కలసి పోరాడినప్పుడే ఈ మహమ్మారిని అంతం చేయగలమని చెబుతూ మంత్రి “ దో గజ్ కీ దూరీ ఔర్ థోడీ సమజ్ దారీ పడోగీ కరోనా పే భారీ “ అనే కొత్త నినాదమిచ్చారు.

ఐసిఎంఆర్  సీరో సర్వే నివేదిక ప్రజల్లో ఎలాంటి నిర్లక్ష్యభావాన్నీ పెంచకూడదని మంత్రి హెచ్చరించారు. 2020 మే నెలలో వచ్చిన మొదటి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 0.73% ప్రజల్లోనే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలింది. త్వరలో రాబోయే రెండో నివేదిక ప్రకారం మనమింకా సామూహిక రోగనిరోధకతకు దూరంగానే ఉన్నట్టు వెల్లడి కాబోతోంది. అంటే దానర్థం మనం కోవిడ్ విషయంలో ఇంకా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.

రెమిడిసెవిర్, ప్లాస్మా థెరపీలాంటివి పరిశోధనాత్మక చికిత్సావిధానాలు విస్తృతంగా వాడుతూ ఉండటాన్ని మంత్రి ప్రస్తావిస్తూ హేతుబద్ధంగా మాత్రమే వాడాలని అనేకమార్లు ప్రభుత్వం జారీచేసిన సూచనలు, మార్గదర్శకాలలో పేర్కొన్నదన్నారు. ఇలాంటివి యథాలాపంగా వాడకూడదని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా సూచించినట్టు చెప్పారు. ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించే టెలీ-సంప్రదింపులలో కూడా డాక్టర్లకు ఈ విషయం చెబుతున్నామన్నారు.

 ఈ వ్యాధి కేవలం మన ఊపిరితిత్తులనే కాకుండా ఇతర దేహ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తున్నట్టు బైటపడుతున్న ఆధారాలను మంత్రి ప్రస్తావించారు. గుండె, రక్తకవాటాలు, మూత్రపిండాలు సైతం దెబ్బతింటున్నాయన్నారు. దీని బహుముఖ లక్షణాలను అధ్యయనం చేయటానికి ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటికే నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఐసిఎంఆర్ కూదా దీన్ని అధ్యయనం చేస్తోందని చెబుతూ, మళ్లీ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అత్యంత నామమాత్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయటం లేదన్నారు.

కోవిడ్ పరీక్షల ధరలు తగ్గించాల్సిందిగా రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరామని డాక్టర్ హర్షవర్ధన్  చెప్పారు. సంక్షోభం తొలిదశలో కిట్స్ దిగుమతి చేసుకోవాల్సి ఉండటం వలన ధరలు ఎక్కువగా ఉండేవని, కానీ ఇప్పుడు స్వదేశీ తయారీ పెరగటంతో సరఫరా తగినంత ఉందని గుర్తు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులతో కూడా చర్చించి పరస్పర ఆమోదయోగ్యమైన తక్కువ ధరలు నిర్ణయించాల్సిందిగా రాష్ట్రాలకు లేఖలు రాశామన్నారు. అనేక రాష్టాల ఆరోగ్యమంత్రులతో తాను పరీక్షల ధరలమీద వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం కూడా డాక్టర్ హర్ష వర్ధన్ వెల్లడించారు.

ఆత్మ నిర్భర్ భారత్ యోజన మీద అడిగిన ఒక ప్రశ్నకు స్పందిస్తూ,  భారత్ తన ద్విముఖ వ్యూహంలో భాగంగా ఒకవైపు ఉత్పత్తికి రాయితీ ఇస్తూ మరోవైపు అత్యంత నాణ్యమైన ఔషధాలకు, వైద్య పరికరాలకు తయారీ సంబంధమైన మౌలిక వసతులు కల్పిస్తోందన్నారు. దీనివలన భారత్ స్వయం సమృద్ధమవుతుందన్నారు. దిగుమతులు గణనీయంగా తగ్గేట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలో మూడు భారీ ఔషధ పార్కులు, నాలుగు వైద్య పరికరాల పార్కులు ప్రతిపాదించామని. వీటివలన మనకు అవసరాలు తీరటంతోబాటు తక్కువ ధరలో నాణ్యమైన ఉత్పత్తుల ఎగుమతి  కూడా చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. గత కొద్ది నెలలలో వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, పరీక్షలకిట్లు తయారు చేయటంలో ఎంతో ముందడుగు వేయటాన్ని మంత్రి గుర్తు చేశారు.

మొత్తం ఈశాన్య భారతానికి ఒకే ఒక్క ఎయిమ్స్ కేటాయించటంలో ప్రాంతాలమధ్య తారతమ్యాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆరోగ్య రంగంలో అలాంటి అసమతుల్యాలను సరిదిద్దటానికే ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన కృషి చేస్తున్నదన్నారు. కొత్త ఎయిమ్స్ నెలకొల్పటంతోబాటు దశలవారీగా ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల స్థాయి పెంచుతున్నట్టు మంత్రి వెల్లడించారు. అస్సాంలోని ఢుబ్రీ, నాగావ్, నార్త్ లక్ష్మీపూర్,దిఫు, కోక్రాజర్ జిల్లాల్లో, మణిపూర్ లోని చురచంద్రాపూర్,  మేఘాలయలోని వెస్ట్ గారో హిల్స్ మిజోరం లోని ఫాల్కావన్ జిల్లా, నాగాలాండ్ లోని కోహిమా, మాన్ లలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

గడిచిన ఐదేళ్ళకాలంలో కేంద్ర ప్రభుత్వం 29,185 మెడికల్ సీట్లు పెంచిందని చెబుతూ వైద్యరంగంలో చేపట్తిన అనేక అంశాలను ప్రస్తావించారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను బలోపేతం చేయటం, స్థాయి పెంచటం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు నిబంధనల సడలింపు, గరిష్ఠ సీట్ల పరిమితిని 150 నుంచి 250 కి పెంచటం, అధ్యాపకుల నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంపు వలన దేశంలో వైద్యుల నిష్పత్తి పెరుగుతుందన్నారు.

ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచటం మీద అలాంటిదే మరోప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వం ప్రస్తుతం జిడిపిలో 1.15% ఖర్చు చేస్తుండగా దీన్ని 2025 నాటికి  2.5% కు పెంచటానికి కట్టుబడి ఉందన్నారు. అంటే, ఇది 345% పెంపు అవుతుందని, ఇంత తక్కువ వ్యవధిలో అలాంటి భారీ పెంపు అసాధారణమని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో వచ్చే ఐదేళ్లకాలంలో ఆరోగ్యరంగం మీద ఖర్చును గణనీయంగా పెంచాలని 15 వ ఆర్థిక సంఘంలోని ఉన్నత స్థాయి బృందం కూడా అంగీకరించిందని మంత్రి దాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు.

 

 సండే సంవాద్ మూడో ఎపిసోడ్ చూడాలంటే ఈ కింది లింక్ క్లిక్ చేయండి:

ట్విట్టర్ https://twitter.com/drharshvardhan/status/1310119734684327937

ఫేస్ బుక్ :  https://www.facebook.com/drharshvardhanofficial/posts/1739860256162792

యుట్యూబ్ https://youtu.be/-zp_JRl88LU

డి హెచ్ వి యాప్ : http://app.drharshvardhan.com/download

 

 

***


(Release ID: 1659611) Visitor Counter : 207