ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్య ప్రదేశ్ కు చెందిన వీధి విక్రేతల తో ‘స్వనిధి సంవాద్’ ను నిర్వహించిన ప్రధాన మంత్రి
మహమ్మారి బాధిత వీధి వ్యాపారస్తులు తిరిగి వారి జీవనోపాధి ని సంపాదించుకోవడానికి సాయపడేందుకే స్వనిధి పథకాన్ని ప్రారంభించడమైంది: ప్రధాన మంత్రి

ఈ పథకం 7 శాతం వరకు వడ్డీ తగ్గింపు ను ఇస్తుంది, అంతే కాదు ఒక ఏడాది లోపు రుణాన్ని చెల్లిస్తే మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది: ప్రధాన మంత్రి

వీధులలో తిరుగుతూ సరుకులు అమ్మే వారికి వ్యాపార లావాదేవీలకు, డిజిటల్ లావాదేవీలకు ఒటిటి వేదిక ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది: ప్రధాన మంత్రి

Posted On: 09 SEP 2020 2:02PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ కు చెందిన వీధి విక్రేతల తో ‘స్వనిధి సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.  వీధుల్లో తిరుగుతూ సరుకులను విక్రయించే పేద వ్యాపారులు కోవిడ్-19 సంక్షోభకాలం లో ఇబ్బందుల పాలవడంతో, వారు మళ్లీ వారి జీవనోపాధి కార్యకలాపాలను ఆరంభించుకొనేందుకు సాయపడే ఉద్దేశంతో పిఎం స్వనిధి పథకాన్ని భారత ప్రభుత్వం  2020 జూన్ 1 న  ప్రారంభించింది. మధ్య ప్రదేశ్ లో 4.5 లక్షల మంది వీధి వర్తకులు ఈ పథకం లో వారి పేర్లను నమోదు చేసుకున్నారు.  వారిలో దాదాపు గా 1.4 లక్షల వీధి వ్యాపారస్తుల కు 140 కోట్ల రూపాయల విలువైన సొమ్ము ను మంజూరు చేయడానికి ఆమోదం తెలపడమైంది.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మళ్లీ బలం పుంజుకొనేందుకు వీధి వ్యాపారులు చేసిన ప్రయత్నాలను ప్రశంసించడం తో పాటు వారి ఆత్మ విశ్వాసాన్ని, పట్టుదల ను, కష్టించి పనిచేసే తత్వాన్ని అభినందించారు.

ఒక వైపు మహమ్మారి విస్తరిస్తున్నప్పటికీ 4.5 లక్షల మందికి పైగా వీధి వ్యాపారస్తులను గుర్తించి, 1 లక్షకు పైగా అమ్మకందారుల కు 2 నెలల లోపల రుణాలను ఇచ్చే ప్రక్రియను పూర్తి చేసినందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషి ని ఆయన ప్రశంసించారు.

ఏ విపత్తు అయినా మొదట పేదలనే బాధిస్తుందని, అది వారి ఉద్యోగం, ఆహారం, పొదుపు మొత్తాలపై ప్రభావాన్ని చూపుతుందని
ప్రధాన మంత్రి అన్నారు.

పేద వలసదారుల్లో చాలా మంది వారి గ్రామాలకు తిరిగిరావలసిన పరిస్థితిని కల్పించిన కష్టకాలాలను గురించి ఆయన ప్రస్తావించారు.

మహమ్మారి ప్రభావం, లాక్ డౌన్ ల వల్ల పేదలకు, దిగువ మధ్యతరగతి వారికి ఎదురైన ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రభుత్వం మొదటి రోజు నుంచి ప్రయత్నిస్తూ వచ్చిందని శ్రీ మోదీ చెప్పారు.  ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ద్వారా ఉపాధి ని కల్పించడం తో పాటు ఆహారాన్ని, రేషను ను, ఉచిత గ్యాస్ సిలిండర్ లను అందించేందుకు ప్రభుత్వం సకల ప్రయత్నాలు చేసింది అని ఆయన తెలిపారు.

అలాగే ప్రభుత్వం వీధి వ్యాపారుల పట్ల కూడా శ్రద్ధ వహించిందని, వారికి చౌక గా మూలధనాన్ని సమకూర్చడం కోసం పిఎం స్వనిధి యోజన ను ప్రకటించిందని, దీనితో వారు వారికి బ్రతుకుదెరువు ను అందజేసే వ్యాపారాలను పున:ప్రారంభించుకోవడం సాధ్యపడుతుందని ప్రధాన మంత్రి వివరించారు.  లక్షలాది వీధి వ్యాపారస్తులు వ్యవస్థ తో నేరుగా జత పడడమనేది మొట్టమొదటిసారి గా జరిగింది, దీని ద్వారా వారు ప్రయోజనాన్ని అందుకోవడం మొదలవుతుంది అని శ్రీ మోదీ అన్నారు.

వీధి వ్యాపారులకు స్వతంత్రోపాధి ని, స్వయం పోషణ ను, ఆత్మవిశ్వాసాన్ని ( స్వరోజ్ గార్, స్వావలంబన్, స్వాభిమాన్ ) సమకూర్చడం స్వనిధి యోజన ధ్యేయం అని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రతి ఒక్క వీధి వర్తకుడు ఈ పథకాన్ని గురించిన అన్ని విషయాలను తెలుసుకొనేటట్లు చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  ఈ పథకాన్ని ఎంత సులభంగా రూపొందించడం జరిగిందీ అంటే, చివరకు సాధారణ ప్రజలు కూడా దీనితో జతపడగలుగుతారు అని ఆయన అన్నారు.  సామాన్య సేవా కేంద్రం నుంచి గాని, లేదా పురపాలక సంఘం కార్యాలయంలో గాని ఒక దరఖాస్తు ను అప్ లోడ్ చేయడం ద్వారా ఈ పథకం లో నమోదు కావచ్చు, వరసలో నిలబడాల్సిన పని లేదు అని ఆయన తెలిపారు.  బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ ఒక్కరే కాకుండా, పురపాలక సిబ్బంది కూడా వచ్చి వీధి వ్యాపారుల దగ్గర నుంచి దరఖాస్తు ను తీసుకొనేందుకు వీలు ఉంది అని ఆయన వివరించారు.

