ప్రధాన మంత్రి కార్యాలయం

గాయపడ్డ సైనికులతో లేహ్ ఆసుపత్రి లో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 03 JUL 2020 8:23PM by PIB Hyderabad

మిత్రులారా,

మీ అందరికీ నమస్కరించడం కోసమే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను.  ఎందుకంటే, మీరు ఎంతటి వీరత్వం తో పోరాటం లో పాల్గొన్నారంటే, మనను వీడి వెళ్లిన వీరులు సైతం ఊరకనే అలాగ ఏమీ నిష్క్రమించ లేదు. మీరంతా కలిసికట్టుగా దీటైన జవాబునిచ్చారు. బహుశా మీరు గాయపడి, ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి మీకు దీని గురించిన అంచనా చిక్కలేదేమో.  130 కోట్ల మంది దేశ ప్రజలకు మీ పట్ల అమిత గౌరవాదరణలు ఉన్నాయి.   మీ ఈ సాహసం, మీ ఈ శౌర్యం యావత్తు నవ తరానికి ప్రేరణను ఇస్తున్నాయి.  మరి ఈ కారణం గా మీ ఈ పరాక్రమం, మీ సాహసం, మీరు చేసిన ధైర్యమైన పని.. ఇవి మన యువత కు, మన దేశ వాసులకు రాబోయే రోజుల్లలో దీర్ఘ కాలం పాటు స్ఫూర్తి ని అందిస్తూ ఉంటాయి.  ఇవాళ ప్రపంచం స్థితి ఎలా ఉందంటే, భారత వీర జవానులు ఇదుగో ఇలాంటి పరాక్రమాన్ని ప్రదర్శించారు, అది కూడా ఎంతటి శక్తులను వారు ఎదురించి నిలబడ్డారో అంటూ మెసేజ్ లు వచ్చాయంటే ఇక అప్పుడు ప్రపంచం కూడా ఇంతకూ ఈ యువకులు ఎవరు?, ఎలాంటి శిక్షణ ను వారు తీసుకున్నారు?, వారి త్యాగం ఎంత ఉన్నతమైంది?, వారి దీక్ష ఎంత గొప్పది అనే విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి ని చూపుతుంది.  ఇవాళ యావత్తు ప్రపంచం మీ పరాక్రమాన్ని గురించి అనేక విశ్లేషణలు చేయడానికి పూనుకొంటోంది.

నేను ఈ రోజు న కేవలం మీకు నమస్కరించడం కోసమే వచ్చాను.  మీతో భేటీ అయ్యి, మిమ్మల్ని చూసి నేను ఒక విధమైన శక్తి ని నింపుకొని, ఒక ప్రేరణ ను తీసుకుని మరీ వెళ్తున్నాను.  మన భారతదేశం స్వయంసమృద్ధం కావాలి, ప్రపంచంలో ఏ బలం ఎదుటా భారతదేశం ఎప్పుడూ తల వంచలేదు, ఎన్నటికీ తల వంచబోదు కూడా.  

నేను ఈ మాటలను అంటున్నానంటే అందుకు కారణం మీ వంటి పరాక్రమవంతులైన మిత్రులే.  మీకు ఇదే నా ప్రణామం.  మిమ్మల్ని కన్న వీర మాతలకు కూడా ఇదే నా వందనం.  మీ వంటి వీర యోధులకు జన్మనిచ్చి, లాలించి, పెంచి పోషించి దేశ రక్షణ కోసం అప్పగించేసిన తల్లులు అందరికీ శతకోటి నమస్సులు.  ఆ తల్లులు అందరినీ ఎంత గౌరవించుకున్నప్పటికీ, వారికి శిరస్సును వంచి మరీ అభివందనాలు చేసినప్పటికీ అది తక్కువే అవుతుంది.

మరొక్క సారి, మిత్రులారా, మీరందరు త్వరగా కోలుకోవాలి; ఆరోగ్యవంతులవ్వాలి. 

ఈ ఆలోచన తో,

రండి.. మనమంతా ముందుకు సాగుదాం.

స్నేహితులారా, మీకు ఇవే ధన్యవాదాలు.



 

***



(Release ID: 1655019) Visitor Counter : 136