PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 09 AUG 2020 6:13PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • గత 24 గంటల్లో 7,19,364 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలతో కొత్త శిఖరం చేరిన భారత్‌; ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2,41,06,535కు చేరిక.
  • దేశంలో 14,80,884 మందికి కోవిడ్‌వ్యాధి నయంకాగా, కోలుకునే సగటు 68.78 శాతానికి చేరిక.
  • దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,28,747
  • జాతీయంగా మ‌ర‌ణాల స‌గ‌టు మ‌రింత త‌గ్గి ఇవాళ 2.01 శాతానికి ప‌త‌నం.
  • వ్యవసాయ మౌలిక వసతుల నిధికింద రూ.లక్ష కోట్ల ఆర్థికసహాయ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీకారం.
  • దేశవ్యాప్త దిగ్బంధం వేళ నిత్యావసరాల నిరంతర సరఫరాపై వ్యాపారులకు శ్రీ పీయూష్‌ గోయల్‌ ప్రశంస.

Image

దేశంలో 7,19,364 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలతో కొత్త శిఖరం చేరిన భారత్‌; ఇప్పటిదాకా పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 2,41,06,535కు చేరిక

ఒక్కరోజులో 7 లక్షలకుపైగా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ స్థాయిని దాటిన భారత్‌ ఇవాళ కొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఈ మేరకు వరుసగా చాలా రోజులనుంచి 6 లక్షలకుపైగా పరీక్షల పరంపరను కొనసాగిస్తూ వచ్చిన నేపథ్యంలో గత 24 గంటల్లో 7,19,364 పరీక్షలు నిర్వహించారు. దీంతోపాటు నిన్న ఒకేరోజు అత్యధికంగా 53,879 మందికి వ్యాధి నయం కావడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 14,80,884కు పెరిగింది. ఇది ప్రస్తుత (6,28,747) కేసులతో పోలిస్తే 2.36 రెట్లు అధికం కావడం విశేషం. ఆ మేరకు కోలుకునేవారి జాతీయ సగటు కూడా రోజురోజుకూ పెరుగుతూ నేడు 68.78 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,52,137 మంది వివిధ ఆస్పత్రుల్లు, ఏకాంత గృహవాసంలో చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక మరణాల సగటు కూడా నానాటికీ క్షీణిస్తూ ఇవాళ 2.01 శాతానికి దిగివచ్చింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644592

దూర‌వాణి-వైద్య వేదిక ఈ సంజీవనికి ప్రాచుర్యం ల‌భించ‌డంలో రాష్ట్రాల సహకారాన్ని ప్ర‌శంసించిన‌ డాక్టర్ హర్ష‌వ‌ర్ధ‌న్‌

దూర‌వాణి-వైద్య వేదికలో భాగమైన ‘ఈ-సంజీవని’, ‘ఈ-సంజీవనిఓపీడీ’లకు ప్రజల్లో విశేష ప్రాచుర్యం ల‌భించ‌డంతో ఇప్పటిదాకా 1.5 లక్షల మంది డాక్టర్లను సంప్రదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ప్రతినిధిలతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇవాళ తన అధ్యక్షతన సమీక్షించారు. నిరుడు నవంబరులో ఈ వేదికలను ప్రారంభించగా 23 రాష్ట్రాలు (75 శాతం జనాభా) దీన్ని అమలు చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ వేదికల అమలుకు సిద్ధమవుతున్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644592

విజయవాడలోని కోవిడ్ సెంటర్‌ అగ్ని ప్రమాదంపై ప్రధాని ఆవేదన; మృతుల కుటుంబాలకు సంతాపం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడలోని కోవిడ్‌ చికిత్స కేంద్రంలో అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “విజయవాడ కోవిడ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదంపై ఎంతో ఆవేదన కలిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణం కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జగన్‌తో మాట్లాడాను.. వీలైనంత మేర సహాయం అందిస్తామని హామీ ఇచ్చాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644547

