రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలో ఎనిమిది వర్గాల పోస్టులలో నియామకాలకు సంబంధించినదని పేర్కొంటూ ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఒక వార్తాపత్రికలో చేసిన ప్రకటన గురించి స్పష్టీకరణ.
రైల్వేలో ఏ నియామకాలకైనా ప్రకటనలు ఎల్లప్పుడూ భారత రైల్వే మాత్రమే విడుదల చేస్తుంది. ఆ విధంగా ప్రకటనలు జారీ చేయడానికి ఏ ప్రైయివేటు ఏజన్సీకి అధికారం లేదు.
ఇప్పుడు ప్రస్తావనలో ఉన్న ప్రకటన జారీ చేయడం చట్టవిరుద్ధం మరియు మోసానికి సమానం.
ఆ ఏజన్సీకి వ్యతిరేకంగా రైల్వేశాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.
Posted On:
09 AUG 2020 7:13PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలో 11 సంవత్సరాల కాంట్రాక్టుపై అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఎనిమిది విభాగాలలో మొత్తం 5,285 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ, “అవెస్ట్రాన్ ఇన్ఫోటెక్” అనే ఒక సంస్థ 2020 ఆగస్టు 8వ తేదీన www.avestran.in అనే వెబ్‌సైట్ చిరునామాతో ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఒక ప్రకటన ప్రచురించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. దరఖాస్తుదారులు ఆన్ లైన్ రుసుముగా 750 రూపాయలు జమ చేయాలని కోరారు. దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీని 2020 సెప్టెంబర్ 10 గా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏదైనా రైల్వే నియామకానికి సంబంధించిన ప్రకటనను భారత రైల్వే మాత్రమే జారీ చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రకటనలు జారీ చేయడానికి ఏ ప్రైయివేటు ఏజన్సీకి అధికారం లేదు. ఇప్పుడు ప్రస్తావనలో ఉన్న ప్రకటన జారీ చేయడం చట్టవిరుద్ధం.
భారతీయ రైల్వేలలో గ్రూప్ 'సి' మరియు పూర్వపు గ్రూప్ 'డి' పోస్టుల నియామకాలను ప్రస్తుతం 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్.ఆర్.బి.లు) మరియు 16 రైల్వే రిక్రూట్‌మెంట్ కేంద్రాలు (ఆర్.ఆర్.సి) ద్వారా మాత్రమే నిర్వహిస్తున్నామనీ, ఏ ఇతర ఏజెన్సీ ద్వారా కాదనీ కూడా ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. కేంద్రీకృత ఉపాధి ప్రకటనల (సి.ఇ.ఎన్. ల) ద్వారా విస్తృత ప్రచారం చేసిన అనంతరం భారతీయ రైల్వేలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.
దేశవ్యాప్తంగా అర్హత గల అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ / రోజ్గర్ సమాచార్ ద్వారా సి.ఈ.ఎన్. ప్రచురిస్తారు. ఆ విషయాన్ని జాతీయ దిన పత్రికలూ, స్థానిక వార్తాపత్రికల్లో కూడా సంక్షిప్త ప్రకటన ద్వారా ప్రచురిస్తారు. ఆర్.ఆర్.బి. లు / ఆర్.ఆర్.సి. లకు చెందిన అధికారిక వెబ్ సైట్లలో కూడా ఈ సి.ఈ.ఎన్. అందుబాటులో ఉంచుతారు. అన్ని ఆర్.ఆర్.బి. లు / ఆర్.ఆర్.సి. ల కు చెందిన వెబ్ సైట్ చిరునామాలను ఆ సి.ఈ.ఎన్. లో పొందుపరుస్తారు.
పైన పేర్కొన్న ఏజెన్సీ పేర్కొన్న విధంగా, రైల్వేశాఖ తరపున సిబ్బంది నియామకం చేయడానికి ఇంతవరకూ ఎప్పుడూ ఏ ప్రైవేట్ ఏజెన్సీకి అధికారం ఇవ్వడం జరగలేదని కూడా ఈ సందర్భంగా రైల్వే శాఖ మరోసారి స్పష్టం చేసింది.
ఈ విషయమై రైల్వేశాఖ తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ విషయంతో సంబంధం ఉన్న పైన పేర్కొన్న ఏజెన్సీ పైనా / సంబంధిత వ్యక్తులపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
*****
(Release ID: 1644694)
Visitor Counter : 248