రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఆధునిక, హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మించిన రహదారి ప్రాజెక్టులను సమీక్షించిన - శ్రీ గడ్కరీ; ‘హరిత్ పాత్’ మొబైల్ యాప్ ప్రారంభం; మొక్కలకు ఈ -ట్యాగింగ్ ఉండేలా ఆదేశం.

రహదారి నిర్మాణ వ్యయాన్ని కనీసం 25 శాతం తగ్గించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించిన - కేంద్ర మంత్రి.

Posted On: 21 AUG 2020 3:16PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా రహదారి నిర్మాణంలో ఆధునిక, హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎం.ఎస్.ఎమ్.ఈ. శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నూతన హరిత రహదారుల విధానం (ప్లాంటేషన్) ను సమీక్షించడానికి, రహదారి నిర్మాణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి చర్చించడానికి ఈ రోజు నిర్విహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, నిర్మాణ వ్యయాన్ని 25 శాతం తగ్గించడం తమ లక్ష్యమనీ, ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమని పేర్కొన్నారు. 

జియో-ట్యాగింగ్ మరియు వెబ్ ఆధారిత జి.ఐ.ఎస్. ఆధారిత పర్యవేక్షణ పరికరాల ద్వారా మొక్కలను పర్యవేక్షించడానికి వీలుగా మొబైల్ యాప్ ‘హరిత్ పాత్’ ను మంత్రి ప్రారంభించారు.  అన్ని ప్లాంటేషన్ ప్రాజెక్టుల క్రింద ప్రతి ప్లాంట్ కోసం దాని ఫీల్డ్ యూనిట్ల యొక్క స్థానం, పెరుగుదల, జాతుల వివరాలు, నిర్వహణ కార్యకలాపాలు, లక్ష్యాలు మరియు విజయాలను పర్యవేక్షించడానికి ఈ యాప్ ను ఎన్.హెచ్.ఏ.ఐ. అభివృద్ధి చేసింది.  మొబైల్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, మొక్కల పెంపకం, చెట్ల మార్పిడిపై కఠినమైన పర్యవేక్షణ ఉండాలని మంత్రి ఉద్ఘాటించారు.

రహదారుల వెంబడి మొక్కల పెంపకం కోసం ప్రత్యేక వ్యక్తులు / ఏజెన్సీలను నియమించాలని కూడా మంత్రి సూచించారు.  ఇందులో స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, ఉద్యాన, అటవీ శాఖలు పాల్గొనెలా చూడాలని ఆయన సూచించారు.  2020 మార్చి వరకు రహదారులపై 100 శాతం మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించగలమని అధికారులు హామీ ఇచ్చారు.

చెట్ల మార్పిడి సమస్యపై చర్చిస్తున్నప్పుడు, శ్రీ గడ్కరీ మాట్లాడుతూ చెట్లన్నీ కత్తిరించకుండా కాపాడటం మన లక్ష్యం కావాలనీ, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక ఏజెన్సీలను ఇందుకోసం నియమించాలనీ సూచించారు.   స్థానిక స్వదేశీ పదార్థాలైనా జనపనార, పీచు మొదలైన వాటిని మొక్కలను సంరక్షించే ప్రయోజనాల కోసం ఉపయోగించాలనికేంద్ర మంత్రి  నొక్కిచెప్పారు.  స్థానిక పరిస్థితులకు తగిన మొక్కల జాతుల ఎంపిక కూడా చాలా ముఖ్యమని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. 

రహదారి నిర్మాణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై చర్చిస్తున్నప్పుడు, నిర్మాణ వ్యయాన్ని 25 శాతం తగ్గించడం తమ లక్ష్యమనీ, దీనికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమనీ, ఆయన వివరించారు.   కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, తీరప్రాంతాలు వంటి నిర్దిష్ట ప్రాంతాలకు భిన్నమైన విధానం మరియు విభిన్నమైన సాంకేతికతలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.  అండమాన్, నికోబార్ లలో రహదారి నిర్మాణంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఆయన ప్రశంసించారు.  మిగిలిన ప్రాజెక్టులలో కూడా ఈ విధానాన్ని అనుసరించాలని, ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్. కు ఆయన సూచించారు. 

 

*****


(Release ID: 1647667) Visitor Counter : 203