వ్యవసాయ మౌలిక వసతుల నిధికింద రూ.లక్ష కోట్ల ఆర్థికసహాయ కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీకారం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వ్యవసాయ మౌలిక వసతుల నిధికింద రూ.1 లక్ష కోట్లతో కొత్త కేంద్ర రంగాల ఆర్థిక సహాయ పథకాన్ని దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రారంభించారు. దేశంలోని రైతులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు ఉత్పాదక సంస్థలు వ్యవసాయ పారిశ్రామికులకు, పంటకోత మౌలిక సౌకర్యాలకు మద్దతుతోపాటు సామాజిక వ్యవసాయ ఆస్తులు సమకూర్చుకోవడంలో తోడ్పడుతుంది. కేంద్ర మంత్రిమండలి ఈ పథకాన్ని అధికారికంగా ఆమోదించిన 30 రోజుల తర్వాత తొలివిడతగా 2,280కిపైగా రైతు సహకార సంఘాలకు రూ.1000 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ప్రారంభోత్సవాన్ని దేశవ్యాప్తంగా లక్షలాది రైతులతోపాటు ఆయా లబ్ధిదారులు, పౌరులు ఆన్‌లైన్‌ద్వారా  పెద్ద సంఖ్యలో వీక్షించారు. ఇదే సందర్భంగా ‘పీఎం-కిసాన్‌’ పథకంలో భాగంగా 6వ విడత కింద దేశఃలోని 8.5 కోట్లమంది రైతులకు రూ.17,000 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు ఒక బటన్‌ నొక్కి, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఒక్కక్షణంలో బదిలీ చేశారు. ఈ పథకం రైతులకు, వ్యవసాయ రంగానికి ఆర్థిక ప్రోత్సాహమిస్తుందని, ప్రపంచ వేదికపై పోటీపడేలా భారత్‌ సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రధానమంత్రి అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=164529

వ్యవసాయ మౌలిక వసతుల నిధికింద రూ.లక్ష కోట్ల ఆర్థికసహాయ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644536

మేక్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తుల‌పై ప్ర‌జావ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేపట్టాల‌ని వ్యాపారులకు శ్రీ పీయూష్‌ గోయల్‌ పిలుపు; దిగ్బంధంలో వారి సేవలకు ప్రశంస

స్వయం సమృద్ధ భారతం కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించాలని కేంద్ర వాణిజ్య- ప‌రిశ్ర‌మ‌లు, రైల్వే శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్ వ్యాపారులను కోరారు. ‘జాతీయ వ‌ర్త‌క‌ దినోత్స‌వం’ సంద‌ర్భంగా ఇవాళ వాస్తవ సాదృశ సమావేశంద్వారా ఆయ‌న వర్త‌కుల‌నుద్దేశించి ప్రసంగించారు. దేశంలో త‌యారైన ఉత్ప‌త్తుల‌ను ఆదరించే విధంగా ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని వ్యాపారులకు పిలుపునిచ్చారు. కోవిడ్‌ మహమ్మారి దిగ్బంధం వేళ ప్రజలకు నిరంతరం నిత్యావసరాలను అందించడంలో వారి కృషిని ప్రశంసించారు. త్వ‌ర‌లో ‘జాతీయ వర్తక సంక్షేమ బోర్డు’ను ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ, ట్రేడర్ల పెన్షన్‌ పథకంలో వారివద్ద పనిచేసే ఉద్యోగులను కూడా చేర్చాలని శ్రీ గోయ‌ల్ సూచించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644583

కోవిడ్‌ నిర్ధారణ కాగా, బెంగళూరులోని 'ఎన్‌సీవోఈ'లో కోలుకుంటున్న ఐదుగురు జాతీయ హాకీ క్రీడాకారులు

రెండు రోజులకింద కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో బెంగళూరులోని ‘నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ (NCOE)లో స్వీయ నిర్బంధవైద్య పర్యవేక్షణలోగల ఐదుగురు భారత హాకీ ఆటగాళ్లు కోలుకుంటున్నారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) కి చెందిన డాక్టర్‌సహా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డాక్టర్‌ అవినాష్‌ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మణిపాల్‌ ఆస్పత్రి నుంచి కూడా ఒక వైద్య నిపుణుడిని ‘సాయ్‌’ రప్పించింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644441

