వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2020వ సంవత్సరపు రైతుల ఉత్పాదనల వాణిజ్యం (ప్రోత్సాహక, సదుపాయ) బిల్లుకు,

రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, వ్యవసాయ సేవల
ఒప్పందం బిల్లుకు పార్లమెంటు ఆమోదం

రైతు ప్రయోజనాల పూర్తి స్థాయి రక్షణకు ఈ శాసనాల్లో భరోసా;

కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులసేకరణ కొనసాగింపుపై
గౌరవ ప్రధాని స్వయంగా హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ ప్రకటన

Posted On: 20 SEP 2020 2:13PM by PIB Hyderabad

   దేశంలో వ్యవసాయాన్ని పూర్తి ప్రయోజన కరంగా సంస్కరించి, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన రెండు బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. 2020 సంవత్సరపు రైతుల ఉత్పాదనల వాణిజ్యం (ప్రోత్సాహక, సదుపాయ) బిల్లుకు, రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లుకు ఈరోజు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఇవే బిల్లులకు 2020 సెప్టెంబరు 17 లోక్ సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2020 సెప్టెంబరు 14 రెండు బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2020 జూన్ 5 జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రెండు బిల్లులను ప్రభుత్వం తీసుకువచ్చింది.

  బిల్లులపై మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ,..రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేందుకు, రైతుల ఆదాయం పెంపొందించేందుకు, వారి జీవనోపాధి స్థాయి మెరుగుదలకు నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం గత ఆరేళ్లలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. రైతుల ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు సేకరించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. విషయమై ప్రధానమంత్రి స్వయంగా భరోసా ఇచ్చారని, 2014-20 కాలంలో కనీస మద్దతు ధర గణనీయంగా పెరిగిందని, రాబోయే వారం రోజుల్లో రబీ సీజన్ కు కనీస మద్దతు ధరను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. కొత్తగా పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లుల్లో రైతుల ప్రయోజనాల పూర్తి స్థాయి రక్షణకు భరోసా కల్పించినట్టు చెప్పారు.

 

రైతుల ఉత్పాదనల వాణిజ్యం (ప్రోత్సాహక, సదుపాయ) బిల్లు

ప్రధాన అంశాలు

 • వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం, కొనుగోలు జరిగే చోటుకు సంబంధించి రైతులు, వ్యాపారులకు స్వేచ్ఛగా వ్యవహరించగలిగే వ్యవస్థ కల్పనకు బిల్లు దోహదపడుతుంది.
 • రాష్ట్రంలోను, వివిధ రాష్ట్రాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేని వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి వీలు కల్పిస్తుంది. సంబంధిత రాష్ట ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదనా మార్కెటింగ్ శాసనం నోటిఫై చేసిన వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా పంటల వాణిజ్యానికి అవకాశం కల్పిస్తుంది.
 • రైతులు తమ ఉత్పత్తుల విక్రయం జరిపినందుకు వారిపై సుంకం, లేదా లెవీ విధింపు ఉండదు. రవాణా చార్జీలను భరించాల్సిన అవసరం కూడా ఉండదు.
 • నిరాటంకమైన వాణిజ్య ప్రక్రియ సజావుగా జరిగేలా లావాదేవీల వేదికకోసం ఎలక్ట్రానిక్ వాణిజ్య పద్ధతిని బిల్లు కల్పిస్తుంది.
 • వ్యవసాయ మండీల సదుపాయానికి అదనంగా ఫార్మగేట్లు, శీతలీకరణ గిడ్డంగులు, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు తదితర ప్రాంతాల్లో వాణిజ్యం జరపడానికి రైతులకు స్వేచ్ఛ.
 •  రైతులు నేరుగా మార్కెటింగ్ కార్యకలాపాలు జరపగలిగే అవకాశం. తద్వారా మధ్యదళారులను తప్పించడంతో రైతుల ఉత్పత్తులకు పూర్తి స్థాయిలో ధర లభించే అవకాశం.

సందేహాలు

 • కనీస మద్దతు ధరపై వ్యవసాయ ఉత్పాదనల సేకరణ ప్రక్రియ ఆగిపోవచ్చు.
 • వ్యవసాయ ఉత్పాదనల మార్కెట్ కమిటీల అధీకృత మండీల్లో కాకుండా ఇతర చోట్ల రైతుల ఉత్పత్తుల అమ్మకం జరిగిన పక్షంలో సదరు మండీలు ఇకపై పనిచేయకపోవచ్చు.
 • మండీల్లో సాగే -నామ్ (e-NAM) వంటి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ వాణిజ్య పోర్టల్స్ భవితవ్యం ఏమిటి?

