ఆయుష్

కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఆయుష్ నియమావళి

Posted On: 14 SEP 2020 4:00PM by PIB Hyderabad

కోవిడ్-19 వైరస్ నంచి కోలుకున్న వారికోసం చికిత్సానంతరం అనుసరించవలసిన  ఆరోగ్య రక్షణ నిర్వహణా నియమావళిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.  2020 సెప్టెంబరు 13 నియమావళి విడుదలైంది. కోవిడ్ రోగులకోసం ఇంటివద్ద పాటించవలసిన ఒక సమగ్రమైన సంపూర్ణమైన పద్ధతిని నియమావళి నిర్దేశిస్తోంది. అయితే, దీన్ని వైరస్ కు నిరోధక విధానంగా వినియోగించరాదని నియమావళిలో పేర్కొన్నారు. తీవ్రమైన లక్షణాలతో వ్యాధి సోకిన  వారు, ఇదివరకే ఇతర వ్యాధులు ఉన్న కోవిడ్ బాధితులు కోలుకునే వ్యవధి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని  నియమావళి పేర్కొంది. కోవిడ్ నుంచి రికవరీ అయిన వారు వేగంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుకావడానికి ఆయుష్ పరిధిలోని వివిధ రకాల ఆరోగ్య రక్షణ సదుపాయాలను, పద్ధతులను కూడా సూచించింది.

   కోవిడ్-19 వైరస్ అనేది కొత్త వ్యాధి, దీని సహజ పరిణామం, ప్రవర్తనా తీరుపై రోజువారీ

సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. కోలుకున్న తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడానికి పాటించవలసిన జాగ్రత్తలపై కూడా  అధ్యయనం చేస్తున్నారు. వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెలికి తీసేందుకు రికవరీ తర్వాత వైరస్ తీరుపై క్రియాశీలకమైన పరిశోధనను కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కోవిడ్-19 నుంచి కోలుకున్న వారు అలసట, దగ్గు, గొంతునొప్పి వంటి రకరకాల లక్షణాలతో బాధపడుతున్నారు.

  కోలుకున్న రోగులు నియమావళి ప్రకారం మాస్కును సక్రమంగా వినియోగించడం, చేతుల పరిశుభ్రత శ్వాసకు సంబంధించి ఆరోగ్యకరమైన పద్ధతులను, భౌతిక దూరాన్ని పాటించడం  కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆయుష్ వైద్యులు సిఫార్సుచేసిన ప్రకారం వారు తగిన మోతాదులో వేడి నీటిని తాగడం, రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆయుష్ మందు వాడటం తప్పనిసరి అని నియమావళి చెబుతోంది. నిర్దేశించిన పరిమితిలో స్వల్పంగా, లేదా ఒక మోస్తరుగా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం ప్రతిరోజూ చేయాలని, తమకు సౌకర్యవంతమైన లేదా శారీరకంగా ఓర్చుకోగలిగిన  వేగంతో ఉదయం లేదా సాయంత్రం నడకను కూడా సాధన చేయాలని నియమావళి పేర్కొంటోంది

  దీనితోపాటుగా, సునాయాసంగా జీర్ణమయ్యే, తాజాగా తయారు చేసిన సమతుల పోషకాహారం తీసుకోవాలని నియమావళి చెబుతోంది. సమాజ స్థాయిలో అయితే, ఎవరైనా వ్యక్తి వైరస్ నుంచి కోలుకొని, పునరావాసం పొందే  ప్రక్రియకోసం,.. స్వయంసహాయ సంఘాలు, అర్హులైన వృత్తి నిపుణుల సహాయం తీసుకోవచ్చని నియమావళి సూచిస్తోంది, ఇంటివద్దనే  ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుని కోలుకున్న రోగి ఎవరికైనా వ్యాధి లక్షణాలు కొనసాగిన పక్షంలో సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించవచ్చని చెబుతున్నారు.

  ఇక వ్యక్తిగత స్థాయిలో అయితే, రోగనిరోధక శక్తిని పెంచే ఆయుష్ మందులను వినియోగించుకోవచ్చు. ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా, అర్హుడైన వైద్యడి సిఫార్సుల ప్రకారం మందులు వినియోగించవచ్చు. ఆయుష్ క్వాత్, సంశామినీ వటి, గిలోరీ  వంటి చూర్ణాలను గోరువెచ్చని నీటితో అనుపానంగా తీసుకోవచ్చు. అశ్వగంధ, చ్యవన ప్రాశ వంటివి కూడా తీసుకోవచ్చు. ఇంకా, ఉసిరి, అతిమధురం మూలికా చూర్ణం, పసుపు పాలు వంటివి  తీసుకోవచ్చని సిఫార్సు చేస్తున్నారు.

******

 

 


(Release ID: 1654162) Visitor Counter : 266