స్వయం సమృద్ధ భారతం చొరవకు రక్షణ మంత్రిత్వశాఖ భారీ ప్రోత్సాహం

రక్షణ మంత్రిత్వశాఖ (MoD) పరిధిలోని సైనిక వ్యవహారాల విభాగం (DMA) 101 వస్తువుల దిగుమతిని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఒక జాబితాను రూపొందించింది. రక్షణలో స్వావలంబన దిశగా ఇదో పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు. దేశీయ రక్షణ పరిశ్రమల రంగం అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇదే తగిన తరుణం. ఈ మేరకు డీఎంఏ దిగుమతులు నిషేధించిన జాబితాలోని వస్తువుల అభివృద్ధికి తమ సామర్థ్యాన్ని వినియోగించాలని రక్షణశాఖ సూచించింది. రానున్న కాలంలో సాయుధ దళాల అవసరాలు తీర్చగలిగేలా రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (DRDO) నిర్దేశిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించాల్సిందిగా పేర్కొంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1644570

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  •  పంజాబ్: రాష్ట్రంలో కేసుల పెరుగుదలపై ఆందోళన చెందుతున్న పంజాబ్‌ ముఖ్యమంత్రి ఆయా ప్రదేశాల్లో రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటలదాకా కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. ఈ మేరు లూధియానా, జలంధర్, పాటియాలా నగరాలపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని పెద్ద నగరాలు/పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కేంద్రాల్లో అన్నిరకాల జబ్బులకు చికిత్స దిశగా సమగ్ర నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
  • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారిపై పటిష్ఠ పోరాటం దిశగా ఫరీదాబాద్ జిల్లా ప్రశంసనీయంగా కృషిచేసిందని, దీంతో ప్రస్తుతం జిల్లాలో కేసుల రెట్టింపు వ్యవధి 59 రోజులుగా నమోదవడం ఎంతో ఊరట కలిగిస్తున్నదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ చెప్పారు. కేసుల సంఖ్యను తగ్గించే దిశగా పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేగాక సాధ్యమైన మేరకు ప్లాస్మాతో చికిత్స చేయాల్సిందిగా కోరారు.
  • మహారాష్ట్ర: ముంబై ప్రక్కనే ఉన్న రాయ్‌గఢ్‌ జిల్లాలోని పెన్ అందమైన గణపతి విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అయితే, ఈ ఏడాది కోవిడ్ మహమ్మారి ప్రభావంతో విగ్రహాల తయారీదారులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. స్థానికంగా వచ్చే ఆర్డర్లు  40శాతం, ఎగుమతి ఆర్డర్లలో 60శాతానికిపైగా తగ్గిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో శనివారం 12,822 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 5.03 లక్షలకు చేరింది.
  • గుజరాత్: రాష్ట్రంలో కోలుకునేవారి సగటు మరింత మెరుగుపడి 75.48 శాతానికి చేరింది. రాష్ట్రంలో శనివారం 1,101 కొత్త కేసులు నమోదవగా, మరో 1,135మంది కోలుకున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో క్రియాశీల కేసుల సంఖ్య 14,530గా ఉంది.
  • రాజస్థాన్: ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షవల్ల ఫలితం వేగంగా తెలిసే వీలున్నా కచ్చితత్వం సందేహాస్పదం కాబట్టి విశ్వసనీయమైన ఆర్టీ-పీసీఆర్ పరీక్షకే ప్రాధాన్యం ఇవ్వాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ- కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల సగటును అదుపులో ఉంచితే పెద్ద విజయం సాధించినట్లేనన్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం 51,924 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకూ 784 మంది మరణించారు.
  • గోవా: గోవాలో 20 మంది డాక్టర్లతోపాటు గోవా వైద్యకళాశాలకు అనుసంధానం చేసిన 10 నుంచి 15 మంది ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 8,206 కోవిడ్ కేసులు నమోదవగా ప్రస్తుతం 2,232 క్రియాశీల కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలో ఇవాళ ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 106కి చేరంది. కేరళలో వారం వ్యవధిలోనే 9507 కొత్త కేసులు నమోదవగా వీటిలో అధికశాతం స్థానిక సంక్రమణవల్ల సోకినవేనని తేలింది. మరోవైపు మన్నార్ కొండచరియ కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 42కు చేరింది. శిథిలాల కిందనుంచి ఇంకా 28 మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున వరద సహాయ శిబిరాల్లో కోవిడ్ విధివిధానాల నిర్వహణ అధికారులకు కష్టసాధ్యంగా మారింది. రాష్ట్రంలో