రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

నైపెర్ మొహాలి మరియు రాయ్ బరేలీల పనితీరును వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించిన - శ్రీ గౌడ మరియు శ్రీ మాండవియా.

పరీక్ష, కన్సల్టెన్సీ మరియు ఇంక్యుబేషన్ సెంటర్ల వంటి సేవలను విస్తరించడం ద్వారా పరిశ్రమలకు ముఖ్యంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది : గౌడ

ప్రజల శ్రేయస్సుపై భారీ ప్రభావాన్ని చూపే పరిశోధన పనులను ప్రాధాన్యతతో వేగవంతం చేయాలి : మాండవీయ

Posted On: 02 SEP 2020 12:31PM by PIB Hyderabad

మొహాలీ మరియు రాయ్ బరేలీలలో ఉన్న జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యా, పరిశోధనా సంస్థ (నైపెర్) పనితీరుపై కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి. వి. సదానంద గౌడ మరియు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ, నిన్న వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి, డాక్టర్ పి. డి. వాఘేలాతో పాటు ఫార్మాస్యూటికల్స్ విభాగానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో శ్రీ గౌడ మాట్లాడుతూ, రాబోయే బల్క్ డ్రగ్ మరియు వైద్య పరికరాల పార్కుల అభివృద్ధిలో  నైపెర్ సంస్థలకు ఎంతో ముఖ్య పాత్ర ఉందని పేర్కొన్నారు.  టిబి, మలేరియా, కాలా అజార్, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధుల నివారణకు అవసరమైన ఔషధాల ఆవిష్కరణపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.  ఔషధాల పునర్వినియోగం మరియు ఔషధాల అభివృద్ధి వంటి ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టాలని ఆయన కోరారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆర్ & డి. పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నందున, మొహాలీ లో ఉన్న నైపెర్ వంటి సంస్థలు, తమ స్వంత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. 

పరీక్ష, కన్సల్టెన్సీ మరియు ఇంక్యుబేషన్ సెంటర్ల వంటి సేవలను విస్తరించడం ద్వారా పరిశ్రమలకు ముఖ్యంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన చెప్పారు.  ఆదాయాన్ని పెంపొందించే ప్రతి అవకాశాలను అన్వేషించాలనీ, నైపెర్ సంస్థలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా అభివృద్ధి చెందాలనీ, ఆయన సూచించారు.  పరిశ్రమలు, విద్యా సంస్థల అనుసంధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనీ, ఇది నైపెర్ సంస్థలు కలిగి ఉన్న పేటెంట్లను వాణిజ్య సరళిలో వినియోగించుకోడానికి ఉపయోగపడుతుందనీ ఆయన పేర్కొన్నారు. 

ప్రజల శ్రేయస్సుపై పెద్దగా ప్రభావాన్ని చూపే పరిశోధన పనులకు ప్రాధాన్యత ఇచ్చి వేగవంతం చేయాలని శ్రీ మన్ సుఖ్ మాండవియా సూచించారు. 

నైపెర్, మొహాలి డైరెక్టర్ ఇన్ ‌చార్జిగా వ్యవహరిస్తున్న, నైపెర్, రాబరేలి, డైరెక్టర్, డాక్టర్ ఎస్.జె.ఎస్. ఫ్లోరా ఈ సందర్భంగా, నైపెర్, మొహాలి మరియు రాబరేలికి సంబంధించిన వివిధ అంశాలను సంక్షిప్త ప్రదర్శన ద్వారా వివరించారు.   ఫార్మసీ రంగంలో, ఎన్.ఐ.ఆర్.ఎఫ్. ప్రకటించిన ర్యాంకుల జాబితాలో, నైపెర్ మొహాలీ తృతీయ స్థానాన్ని సాధించగా, నైపర్ రాయబరేలీ 18వ స్థానాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు.  అన్ని భద్రతా జాగ్రత్తలతో 2020 సెప్టెంబర్ 28వ తేదీన నైపెర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుగుతుందనీ, అక్టోబర్ నుండి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందనీ, ఆయన వివరించారు.

జాతీయ ఫార్మాస్యూటికల్ విద్య మరియు పరిశోధనా సంస్థ (నైపెర్) - ఔషధ శాస్త్రాలలో ఒక జాతీయ స్థాయి సంస్థ.  ఔషధ శాస్త్రాలలో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలకు ఒక శ్రేష్ఠమైన కేంద్రంగా రూపొందించాలనే ఉద్దేశ్యంతో దీనిని నెలకొల్పడం జరిగింది. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొహాలి, అహ్మదాబాద్, హైదరాబాద్, రాయ్ బరేలి, గౌహతి, హాజీపూర్, కోల్‌కతాలలో ఏడు నైపర్ సంస్థలు ఉన్నాయి.  నైపర్ ను, భారత ప్రభుత్వం "జాతీయ ప్రాముఖ్యత గల సంస్థ" గా ప్రకటించింది. 

*****



(Release ID: 1650626) Visitor Counter : 132