ఈ పథకం వడ్డీ పై 7 శాతం వరకు తగ్గింపు ను ఇస్తుందని, ఒకవేళ ఎవరైనా బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బును ఒక సంవత్సరం లోపే తిరిగి చెల్లిస్తే, అప్పుడు ఆ వ్యక్తి కి వడ్డీ లో తగ్గింపు లభిస్తుంది అని ఆయన అన్నారు. డిజిటల్ లావాదేవీల్లో నగదు ను వెనుకకు తిరిగి ఇచ్చే సదుపాయం కూడా ఉందని ఆయన అన్నారు.  ఈ పద్ధతి లో  మొత్తం వడ్డీ కన్నా మొత్తం పొదుపు మరింత ఎక్కువ గా ఉంటుందన్నారు.  దేశం లో డిజిటల్ లావాదేవీల సరళి గత 3- 4 సంవత్సరాల్లో శరవేగంగా పెరుగుతోందని కూడా ఆయన అన్నారు.

‘‘ప్రజలు సులువుగా, సరికొత్త గా మూలధనాన్ని అందుకొని వ్యాపకాన్ని మొదలుపెట్టడానికి ఈ పథకం తోడ్పడుతుంది.  మొట్టమొదటిసారి, లక్షలాది వీధి వ్యాపారులను  వ్యవస్థ కు వాస్తవం గా జతపర్చడం జరిగింది. మరి వారు ఒక గుర్తింపునకు నోచుకున్నారు.

ఈ పథకం వడ్డీ భారం నుంచి పూర్తి గా బయటపడేందుకు సహాయపడుతుంది.  ఈ పథకం లో 7 శాతం వరకు ఏదో ఒక విధం గా వడ్డీ తగ్గింపు ను ఇవ్వడం జరుగుతున్నది.  మన వీధి వ్యాపారులు డిజిటల్ దుకాణం నిర్వహణ లో వెనుకబడిపోకుండా చూడటానికి బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు సేవల ప్రదాన సంస్థల సహకారంతో ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వడమైంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  

కరోనా కాలం లో, వినియోగదారులు నగదు కన్నా ఎక్కువ గా డిజిటల్ లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  డిజిటల్ విధానం లో లావాదేవీలు జరపడానికి అలవాటు పడాలని వీధి వ్యాపారులకు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

ప్రభుత్వం ప్రస్తుతం ఒక ఒటిటి వేదిక ను తీసుకురాబోతోందని, దీని ద్వారా వీధి విక్రేతలంతా వారి వ్యాపారాన్ని డిజిటల్ మాధ్యమం లో నిర్వహించుకోగలుగుతారని శ్రీ మోదీ తెలిపారు.

పిఎం స్వనిధి పథకం లబ్ధిదారులు ఉజ్వల గ్యాస్ పథకం, ఆయుష్మాన్ భారత్ పథకం తదితర పథకాలను ప్రాధాన్య ప్రాతిపదిక న అందుకొంటారని ప్రధాన మంత్రి చెప్పారు.

‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ ద్వారా 40 కోట్ల కు పైగా పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజల బ్యాంకు ఖాతాలను తెరవడం జరిగింది, వారు ఇప్పుడు అన్ని ప్రయోజనాలను వారి ఖాతాల ద్వారా నేరు గా అందుకొంటున్నారు, అలాగే రుణాలను అందుకోవడం కూడా వారికి సులభతరం గా మారింది అని ప్రధాన మంత్రి అన్నారు.  డిజిటల్ హెల్త్ మిషన్, ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’, ‘ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన’, ‘ఆయుష్మాన్ భారత్’ వంటి ఇతర పథకాల ఘనతలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

గత ఆరేళ్ల కాలం లో దేశం లో పేదల జీవితాలను మెరుగుపర్చే అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.  నగరాలలో, ప్రధాన పట్టణాలలో భరించగలిగే అద్దె తో వసతి ని అందించడానికి ఒక ప్రధాన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన అన్నారు.

వన్ నేషన్ వన్ కార్డ్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, దీని ద్వారా ఎవరైనా దేశం లో ఎక్కడ అయినా సరే చౌక గా రేషన్ ను తీసుకోవచ్చు అని వివరించారు.

రాబోయే 1000 రోజుల లో 6 లక్షల గ్రామాల కు ఆప్టికల్ ఫైబర్ ను వేసే దిశ లో ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ కార్యక్రమం యావత్తు గ్రామీణ భారతాన్ని ఇటు దేశీయ మార్కెట్ కు, అటు అంతర్జాతీయ మార్కెట్ కు కలుపుతుంది, అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనోపాధి కి మరింత ఉత్తేజాన్ని కూడా అందిస్తుంది అని ఆయన అన్నారు.

వీధి వ్యాపారులు పరిశుభ్రత ను కాపాడాలని, కోవిడ్-19 వ్యాప్తి ని అడ్డుకోవడానికి అన్ని జాగ్రత్త చర్యలను పాటించాలని ప్రధాన మంత్రి కోరారు.  ఇది వారికి వారి వ్యాపారాన్ని పెంచుకోవడం లో దోహదపడుతుందని ఆయన అన్నారు.

 

***(Release ID: 1652638) Visitor Counter : 40