నిన్న 1,420 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 12,109 మంది చికిత్స పొందుతుండగా 1,48,241 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత పరిధిలోని యానాంలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ్టినుంచి మూడు రోజులపాటు ప్రభుత్వం దిగ్బంధం విధించింది. కాగా, ఇక్కడ ప్రస్తుతం 113 యాక్టివ్‌ కేసులుండగా, పుదుచ్చేరిలో మొత్తం కేసుల సంఖ్య 268గా ఉంది. ఇక తమిళనాడులో మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి జాతీయ సగటుకన్నా వేగంగా పెరుగుతున్నదని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ప్రతి మరణంపైనా ఆరా తీస్తున్నామని, మరణాల సగటును తగ్గించడంపై దృష్టి పెట్టామని ఆరోగ్యశాఖ కార్యదర్శి జె.రాధాకృష్ణన్ చెప్పారు. తమిళనాడులో నిన్న 5883 కొత్త కేసులు, 118 మరణాలు నమోదవగా 5043 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 2,90,907; క్రియాశీల కేసులు: 53,481; మరణాలు: 4808; చెన్నైలో యాక్టివ్ కేసులు: 11,734గా ఉన్నాయి.
  • కర్ణాటక: బెంగళూరులోని రాజాజీ నగర్‌లోగల ఇఎస్‌ఐ ఆసుపత్రిలో కోవిడ్ రోగుల మరణాలు అధికంగా నమోదు కావడంపై అధ్యయనానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని వైద్య విద్యాశాఖ మంత్రి తెలిపారు. కాగా, శనివారం 93 మరణాల నమోదుతో  రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3000 దాటింది. కాగా, కర్ణాటకలో నిన్న ఒకేరోజు అత్యధికంగా 7178 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క బెంగుళూరు నగరంలోనే 2665 కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు: 1,72,102; క్రియాశీల కేసులు: 79,765; మొత్తం మరణాలు: 3091; డిశ్చార్జి: 89,238గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విజయవాడలో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 10 మంది కోవిడ్-19 రోగులు మరణించిన నేపథ్యంలో స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యాలపై కేసు నమోదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ఈ హోటల్‌ను లీజుకు తీసుకుని, కరోనా సోకినవారికి చికిత్సకోసం కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. కాగా, దుర్ఘటన సంభవించినపుడు ఇక్కడ 31 మంది చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రి తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక తిరుమల-తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమాచారం ప్రకారం- టీటీడీ ఉద్యోగులలో 743 మందికి  కోవిడ్-19 నిర్ధారణ అయింది. వీరిలో 402 మంది పూర్తిగా కోలుకోగా, మిగిలినవారు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
  • తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఏప్రిల్ 26 తర్వాత తొలిసారిగా ఒకేరోజు 500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 1982 కొత్త కేసులు, 12 మరణాలు నమోదవగా, 1669 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 463 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి. మొత్తం కేసులు: 79,495; క్రియాశీల కేసులు: 22,869; మరణాలు: 627; డిశ్చార్జి: 55,999గా ఉన్నాయి.
  • అసోం: రాష్ట్రంలో జూలై 16 నుంచి ఆగస్టు 8 మధ్య నిర్ధారిత కేసుల సగటు 18శాతం నుంచి 4.5 శాతానికి దిగివచ్చింది. ఈ మేరకు రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్య బాగా తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
  • మణిపూర్: రాష్ట్రంలో “కోవిడ్-19... మూలవాసులలో నిరోధకత” అంశంపై, ఉక్రుల్‌లో 26వ అంతర్జాతీయ మూలవాసుల దినోత్సవం నిర్వహించారు.
  • మిజోరం: రాష్ట్రంలో 8.8.2020 నుంచి 9.8.2020 ఉదయం 11 గంటలవరకు 43 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 608కి చేరగా వీటిలో 312 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటివరకూ 296 మంది కోలుకున్నారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో 800 నమూనాలను పరీక్షించగా, 93 కొత్త కేసులు నిర్ధరాణ అయ్యాయి. వీటిలో దిమాపూర్‌ 62, కొహిమా 20, పెరెన్‌ 8, మోన్‌ 2, జున్‌హెబోటోలో 1 వంతున నమోదయ్యాయి.
  • సిక్కిం: రాష్ట్రంలో ఇవాళ 6 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 494 మంది కోలుకోగా, ప్రస్తుతం 371 మంది చికిత్స పొందుతున్నారు.

FACT CHECK

 

  • ImageImage

 

******



(Release ID: 1644650) Visitor Counter : 158