రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

మౌలిక సదుపాయాలు మరియు ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగాల్లో అంతర్జాతీయ పెట్టుబడులను మెరుగుపరచాలని పిలుపునిచ్చిన - గడ్కరీ.

Posted On: 12 AUG 2020 3:20PM by PIB Hyderabad

భారత రహదారులు, ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగాల్లో పెట్టుబడులు పెంచాలని, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎం.ఎస్.‌ఎం.ఈ. శాఖల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలకు పిలుపునిచ్చారు.  ఆటోమొబైల్ మరియు ఎం.ఎస్.ఎం.ఈ. రంగాలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి రెండు ముఖ్యమైన రంగాలని ఆయన పేర్కొన్నారు. 

రహదారి మౌలిక సదుపాయాలు మరియు ఎం.ఎస్.ఎం.ఈ.ల లో వాణిజ్య పెట్టుబడులు మరియు భాగస్వామ్యం పై భారత-ఆస్ట్రేలియా వాణిజ్య మండలి మరియు  ఉమెన్నోవేటర్ ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, రహదారి భద్రతా రంగంలో భారత, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే సహకరించుకుంటున్నాయని చెప్పారు.  ఈ సహకారం రహదారులకు మెరుగైన డిజైన్లను, ప్రజలకు అవగాహన అవకాశాలను కల్పించిందని ఆయన అన్నారు.  భారత రహదారి భద్రతా అంచనా కార్యక్రమం కింద,  21,000 కిలోమీటర్ల మేర రహదారుల అంచనా పూర్తి అయ్యింది.  సుమారు 3,000 కిలోమీటర్ల పొడవైన రహదారి సాంకేతిక పరమైన అభివృద్ధిలో ఉంది.  మెరుగైన రహదారి ఇంజనీరింగ్ మరియు ప్రజలలో అవగాహన మెరుగుపడిందని ఆయన అన్నారు.  ఈ అభివృద్ధి / నవీకరణ కార్యక్రమాలు, రోడ్డు ప్రమాదాలను 50 శాతం మేర తగ్గిస్తాయని భావిస్తున్నారు.   2030 నాటికి రహదారి ప్రమాదాలలో ఎవరూ మృతి చెందకుండా చూడాలన్నదే మా లక్ష్యమని శ్రీ గడ్కరీ తెలియజేశారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తమ మంత్రిత్వ శాఖ చాలా కార్యక్రమాలు చేపట్టిందని శ్రీ గడ్కరీ తెలియజేశారు.  ఈ ప్రచారం కోసం ప్రపంచ బ్యాంకు మరియు ఎ.డి.బి. ఒక్కొక్కటి 7000 కోట్ల రూపాయల చొప్పున సహకారం అందించడానికి కట్టుబడి ఉన్నాయి.  సామాజిక అవగాహన మరియు విద్య ద్వారా, అత్యవసర సేవలను మెరుగుపరచడం, వైద్య బీమా కోసం ఒత్తిడి చేయడం, మరిన్ని ఆస్పత్రులను అందించడం మొదలైన చర్యల ద్వారా భారతదేశం తన రహదారి భద్రతా లక్ష్యాలను సాధించడానికి చేరువ అవుతోంది. భారతదేశంలో రవాణా రంగానికి సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా రూపొందించిన మోటారు వాహనాల చట్టం-2019 గురించి ఆయన ప్రస్తావించారు.

ప్రభుత్వం గ్రామ, వ్యవసాయ, గిరిజన రంగాలపై దృష్టి సారిస్తోందనీ, అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తోందనీ, మంత్రి తెలిపారు.  రాబోయే సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థను నడిపించేది ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగమేనని ఆయన ఉద్ఘాటించారు.  బీమా, పింఛను, ఆర్ధిక వ్యవస్థల భాగస్వామ్య రంగాలలో భారీ అవకాశాలు ఉన్నందున ఇన్ఫ్రా మరియు బీమా రంగాలలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.  ఎం.ఎస్.‌ఎం.ఈ. కూడా త్వరలో క్యాపిటల్‌ మార్కెట్ ‌లోకి ప్రవేశించనుందని ఆయన అన్నారు.

ఆస్ట్రేలియా ఉపప్రధాన మంత్రి మైఖేల్ మెక్ కార్మాక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రహదారి రంగం అభివృద్ధి మరియు వృద్ధిలో, ముఖ్యంగా రహదారి భద్రతా రంగంలో భాగస్వామిగా ఉండటానికి ఆస్ట్రేలియా తీవ్ర ఆసక్తితో ఉందని తెలియజేశారు. 

*****



(Release ID: 1645359) Visitor Counter : 177