 వివరణ

 • కనీస మద్దతు ధరకు సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది., రైతులు ఎప్పటిలా కనీస మద్దతు ధరకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. రబీ సీజన్ కు వర్తించే కనీస మద్దతు ధరపై వచ్చే వారంలో ప్రకటన ఉంటుంది.
 • మండీలు నిలిచిపోయే ప్రసక్తే లేదు. వాటిల్లో ఎప్పటిలా వ్యాపారం కొనసాగుతుంది. కొత్త వ్యవస్థ ప్రకారం మండీల్లోనేకాక, ఇతర స్థలాల్లో కూడా తమ ఉత్పత్తులను అమ్ముకునే ప్రత్యామ్నాయం రైతులకు అందుబాటులో ఉంటుంది.
 • మండీల్లో సాగే నామ్ (e-NAM) వాణిజ్య వ్యవస్థ కూడా ఎప్పటిలా కొనసాగుతుంది.
 • ఎలక్ట్రానిక్ వాణిజ్య వేదికలపై వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం కొనసాగుతుంది. మరింత పారదర్శకతకు, సమయం ఆదా చేసుకోవడానికి ఇది దోహదపడుతుంది.

 

రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం బిల్లు

ప్రధాన అంశాలు

 • పంటల  ప్రాసెసింగ్ సంస్థలతో, టోకు వ్యాపారులతో, అగ్రిగేటర్లతో, భారీ రిటెయిలర్లతో, ఎగుమతిదార్లతో రైతులు విక్రయ ఒప్పందం కుదుర్చుకోవడానికి కొత్త బిల్లు వీలు కల్పిస్తుంది. ఉత్పత్తుల ధరపై హామీతో ఇరు పక్షాలకు సమాన, సక్రమ అవకాశాలు లభించేలా పంటనాట్లకు ముందే ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు ఉన్న పక్షంలో రైతులకు కూడా కనీస ధరకంటే ఎక్కువ ధర లభించే అవకాశం ఉంటుంది.
 • బిల్లుతో మార్కెట్ అనూహ్య పరిణామాల ముప్పును రైతులు ఎదుర్కొనాల్సిన  అగత్యం ఉండదు. రైతులతో ఒప్పందం కుదుర్చుకునే స్పాన్సారర్ కు బాధ్యత బదిలీ అవుతుంది. ధరపై ముందస్తు ఒప్పందం కారణంగా, మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల ముప్పు నుంచి రైతులకు రక్షణ లభిస్తుంది.
 • బిల్లుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం కాగలిగే అవకాశం కూడా రైతులకు లభిస్తుంది. మంచి విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉపకరణాలు కూడా లభిస్తాయి.
 • రైతులకు మార్కెటింగ్ వ్యవహారాల ఖర్చు తగ్గుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది.
 • వివాదాలు ఏర్పడిన పక్షంలో వాటిని సమర్థంగా పరిష్కరించే యంత్రాగాన్ని ఏర్పాటు చేశారు. వివాదాల పరిష్కారానికి స్పష్టమైన గడువుతో వ్యవస్థను ఏర్పాటు చేశారు
 • వ్యవసాయ రంగంలో పరిశోధనకు, కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు.

సందేహాలు

 • కాంట్రాక్ట్ వ్యవసాయం కింద రైతులకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అందువల్ల వారు తమ ఉత్పత్తులకు తగిన ధరను నిర్ణయించుకోలేక పోవచ్చు.
 • చిన్న రైతులు కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ఎలా అనుసరించగలరు? స్పాన్సారర్లు వారిని పట్టించుకోకుండా దూరంగా పెట్టవచ్చు.
 • కొత్త వ్యవస్థ రైతులకు సమస్యగా పరిణమించవచ్చు.
 • ఏదైనా వివాదం ఏర్పడినపుడు, భారీ కంపెనీలు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవచ్చు.

వివరణ

 • కాంట్రాక్ట్ ఒప్పదంలో తన ఉత్పత్తికి తగిన అమ్మకం ధరను నిర్ణయించుకునే పూర్తి అధికారం రైతుకు ఉంటుంది. గరిష్టంగా మూడు రోజుల్లోగానే వారికి చెల్లింపు ఉంటుంది.
 • దేశ వ్యాప్తంగా 10వేల వరకూ రైతు ఉత్పాదక సంఘాలు ఏర్పాటవుతున్నాయి. చిన్న చిన్న రైతులను  ఒక్క తాటిపైకి తీసుకువచ్చి, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా రైతు ఉత్పాదక సంఘాలు కృషి చేస్తాయి.
 • కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత రైతులు వ్యాపారులకోసం వెదుక్కోవలసిన అవసరం ఉండదు. కొనుగోలు చేసే వినియోగదారుడు కూడా వ్యవసాయ క్షేత్రంనుంచే నేరుగా ఉత్పాదనను తీసుకునే అవకాశం ఉంటుంది.
 • ఏదైనా వివాదం తలెత్తిన పక్షంలో, పదేపదే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వివాద పరిష్కారానికి అవసరమైన యంత్రాగం స్థానికంగానే  అందుబాటులో ఉంటుంది.

 

****(Release ID: 1657082) Visitor Counter : 921