ఉక్కు మంత్రిత్వ శాఖ
మరింత సమర్థత, వికేంద్రీకరణ లక్ష్యంతో సెయిల్ బోర్డు పునఃనిర్మాణానికి ఏసీసీ అనుమతి
Posted On:
25 SEP 2020 12:14PM by PIB Hyderabad
'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (సెయిల్) బోర్డు పునఃనిర్మాణానికి, నియామకాల మంత్రివర్గ కమిటీ (ఏసీసీ) అనుమతించింది. సెయిల్ సమీకృత ఉక్కు ప్లాంట్ల నలుగురు ముఖ్య కార్యనిర్వాహక అధికారులను (సీఈవో), పునఃనిర్మాణంలో భాగంగా కార్యనిర్వహక డైరెక్టర్లుగా మారుస్తారు. వీరిలో ముగ్గురిని బొకారో, రూర్కెలా, భిలాయ్ ప్లాంట్లకు ఇంఛార్జ్ డైరెక్టర్లుగా; మరొకరిని బుర్నాపూర్, దుర్గాపూర్‌కు కలిపి ఇంఛార్జ్ డైరెక్టర్‌గా నియమిస్తారు.
ముడి సరుకు, రవాణా విభాగం డైరెక్టర్; ప్రాజెక్టులు, వ్యాపార ప్రణాళిక విభాగం డైరెక్టర్; సాంకేతిక విభాగం డైరెక్టర్ పోస్టుల కార్యక్రమాలు, బాధ్యతలను కలిపి.. సాంకేతికత, ప్రాజెక్టులు, ముడి సరుకుల విభాగం డైరెక్టర్ పోస్టుగా మారుస్తారు.
పునఃనిర్మాణం పూర్తయిన సెయిల్ డైరెక్టర్ల బోర్డులో కంపెనీల చట్టం 2013 ప్రకారం; ఛైర్మన్, డైరెక్టర్ (ఆర్థికం), డైరెక్టర్ (వ్యాపారం), డైరెక్టర్ (సాంకేతికత, ప్రాజెక్టులు, ముడి సరుకులు), డైరెక్టర్ (సిబ్బంది), ఐఎస్‌పీల ఇంఛార్జి డైరెక్టర్లు, అనధికార డైరెక్టర్లు ఉంటారు. డీపీఈ విధానం ప్రకారం, ప్రభుత్వం సిఫారసు చేసిన మరో ఇద్దరు కూడా డైరెక్టర్లుగా బోర్డులో ఉంటారు.
వికేంద్రీకరణతోపాటు, ప్లాంట్ల ఇంఛార్జ్ డైరెక్టర్లు వారి దృక్కోణంలో ఆలోచించి చురుగ్గా నిర్ణయాలు తీసుకునేలా వీలు కల్పించడం సెయిల్ బోర్డు పునఃనిర్మాణ ఉద్దేశం. సెయిల్ ఆధునీకరణ, విస్తరణలో వేగం పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.
బ్రౌన్ ఫీల్డ్/ గ్రీన్ ఫీల్డ్ విస్తరణ ద్వారా 50 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరాలన్నది సెయిల్ లక్ష్యం. 2030-31 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలన్న 'జాతీయ ఉక్కు విధానం-2017'ను రూపొందించినప్పుడు, సెయిల్ లక్ష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
***
(Release ID: 1659026)