రైల్వే మంత్రిత్వ శాఖ

2020 ఆగష్టు, 15వ తేదీ నుండి 2020 అక్టోబర్ 2వ తేదీ వరకు “ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్” అమలుకు పూర్తి మద్దతు ఇచ్చిన - భారతీయ రైల్వే.

‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్’ ను యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) మరియు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, శ్రీ వి.కె. యాదవ్ కూడా పాల్గొన్నారు..

‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్’ భారీ విజయం సాధించడానికి, రైల్వే కుటుంబంలో గరిష్ట అవగాహన కల్పించాలనీ, ఎక్కువమంది పాల్గొనేలా చేయాలనీ జనరల్ మేనేజర్లందరినీ కోరారు.


భారతీయ రైల్వేలో 29 క్రీడా విభాగాలలో 10,000 మంది క్రీడాకారులు, 300 మంది శిక్షకులు ఉన్నారు. 2019-20 లో మొత్తం 32 జాతీయ క్రీడా పురస్కారాలలో 6 పురస్కారాలను భారత రైల్వే క్రీడాకారులు సాధించారు.

Posted On: 14 AUG 2020 6:31PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన “ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్” అనే కొత్త కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇవ్వాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.  ఈ కార్యక్రమం 2020 ఆగష్టు, 15వ తేదీ నుండి 2020 అక్టోబర్, 2వ తేదీ వరకు కొనసాగుతుంది.  ఫిట్ ఇండియా ఉద్యమం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

సామాజిక దూరాన్ని పాటిస్తూ, మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవలసిన అనివార్యమైన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని "ఫిట్ ఇండియా రన్" కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.   ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వ్యక్తి అతనికి / ఆమెకు అనుకూలంగా ఉండే సమయంలో, అతనికి / ఆమెకు నచ్చిన మార్గంలో పరుగెత్తవచ్చు లేదా నడవవచ్చు.  అలాంటి పరుగు లేదా నడక సమయంలో కూడా అవసరమైతే విరామం తీసుకోవచ్చు.  సాధారణంగా, ఒకరు తన స్వంత పోటీలో, తన స్వంత వేగంతో ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 

‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్’ ను యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) మరియు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, శ్రీ వి.కె. యాదవ్ కూడా పాల్గొన్నారు.  భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలలోనూ, ఫిట్ ఇండియా వెబ్ సైట్  www.fitindia.gov.in లోనూ పేర్కొన్న విధంగా సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా తమను తాము ఆరోగ్యంగా చేసుకోవడం కోసం ‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్’లో పెద్ద సంఖ్యలో రైల్వే అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అవగాహనను విస్తరించాలనీ, పెద్ద సంఖ్యలో వారు పాల్గొనేలా కృషి చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ, అన్ని రైల్వే జోన్లు, యూనిట్లకు సూచించారు.

భారతీయ రైల్వేకు భారతదేశంలో క్రీడాభివృద్ధికి సంబంధించి గొప్ప వారసత్వ చరిత్ర ఉంది.  ప్రతి సంవత్సరం 300 మంది నుండి 400 మంది దాకా క్రీడాకారులకు ఉపాధి కల్పించడం ద్వారా రైల్వే శాఖ భారతదేశంలో క్రీడల ప్రోత్సాహానికి ఎనలేని కృషి చేస్తోంది.  దేశానికి గౌరవం, కీర్తి, ప్రతిష్టలు తీసుకురావడానికీ, క్రీడలలో రాణించడానికీ, వారికి అన్ని సౌకర్యాలతో పాటు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నారు.  భారతీయ రైల్వేలో 29 క్రీడా విభాగాలలో 10,000 మంది క్రీడాకారులు, 300 మంది శిక్షకులు ఉన్నారు.  2019-20 లో మొత్తం 32 జాతీయ క్రీడా పురస్కారాలలో 6 పురస్కారాలను భారత రైల్వే క్రీడాకారులు సాధించారు. 

అత్యాధునిక క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణను సృష్టించడానికి, అన్ని అంచనాలలో ‘క్రీడల అభివృద్ధి’ కోసం 0.5 శాతం డి అండ్ జి ఛార్జీలు చేర్చబడ్డాయి. క్రీడల అభివృద్ధి కోసం మరియు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే తీసుకున్న ఒక ప్రత్యేక కార్యక్రమం ఇది.

‘ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్’ గొప్ప విజయాన్ని సాధించడానికి, జనరల్ మేనేజర్లందరూ రైల్వే కుటుంబంలో గరిష్ట అవగాహన కల్పించాలని, గరిష్ట భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని కోరారు.

*****



(Release ID: 1645972) Visitor Counter : 131