రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 కారణంగా ఫినాల్ కు పెరిగిన డిమాండ్ ను తీర్చడానికి బెంగాల్ కెమికల్ & ఫార్మాస్యూటికల్ సంస్థ

ఒక్క రోజులో 51,960 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.

కోవిడ్ -19 మహమ్మారి పుట్టుక తరువాత ఫినాల్ నెలవారీ అమ్మకాలు రూ 4.5 నుంచి 6 కోట్ల దాకా పెరిగాయి.

Posted On: 25 AUG 2020 1:09PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ (బి సి పి ఎల్)  ప్రభుత్వ రంగ సంస్థ.కోవిడ్ -19 మహమ్మారి ప్రబలిన తరువాత  ప్రజల నుంచి ఫినాల్ కు డిమాండ్ అనేక రెట్లు పెరిగింది.  దానిని తీర్చడానికి బి సి పి ఎల్ తమ ఉత్పత్తిని ఇబ్బడి ముబ్బడిగా పెంచింది.  ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 51,960 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.  పశ్చిమ బెంగాల్ నార్త్ 24 - పరగణాల జిల్లాలోని బి సి పి ఎల్ పాణిహతి యూనిట్ ఈ ఘనత సాధించింది.    

మున్నెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు బి సి పి ఎల్ సంస్థ యాజమాన్యాన్ని మరియు ఉద్యోగులను కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ అభినందించారు.  

ఇంతటి ఉత్పత్తిని సాధించడం సంస్థ 120 సంవత్సరాల చరిత్రలో రికార్డు అని బి సి పి ఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్)  శ్రీ పి. ఎం. చంద్రయ్య తెలిపారు.   జూలై నెలలో మేము ఒక్క రోజులో  38,000 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేశాము.  ఆ తరువాత నెల రోజుల్లో ఉత్పత్తిని మరింత పెంచాం. ఇప్పుడు రోజుకు 50,000 సీసాల ఫినాల్ ఉత్పత్తి స్థాయికి ఎదిగాం.  ఆ విధంగా ఈ వారంలో 2020 ఆగస్టు 23వ తేదీన ఒక్క రోజులో 51,960 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేశామని ఆయన తెలిపారు.  

కోవిడ్ -19 మహమ్మారి ప్రబలడానికి ముందు  తాము  రోజుకు 15,000 సీసాల ఫినాల్ ఉత్పత్తి చేసేవారమని బిసిపిఎల్ సంస్థ తెలిపింది. "అప్పుడు కంపెనీ నెలవారీ ఫినాల్ అమ్మకాలు రూ. 3 నుంచి 3.5 కోట్ల వరకు ఉండెది.  కోవిడ్ వ్యాప్తి తరువాత నెలవారీ  ఫినాల్ అమ్మకాలు  రూ. 4.5 నుంచి  6 కోట్ల స్థాయికి పెరిగాయి.  ఫినాల్ కు భారీ డిమాండ్ ఉందనడానికి ఇదే స్పష్టమైన సూచన"

అక్టోబర్ 20వ తేదీ (పూజా సెలవులు) వరకు సంస్థ ఉద్యోగులు  కోవిడ్ ను ఎదుర్కొని అన్ని ఆదివారాలు మరియు సెలవు రోజుల్లో రెండు షిఫ్తులలో పనిచేసి శుభ్రతకు ఉపకరించే ఫినాల్ డిమాండ్ ను తీర్చడానికి కృషిచేస్తారు.

ఇంటిలో ఉపయోగించే  వస్తువులు, ఫార్మా మరియు పారిశ్రామిక ఉత్పత్తులను  తయారుచేసే మొట్టమొదటి భారతీయ  ఫార్మాస్యూటికల్ కంపెనీ బిసిపిఎల్.    

***



(Release ID: 1648533) Visitor Counter : 189