PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
16 AUG 2020 6:25PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- భారత్‌లో అంతర్జాతీయ సగటుకన్నా తక్కువగా కోవిడ్ మరణాలు; 1.93 శాతంగా నమోదు.
- గత 24 గంటల్లో 53,322 మందికి వ్యాధి నయం; 72 శాతానికి చేరువగా కోలుకునేవారి సగటు.
- మొత్తం నమోదైన కేసులలో ప్రస్తుత (6,77,444) కేసులు 26.16 శాతమే.
- దేశంలో పరీక్షించిన మొత్తం నమూనాలు 2.93 కోట్లు; గత 24 గంటల్లో 7.46 లక్షల నిర్ధారణ పరీక్షలు.
- కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత భారత దేశం ప్రగతి, సౌభాగ్యాలవైపు వేగంగా పురోగమిస్తుంది: రాష్ట్రపతి.


భారత్‌లో కోవిడ్ మరణాలు 2 శాతంకన్నా అత్యల్ప స్థాయికి పతనం; కోలుకునేవారి సంఖ్య పెరుగుతూ ఇవాళ 72 శాతానికి చేరువ; 3 కోట్లకు చేరువగా నమూనాల పరీక్ష
కోవిడ్ మరణాలు బాగా తగ్గుముఖం పట్టగా ప్రపంచంలో అత్యల్ప మరణాలుగల దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ మేరకు ఇవాళ ఈ సగటు 1.93 శాతానికి పతనమైంది. ఇక

భారత్‌లో కోలుకునేవారి సగటు 72 శాతానికి చేరువైంది. ఈ మేరకు గత 24 గంటల్లో 53,322 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 18.6 లక్షలకు (18,62,258) పెరిగింది. కోలుకునేవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ ప్రస్తుతం క్రియాశీల కేసులు (6,77,444) తగ్గుతుండగా మొత్తం నమోదైన కేసులలో కేవలం 26.16 శాతంగా ఉన్నాయి. వీరంతా ఇప్పుడు చురుకైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. సమర్థ, ముమ్మర విధానంతో భారత్‌లో రోగ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లకు చేరువయ్యాయి. ఈ మేరకు గత 24 గంటల్లో 7,46,608 పరీక్షలు నిర్వహించగా ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూల సంఖ్య 2,93,09,703కు చేరింది. వేగంగా విస్తరిస్తున్న జాతీయ ప్రయోగశాలల నెట్‌వర్క్ ఈ ఘనతకు దోహదపడింది. ఈ మేరకు ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 969, ప్రైవేట్ రంగంలో 500 వంతున మొత్తం 1469 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646294
ఆరు రాష్ట్రాల్లో గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద 5.5 లక్షల పనిదినాలు సృష్టించిన భారత రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ కింద 6 రాష్ట్రాలు... బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో 5.5 లక్షలకుపైగా పనిదినాలను సృష్టించింది. దీనికి సంబంధించిన పురోగతిని రైల్వే, వాణిజ్య-పరిశ్రమ శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తదనుగుణంగా ఈ పథకం కింద వలసల నుంచి తిరిగివచ్చిన కార్మికులకు ఉపాధి అవకాశాల కల్పనకు నిశితంగా కృషి చేస్తున్నారు. కాగా, ఈ రాష్ట్రాల్లో రూ.2988 కోట్ల విలువైన 165 రైల్వే మౌలిక వసతుల పథకాలను రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ మేరకు 2020 ఆగస్టు 14 వరకు 11,296 మంది కార్మికులు ఈ పథకం కింద పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే ఈ పథకాల కింద కాంట్రాక్టర్లకు రూ.1336.84 కోట్ల నిధులను రైల్వేశాఖ విడుదల చేసింది.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646330
ఐసీసీఆర్ ప్రధాన కార్యాలయంలో వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటాన్ని ఆవిష్కరించిన భారత రాష్ట్రపతి
భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ (2020 ఆగస్టు 16న) ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) ప్రధాన కార్యాలయంలో వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ- అటల్ జీ సదా ఉదారవాద ఆలోచనలకు, ప్రజాస్వామ్య ఆదర్శాలకు కట్టుబడి ఉండేవారని గుర్తుచేశారు. విభిన్న హోదాలలో పనిచేసిన ఆయన తన ప్రత్యేక వ్యక్తిత్వంలో చెరగని ముద్ర వేశారని, దేశంకోసం ఎనలేని కృషిచేశారని పేర్కొన్నారు. కోవిడ్-19 వల్ల ఇవాళ ప్రపంచమంతా ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఆయన అన్నారు. కానీ, ఈ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత భారతదేశం ప్రగతి, సౌభాగ్యాలవైపు వేగంగా పయనించగలదని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దం చేయాలన్న అటల్‌జీ స్వప్నాన్ని సాకారం చేయడంలో విజయవంతం కాగలమని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1646122
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- పంజాబ్: రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితుల నడుమ ప్రజల ఇక్కట్లను గ్రహించిన పంజాబ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జూలై నెలకు సంబంధించిన సామాజిక భద్రత పథకాల కింద పెన్షన్లను ఈ నెలలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు అధికారులు 25.25 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.190కోట్ల మేర పెన్షన్లు జమచేశారు.
- హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద దేశంలోని పేద కుటుంబాలు 2020 నవంబర్ వరకు ఉచిత రేషన్ పొందగలవని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో ప్రత్యక్ష ఆర్థిక సహాయంకింద ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకింద 5.9 లక్షలమంది మహిళల ఖాతాలకు నెలకు రూ.500 వంతున, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 8.74 లక్షల మంది రైతులకు నెలకు రూ.2000 జమ చేయబడ్డాయి. కరోనా మహమ్మారిపై పోరులో సహకరించిన యోధులకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
- మహారాష్ట్ర: ముంబై నుంచి వలస వచ్చినవారివల్ల రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 వ్యాప్తి పెరగడంపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రోగుల సంఖ్య పెరిగినప్పటికీ రాష్ట్రంలో కోలుకునేవారి సగటు సంతృప్తికరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో 5.84 లక్షలు నమోదవగా ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.56 లక్షలుగా ఉన్నాయి.
- గుజరాత్: రాష్ట్రంలోని రాజ్‌కోట్ సెంట్రల్ జైలులో 23మంది ఖైదీలకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఇక 94మంది ఖైదీలకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా వారిలో 23 మందికి కేసు నిర్ధారణ అయింది. అంతకుముందు 11మంది ఖైదీలకు వివిధ సందర్భాల్లో వ్యాధి నిర్ధారణ అయింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 14,359 క్రియాశీల కేసులున్నాయి.
- రాజస్థాన్: రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతికి కోవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అత్యధికంగా శనివారం ఒకేరోజు 1,287 కొత్త కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. మొత్తం రోగుల సంఖ్య 59,979కి చేరగా, ఇప్పుడు క్రియాశీల కేసులు 14,265గా ఉన్నాయి.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్ క్రియాశీల కేసుల సంఖ్య పదివేలకన్నా తక్కువకు పడిపోయింది. శనివారం 1,098 కొత్త కేసులు నమోదైనప్పటికీ క్రియాశీల కేసులు 9,986గా ఉన్నాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో 428 కొత్త కేసులు నమోదవగా 4 మరణాలు సంభవించాయి. దీంతో ఛత్తీస్‌గఢ్‌లో శనివారం మొత్తం కేసుల సంఖ్య 14,987కు, మృతుల సంఖ్య 134కు పెరిగాయి. అలాగే గత 24 గంటల్లో 189 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ఇప్పుడు 4,807 క్రియాశీల కేసులున్నాయి.
- గోవా: గోవాలో గత 24 గంటల్లో 369 కొత్త కేసులు నమోదయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పరికర్ కుమారుడు, బీజేపీ నేత ఉత్పల్ పరికర్‌కు కోవిడ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3,753గా ఉంది.
- కేరళ: రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు 12 మరణాలు సంభవించగా, మృతుల సంఖ్య 158కి పెరిగింది. వ్యాప్తి తీవ్రంగా ఉన్న మళప్పురంలో ఇవాళ్టి నుంచి ఆదివారాల్లో దిగ్బంధం విధించారు. ఇక కోళికోడ్‌లో ఇవాళ దిగ్బంధాన్ని పాక్షికంగా రద్దుచేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ జైలులో మరో 145 మంది ఖైదీలకు కోవిడ్ నిర్ధారణ అయింది. కేరళలో నిన్న 1,608 కొత్త కేసులు నిర్ధారణ కాగా, ప్రస్తుతం 14,891 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,60,169మంది పరిశీలనలో ఉన్నారు.
