ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్ బసవేశ్వర జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం
Posted On:
26 APR 2020 9:06PM by PIB Hyderabad
నమస్కారం,
భగవాన్ బసవేశ్వర జయంతి సందర్భం లో మీకందరికీ ఇవే శుభాకాంక్షలు.
కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచానికి కొనితెచ్చిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కోరుకొనేది ఏమిటి అంటే మన అందరి పట్ల భగవాన్ బసవేశ్వర కృప ను చూపాలని, భారతదేశవాసులం అయిన మనమంతా కలసి ఈ మహమ్మారి ని ఓడించాలనీ, అంతేకాకుండా, ఒక్క భారతదేశానికే కాకుండా, పూర్తి మానవ జాతి సంక్షేమానికి కూడా ఎంతో కొంత తోడ్పాటు ను మనం అందించగలిగినవారము అవ్వాలనీనూ.
మిత్రులారా,
భగవాన్ బసవేశ్వర వచనాల నుంచి, ఆయన సందేశాల నుంచి నిరంతరం నేర్చుకొనే సౌభాగ్యం నాకు దక్కింది. ఆయన వచనాలను దేశం లోని 23 భాషల లోకి అనువాదం చేయడం కావచ్చు, లేదా లండన్ లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భం కావచ్చు.. ప్రతి సారి, నేను ఒక కొత్త శక్తి ని అనుభవం లోకి తెచ్చుకొన్నాను.
మిత్రులారా,
బసవన్న వచనాల డిజిటలీకరణ ప్రక్రియ ను గురించి 2017 వ సంవత్సరం లో నేను చేసిన ప్రతిపాదన విషయం లో మీరందరూ విస్తృత కృషి చేశారన్న సంగతి నా దృష్టి కి వచ్చింది. నిజానికి ఈ కార్యక్రమాన్ని సైతం ఈసారి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మాధ్యమం ద్వారానే నిర్వహిస్తున్నారు.
లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ, ఒక విధం గా ఈ ఆన్ లైన్ కలయిక కూడా ఒక చక్కని ఉదాహరణ గా నిలుస్తోందని చెప్పవచ్చు.
మీ ఈ ప్రయత్నం ద్వారా బసవన్న చూపిన మార్గంతో, ఆయన ఆదర్శాలతో ప్రపంచం లో మరెంతో మంది జతపడగలుగుతారు.
మిత్రులారా,
ప్రపంచం లో రక రకాల వ్యక్తులు ఉన్నారు. కొంత మంది మంచి విషయాలను గురించి మాట్లాడుతారు తప్ప, వాటిని వారంతట వారుగా పాటించరు అనే సంగతి ని మనం గమనించాం. ఏది మంచో తెలిసిన వారు కొంత మంది ఉన్నారు కానీ, ఏది మంచి అనేది చెప్పడానికి వారు భయపడుతూ ఉంటారు. అయితే, బసవన్న కేవలం బోధన మార్గాన్ని ఎంచుకోవడమే కాకుండా, ఈ సమాజం లో, ప్రజలలో తాను చూడగోరిన మార్పులను, సంస్కరణలను తాను స్వయంగా ఆచరించారు. మనం ఆ మార్పులను అనుసరించినప్పుడు మనమే ఉదాహరణలుగా మారుతాం. అది జరిగినప్పుడే, మనం మన చుట్టుపక్కల కొన్ని అర్థవంతమైన పరివర్తనలను తీసుకురాగలం. మీరు బసవన్న దైవీయ గుణాలను నేర్చుకోవడం ఒక్కటే కాకుండా, ఆయన వద్ద నుంచి ఒక చక్కటి పరిపాలకుడు, ఒక చక్కటి సంస్కరణవాది వలే కూడాను ఆమన నుంచి ప్రేరణ ను పొందగలుగుతారు.
భగవాన్ బసవేశ్వర వాణి, ఆయన వచనాలు, ఆయన ఉపదేశాలు జ్ఞానం తాలూకు ఎటువంటి ప్రవాహం అంటే అది ఆధ్యాత్మికం గానే గాక, ఒక అభ్యాస పూర్వక మార్గదర్శి లా దారిని కూడా చూపిస్తూ ఉంటుంది. ఆయన ఉపదేశాలు మనను సైతం ఒక ఉత్తమ మనిషి గా మారేందుకు శిక్షణనిస్తాయి, మన సమాజాన్ని కూడా మరింత ఉదారంగా, దయ కలిగిందిగా, మానవీయమైందిగా తీర్చిదిద్దుతాయి.
మరి మిత్రులారా, భగవాన్ బసవేశ్వర ఆడిన మాటలు ఆయన ఎంతటి దూరదృష్టి ని కలిగి ఉన్నారో అన్న విషయాన్ని కూడాను మనకు చాటిచెప్తాయి. శతాబ్దాల కిందట భగవాన్ బసవేశ్వర్ సాంఘిక సమానత్వం గురించి, పురుషులు- మహిళల సమానత్వం వంటి వాటి విషయంలో ఈ సమాజానికి మార్గదర్శనం చేశారు. బలహీన వర్గాలకు చెందినవారికి సమాన హక్కులు, సమాన గౌరవం దక్కవో అంత వరకు మన పురోగతి అసంపూర్తి గా ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన ఆ కాలంలోనే సమాజానికి బోధించారు.
