గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

వీధి వర్తకుల రుణ దరఖాస్తులకు సులువైన మొబైల్ యాప్ అవిష్కరణ

వర్తకుల ఆర్థిక పురోగతికోసం ముద్ర లాంటి పథకాలకు ప్రోత్సహించాలని రాష్ట్రాలకు పిలుపు

లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి వేదికలు కల్పించాలని రాష్ట్రాలకు సూచన

పిఎం స్వనిధి పథకం ద్వారా వీధి వర్తకులను పట్టణ ఆర్థిక వ్యవస్థలో విలీనం చేసే యత్నం

మార్చి 24 లోగా పట్టణాల్లో వీధి వర్తకులుగా ఉన్న 50 లక్షలమంది ఈ స్కీమ్ లక్ష్యం

వీధి వర్తకుల పథకం విజయవంతానికి సానుకూల పాత్ర పోషించాలి: గృహనిర్మాణ శాఖామంత్రి

Posted On: 19 AUG 2020 1:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి స్వనిధి పథకం అమలు తీరుతెన్నుల మీద వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖామంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పట్టణాభివృద్ధి కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, డిజిపి లు, కలెక్టర్లు, ఎస్పీలు,  125 నగరాల మున్సిపల్ కమిషనర్లు, సీఈవోలతో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్య్వహారాల ఇన్ చార్జ్ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి మాట్లాడారు. వీధి వర్తకులు తమ వ్యాపారాలు పునరిద్ధరించుకోవటానికి వీలుగా చర మూలధన అవసరాలకోసం ఈ పథకం ప్రారంభించటం తెలిసిందే. ఈ పథకం ద్వారా వారికి రునసదుపాయం కలుగుతుండగా, ఎలాంటి వేధింపులూ లేని వాతావరణంలో వారు వ్యాపారం నడుపుకునేలా అవకాశం కల్పించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ కూడా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి ఒక మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. యు ఎల్ బి సిబ్బంది వీధి వర్తకుల దరఖాస్తులను సులభంగా పరిష్కరించటానికి ఈ డిజిటల్ ఇంటర్ ఫేస్ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి గౌరవ మంత్రి అభిప్రాయాలు సేకరించారు. రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖా మంత్రులు, సీనియర్ అధికారులు సంబంధితులందరితో సమావేశాలు ఏర్పాటు చేసి పిఎం స్వనిధి పథకం సమర్థవంతంగా అమలు జరిగేందుకు, వీధి వర్తకుల జీవనోపాధికి రక్షణ ఉండేటట్లు చూడాలని కోరారు.
పథకం లబ్ధిదారులందరి  సామాజిక-ఆర్థిక స్థితిగతుల సర్వే జరిపి వారికి పిఎం ఎ వై, ఆయుష్మాన్ భారత్, ఉజ్జ్వల, జన్ ధన్ యోజన సౌభాగ్య తదితర ప్రభుత్వ పథకాల అందుబాటు గురించి కూడా తెలుసుకోవాలని మంత్రి ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులతో సంభాషణ సందర్భంగా కోరారు. తోపుడు బండ్లవారు సంప్రదాయ బండ్ల స్థానంలో ఆధునిక బండ్లను  కొనుక్కునే విధంగా రాష్ట్రాలు వీధి విక్రేతలకు ఇతర పథకాల లబ్ధి పొందే అవకాశాల గురించి కూడా చెప్పి అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.  పోలీసులు, మున్సిపల్ అధికారులు అనవసరంగా వీధి వర్తకులను హింసిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదుల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. అలా వ్యవహరించే అధికారులను గుర్తించి వారిమీద చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా లబ్ధిదారుల ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించటానికి జిల్లాకలెక్టర్ అధ్యక్షతన ఒక వేదిక ఏర్పాటు చేసి అందులో పోలీసులకు పట్టణ అధికారులకు భాగస్వామ్యం కల్పించాలని, ఈ వేదిక నెలకు ఒకసారైనా సమావేసం కావాలని మంత్రి సూచించారు.  
స్వనిధి కేవలం ఒక మైక్రో ఫైనాన్స్ పథకం కాదని, ఇది పట్టణ ఆర్థిక వ్యవస్థలో వీధి విక్రేతలకు భాగస్వామ్యం కల్పించే ప్రక్రియ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ విధంగా ఇతర పథకాలను కూడా వాడుకుంటూ పేదరిక నిర్మూలను కృషి చేసే లక్ష్య సాధనలో భాగమని అన్నారు. రుణాలిచ్చే సంస్థలతో కలిసి త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. పి ఎం స్వనిధి పోర్టల్ లో రుణ దరఖాస్తులకు జులై 2 నుంచి అవకాశం కల్పించగా మొత్తం 5.68  లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 1.30  లక్షల దరఖాస్తులకు రుణం మంజూరైంది.  ఈ విధంగా సూక్ష్మ రుణాలను వీధివర్తకుల గడప దగ్గరికే తీసుకెళ్ళే విధంగా రుణాలిచ్చే సంస్థలకోసం ఒక యాప్ ను ఇప్పటికే  మంత్రిత్వశాఖ రూపొందించగా అది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. 


ప్రధాని జూన్ 1న పిఎం స్వనిధి పథకాన్ని ఆవిష్కరించారు. కోవిడ్ సంక్షోభం కారణంగా దెబ్బతిన్న వీధి వర్తకులు తమ వ్యాపారాలను, తద్వారా జీవనోపాథిని పునరుద్ధరించుకోవటానికి నిర్వహణ మూలధనంగా ఈ రుణాలు ఉపయోగపడతాయి. మార్చి 24  వరకూ వ్యాపారాలు చేసుకుంటున్న దాదాపు 50 లక్షలమంది పట్టణ ప్రాంత, పట్టణ శివారు ప్రాంత వీధి వర్తకులకు ఈ పథకం ఉపయోగపడుతుంది.  దీనికింద వర్తకులకు రూ. 10,000 వరకు అప్పుగా లభిస్తుంది. దీన్ని నెలవారీ వాయిదాల్లో ఏడాదిలోపు తిరిగి చెల్లించవచ్చు. సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి 7% చొప్పున వడ్డీ సబ్సిడీని  తిరిగి వారి ఖాతాల్లో మూడు నెలలకొకసారి నేరుగా జమచేస్తారు. ముందుగా కట్టేస్తే ఎలాంటి పెనాల్టీలూ ఉండవు. ఇది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే పథకం కూడా. వీధి విక్రేతలు ఆర్థికంగా పైకి ఎదగాలన్న లక్ష్యం నెరవేర్చుకోవటానికి వీలుగా వారు సకాలంలో అప్పుతీర్చే కొద్దీ మరింత అప్పు మంజూరయ్యే అవకాశం ఉంది.
 

***



(Release ID: 1646972) Visitor Counter : 262