- తమిళనాడు: రాష్ట్రంలో ఇప్పటిదాకా 32మంది వైద్యులు కోవిడ్-19తో మరణించారు. మరో 15మంది వైద్యులు రోగ లక్షణాలున్నా వారికి నిర్వహించిన పరీక్షలో వ్యాధి సోకలేదని తేలినట్లు ఐఎంఏ తమిళనాడు శాఖ పేర్కొంది. కాగా, కోవిడ్ విధుల కోసం చెన్నైకి పంపిన సర్వీస్, సర్వీసేతర పీజీ వైద్యులకు రెండు నెలలుగా జీతాలు అందలేదు. చెన్నైలో నిన్న 1,179, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5860 కొత్త కేసులు, 127 మరణాలు నమోదవగా 5236 మంది కోలుకున్నారు. తమిళనాడులో ప్రస్తుతం మొత్తం కేసులు: 3,32,105; క్రియాశీల కేసులు: 54,213; మరణాలు: 5641గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలోని ప్రయోగశాలలకు ఆటోమేటెడ్ యంత్రాలు సరఫరా చేయడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. తద్వారా ఆర్టీ-పీసీఆర్ ఫలితాలను కేవలం రెండు గంటల్లో పొందవచ్చు. కాగా, 976 మందితో నిన్న బెంగళూరు నుంచి గువహటికి ఒక శ్రామిక్ స్పెషల్ రైలు బయల్దేరింది. రాష్ట్రంలో నిన్న 7908 కొత్త కేసులు, 104 మరణాలు నమోదవగా 6940 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు: 2,11,108; క్రియాశీల కేసులు:79,201; మరణాలు:3717; డిశ్చార్జి: 1,28,182గా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: కర్నూలులో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ జిల్లాలో కోలుకునేవారి సగటు 72.46 శాతంగా ఉండటంతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక విశాఖపట్నంలో కేసుల సంఖ్య 25 వేల స్థాయిని దాటగా 1,316 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కడప జిల్లాలో కోలుకునేవారి సగటు కొన్ని రోజులుగా మెరుగుపడుతోంది. గత 12 రోజుల్లో 6,907 మందిని ఆస్పత్రుల నుంచి విడుదల చేశారు. రాష్ట్రంలో నిన్న 8732 కొత్త కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2562కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 88,138 క్రియాశీల కేసులున్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలో కేసుల సంఖ్య 90,000 స్థాయిని దాటింది. గత 24 గంటల్లో 1102 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా 1930 కోలుకున్నారు. కొత్త కేసుల్లో 234 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదైనవే. ఇప్పటిదాకా మొత్తం కేసులు: 91,361; క్రియాశీల కేసులు: 22,542; మరణాలు: 684; డిశ్చార్జి: 68,126గా ఉన్నాయి. తెలంగాణలో కోలుకునేవారి సగటు 74.56 శాతం కాగా, జాతీయ సగటు 71.6 శాతంగా ఉంది.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఇవాళ 51 కొత్త కేసులు నమోదవగా 23 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో క్రియాశీల కేసులు ఇప్పుడు 882 వద్ద ఉన్నాయి.
- అసోం: రాష్ట్రంలో నిన్న 1593 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అసోంలో ఇప్పటిదాకా 53,286 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,087 క్రియాశీల కేసులున్నాయి.
- మణిపూర్: రాష్ట్రంలో 192 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. వీరిలో 131 మంది కేంద్ర భద్రతదళ సిబ్బందిగా ఉన్నారు. మణిపూర్‌లో ప్రస్తుతం 1989 క్రియాశీల కేసులుండగా కోలుకునేవారి సగటు 55 శాతంగా ఉంది.
- మిజోరం: రాష్ట్రంలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 64 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 777గా ఉంది. వాటిలో 421 క్రియాశీల కేసులు కాగా, ఇప్పటిదాకా 356 మంది కోలుకున్నారు.
- మేఘాలయ: రాష్ట్రంలో 64 కొత్త కేసులు నమోదవగా వీరిలో అధిశాతం పౌరులే. దీంతోపాటు నిన్న 15 మంది కోలుకున్నారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో నిన్న అత్యల్పంగా 18 కేసులు నమోదయ్యాయి. ఇక కోలుకున్న కేసుల సంఖ్య 1321గా ఉంది. జూన్ వరకు రూ.6.8 కోట్లు కోవిడ్ సెస్‌గా వసూలు చేయగా, ఈ సొమ్మును మహమ్మారి సంబంధిత కార్యకలాపాల్లో ఉపయోగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధికి జమ చేసినట్లు నాగాలాండ్ ముఖ్యమంత్రి తెలిపారు.
- సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ 19 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 493 కాగా, కోలుకున్నవారి సంఖ్య 671గా ఉంది.
FACT CHECK


*******
(Release ID: 1646348)
Visitor Counter : 236