సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎం.ఎస్.ఎం.ఈ. లకు బకాయిలు: ఈ చెల్లింపులను గ్రహించడానికి ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ప్రభుత్వ ఏజెన్సీలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల తరువాత, కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ విషయంపై ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో కూడా చర్చిస్తుంది.
చిన్న యూనిట్లతో సంఘీభావం చూపించి, ప్రాధాన్యతపై ఎం.ఎస్.ఎం.ఈ.ల బకాయిలను వెంటనే చెల్లిచాలని కోరుతూ, ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ 500 ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు చెందిన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లకు లేఖలు వ్రాసింది.
ఎం.ఎస్.ఎం.ఈ. లకు నగదు అందుబాటులో ఉండే విధానాన్ని మెరుగుపరిచేందుకు, 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలు టి.ఆర్.ఈ.డి.ఎస్. వేదికను ఆశ్రయించాలి.
Posted On:
14 SEP 2020 12:14PM by PIB Hyderabad
వివిధ రంగాల ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ. ల బకాయిలను చెల్లించే మరో ప్రధాన దశలో భాగంగా, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.ఎం.ఈ.) ఇప్పుడు దేశంలోని ప్రైవేటు రంగ సంస్థల నుండి, ఎం.ఎస్.ఎం.ఈ.ల బకాయిల చెల్లింపులను ప్రాధాన్యతతో విడుదల చేయించడానికి చర్యలు తీసుకుంటోంది.
ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా, 45 రోజుల్లో ఎం.ఎస్.ఎం.ఈ. రాబడులు మరియు బకాయిలు చెల్లించాలని కోరడం జరిగింది. దీని ప్రకారం ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ ఈ విషయమై, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వారి విభాగాలు మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సి.పి.ఎస్.ఈ.ల) తో తీవ్రంగా చర్చిండం జరిగింది. వారితో రాయడం మరియు అనుసరించడం తో పాటు, రిపోర్టింగ్ కోసం మంత్రిత్వ శాఖ ఆన్ లైన్ వ్యవస్థను కూడా రూపొందించింది. నెలవారీ బకాయిలు మరియు చెల్లింపుల గురించి వందలాది సి.పి.ఎస్.ఈ. లు గత నాలుగు నెలల నుండి ఈ వ్యవస్థ ద్వారా వివరాలను అందజేస్తున్నాయి. సుమారు 10 వేల కోట్ల రూపాయల మేర వివిధ మంత్రిత్వ శాఖలు, సి.పి.ఎస్.ఈ. లు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా, మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలతో కూడా ఈ సమస్యపై చర్చలు జరిపి, పర్యవేక్షించడానికి మరియు అలాంటి చెల్లింపులు త్వరగా జరిగేలా చూడడానికి చర్యలు తీసుకోవలసిందిగా కోరింది.
ఇప్పుడు ప్రయత్నాలను మరింత తీవ్రంగా తీసుకొని, దేశంలోని 500 ప్రముఖ కార్పొరేట్ గ్రూపులతో మంత్రిత్వ శాఖ నేరుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది. ఈ ఐదు వందల కార్పొరేట్ సంస్థల యజమానులు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు లేదా ఉన్నతాధికారులకు మంత్రిత్వ శాఖ ఈ మెయిల్ ద్వారా లేఖలు రాసింది. ఈ క్లిష్ట సమయాల్లో తన మద్దతు మరియు సంఘీభావాన్ని తెలియజేస్తూనే, ఎం.ఎస్.ఎం.ఈ. ల పెండింగ్ లో ఉన్న చెల్లింపుల సమస్యను మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. చాలా ఎం.ఎస్.ఎం.ఈ. లు పెద్ద పెద్ద కార్పొరేట్ గ్రూపులతో వ్యాపారం చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే, వారి వస్తువులు మరియు సేవల కొనుగోలుదారులు మరియు వినియోగదారుల నుండి చెల్లింపులు రావడం లేదు. ఎం.ఎస్.ఎం.ఈ. రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక కుటుంబాల వారు, నిపుణులు మరియు కార్మికులు ఆధారపడటం సర్వసాధారణమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలి నెలల్లో చెల్లింపులు చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి నుండి ఇంకా రావలసింది చాలా ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది.
పరిస్థితిని పరిష్కరించడానికి, కార్పొరేట్ ప్రపంచానికి మంత్రిత్వ శాఖ మూడు నిర్దిష్ట సూచనలు చేసింది.
* ఈ చెల్లింపులు ఎం.ఎస్.ఎం.ఈ. ల కార్యకలాపాలకు మరియు ఉద్యోగుల జీవనోపాధికీ మరియు ఇతర ఆర్థిక కార్యక్రమాలకు క్షేత్రస్థాయిలో చాలా ముఖ్యమైనవని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది అంతిమంగా కార్పొరేట్ ప్రపంచంతో సహా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల అలాంటి చెల్లింపులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయో లేదో పరిశీలించి, వాటిని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది;
* ఎం.ఎస్.ఎం.ఈ. లకు నగదు అందుబాటులో ఉండే విధంగా చూసేందుకు, మరొక పరిష్కార మార్గంగా, 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సి.పి.ఎస్.ఈ. లు కార్పొరేట్ సంస్థలన్నీ టి.ఆర్.ఈ.డి.ఎస్. వేదికను ఆశ్రయించడం తప్పనిసరి అని 2018లో ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. అయినప్పటికీ, చాలా కార్పొరేట్ సంస్థలు ఇంకా దీనిలో చేరవలసి ఉంది, ఒక వేళ చేరినా దానిపై లావాదేవీలు చేయలేదు. టి.ఆర్.ఈ.డి.ఎస్. లో ఆన్‌బోర్డ్ చేసి తమ లావాదేవీలను ప్రారంభించవలసిందిగా ఆ సంస్థలను కోరడం జరిగింది.
* ఎం.ఎస్.ఎం.ఈ. లకు చెల్లించాల్సిన బకాయిలపై, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అర్ధ-వార్షిక రిటర్నులను దాఖలు చేయడం తప్పనిసరి అని కూడా మంత్రిత్వ శాఖ, అన్ని కార్పొరేట్ సంస్థలకు గుర్తు చేసింది. ఇప్పటికే అలా చేయకపోతే రిటర్నులను వెంటనే దాఖలు చేయాలని కార్పొరేట్ సంస్థలను అభ్యర్థించారు.
చిన్న యూనిట్ల పట్ల సానుకూలంగా స్పందించాలని, కార్పొరేట్ ఇండియాకు ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తూ, ఎం.ఎస్.ఎం.ఈ. రాబడులను 45 రోజుల లోపు చెల్లించాలని ఆదేశిస్తూ, ఎం.ఎస్.ఎం.ఈ. అభివృద్ధి చట్టం, 2006 లో పేర్కొన్న చట్టపరమైన నిబంధనలను గుర్తుచేసింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గొప్ప సహకారం అని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చెల్లింపులు మిలియన్ల మంది ముఖాలపై చిరునవ్వు చిందిస్తాయని మంత్రిత్వ శాఖ భావిస్తోంది, ఎం.ఎస్.ఎం.ఈ. రంగంలోని సంస్థలే వీరి జీవనోపాధికి ఏకైక వనరుగా ఉంది.
మరింత ముందుకు వెళ్ళి, సామాజిక మాధ్యమం ద్వారా కూడా ఇతర కార్పొరేట్ సంస్థలతో ఈ విషయంపై చర్చిస్తామని కూడా, ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
*****
(Release ID: 1654074)
Visitor Counter : 222