బసవన్న సంఘం లోని అట్టడుగు వర్గానికి చెందిన వ్యక్తి కి ప్రాధాన్యం ఉండేటటువంటి సామాజిక ప్రజాస్వామ్యానికి పునాది ని వేశారు. బసవన్న మానవ జీవనం తాలూకు ప్రతి ఒక్క అంశాన్ని స్పర్శించారు. మరి ఆయన ఆ అంశాన్ని మెరుగుపరచడానికి పరిష్కారాలను సైతం సూచించారు. బసవన్న ఎల్లవేళల కఠోర శ్రమ ను గౌరవించారు. కష్టించి పని చేయడం, చెమటోడ్చడం.. ఈ రెంటికి ఆయన ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. ప్రతి వ్యక్తి,, సమాజం లో పెద్ద లేదా చిన్న మనిషి, దేశానికి సేవ చేయడంలో ఒక శ్రామికుడే అని ఆయన అనే వారు.
ఆయన ప్రపంచ దార్శనికత కరుణ తో, ప్రేమ తో నిండిపోయి ఉండేది. ఆయన ఎల్లప్పటికీ ప్రేమ ను, అహింస ను భారతీయ సంస్కృతి తాలూకు కేంద్ర స్థానం లో నిలిపారు. ఈ కారణంగా ఈ రోజున మన భారతదేశం వివిధ సవాళ్ళను పరిష్కరించుకొంటూ ముందుకు సాగుతోంది. అటువంటప్పుడే బసవన్న ప్రవచించిన ఆదర్శాలు అంతే సందర్భ శుద్ధి ని సంతరించుకొంటాయి.
అది ఆయన చెప్పిన దివ్య బోధలు కావచ్చు లేదా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఆయన ఆలోచనలు కావచ్చు లేదా స్వయం సమృద్ధి కోసం చేసే కృషి కావచ్చు.. బసవేశ్వర సదా వాటిని సమాజ నిర్మాణంలో ఒక ముఖ్య భాగంగా ఎంచారు. ఆయన ఎల్లవేళలా సమాజం తాలూకు ఏకత్వాన్ని నమ్మారు. అలాగే ప్రాకృతిక వనరులను, సామాజిక వనరులను, న్యాయ సమ్మతమైన విధంగా ఉపయోగించుకోవాలని చెప్తూ ఉండేవారు. ఆయన భావాలు వందల సంవత్సరాల క్రితం మాదిరిగానే ఈ రోజు కు కూడా ముఖ్యమైనవే.
మిత్రులారా,
చివరకు 21వ శతాబ్దానికి చెందిన భారతదేశం లోనూ, నేను నా దేశవాసుల లో ఒక సార్ధక మార్పు ను తీసుకురావాలన్న బలమైన ఇచ్ఛాశక్తి ని, దృఢ నిశ్చయాన్ని చూస్తున్నాను. బసవన్న స్ఫూర్తి ని నింపినటువంటి సంకల్పం కూడా ఇదే సుమా.
ప్రస్తుతం భారతీయులకు మార్పు నిజంగా తమతోనే మొదలవుతోందనిపిస్తోంది. ఈ తరహా ఆశ, నమ్మకం, అండగా నిలబడేదే. ఇది అత్యంత క్లిష్ట సవాళ్ళ బారి నుంచి దేశాన్ని బయటపడేయటానికి ఎంతగానో సాయపడుతోంది, సాయపడుతూనే ఉంటుంది.
మిత్రులారా,
ఈ ఆశ ను నమ్మకం తో కూడిన సందేశాన్నే మనం ముందుకు తీసుకుపోవలసివుంది. మనం దీనిని బలపరచవలసి ఉంది కూడాను. ఇది మరింతగా కృషి చేయడానికి, మరింత ఉదారత్వాన్ని చాటడానికి మనకు ప్రేరణ ను ఇస్తుంది. ఇది మన దేశాన్ని ఈ దశాబ్దం లో కొత్త శిఖరాలకు తీసుకుపోతుంది.
మీరంతా భగవాన్ బసవేశ్వర బోధనలను, ఆదర్శాలను ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చేస్తూ ఉండండి. అంతేకాదు, ఈ ప్రపంచాన్ని ఒక ఉత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దండి. ఈ అపేక్షతో, నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను.
ఆఁ, ఈ కార్యభారాలన్నిటి నడుమ, మీరందరూ మీ మీ ఆరోగ్యం పట్ల కూడా తప్పక శ్రద్ధ వహించి, (ఒక మనిషికి మరొక మనిషి కి నడుమ) ‘రెండు గజాల’ దూరాన్ని పాటించే నియమాన్ని అనుసరిస్తూ సాగిపోండి. మరోసారి, మీ అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
***
(Release ID: 1655520)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil