ప్రధాన మంత్రి కార్యాలయం
రామ జన్మభూమి, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
Posted On:
05 AUG 2020 3:37PM by PIB Hyderabad
సియావార్ రామచంద్రకీ జై!
భగవాన్ రాముని స్తుతించండి!
సియావార్ రామచంద్రకీ జై!
భగవాన్ రాముని స్తుతించండి! భగవాన్ రాముని స్తుతించండి! భగవాన్ రాముని స్తుతించండి!
జై సియారామ్! జై సియారామ్! జై సియారామ్!
ఈ రోజు ఈ స్తుతి రాముని నగరం అయోధ్యలో ధ్వనించడమే కాదు, దాని ప్రకంపనలు ప్రపంచం యావత్తు ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ చారిత్రక తరుణంలో రామభక్తులందరికీ, నా సహ దేశవాసులు, ప్రపంచంలోని విభిన్న ఖండాల్లో నివశిస్తున్న భారత జాతీయులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
వేదికపై ఆశీనులైన ప్రముఖులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ జీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ జీ, పరమపూజ్య మహంత్ నృత్య గోపాల్ దాస్ మహరాజ్, మాకు ఎంతో సన్నిహితులు గౌరవనీయ శ్రీ మోహన్ రావ్ భగవత్ జీ, అత్యున్నతులు, జ్ఞానవంతులైన సాధుసంతులు, గురువులు, దేశంలోని నలు మూలల నుంచి ఇక్కడకు వచ్చిన నిరాడంబరానికి మారుపేరుగా నిలిచే పెద్దలు, నా తోటి భారతీయులు అందరికీ అభినందనలు.
ఈ చారిత్రకమైన, పవిత్రమైన కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాన్ని నేను ఎంతో వినమ్రంగా అంగీకరించాను. ఈ గౌరవానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. "రామ్ కాజుకీన్హే మొహి కహాం విశ్రమ్" (భగవాన్ రాముడు నిర్దేశించిన ఈ పని చేపట్టకుండా నేను ఎలా విశ్రాంతి తీసుకుంటాను) అని మనం చెప్పుకునే ఈ అపూర్వ ఘట్టానికి ఎవరైనా రాకుండా ఉండగలరా.
అత్యంత చారిత్రకమైన ఈ స్వర్ణమయ కార్యక్రమానికి పవిత్ర సరయూ నదీ తీరం నుంచి భాస్కరుడు ఆశీస్సులు అందిస్తున్నాడు. కన్యాకుమారి నుంచి క్షీర్ భవాని వరకు; కోటేశ్వర్ నుంచి కామాఖ్య వరకు ; జగన్నాథ్ నుంచి కేదార్ నాథ్ వరకు; సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ వరకు; సమేత్ షికార్ నుంచి శ్రావణ బెళగోళ వరకు; బోధ్ గయ నుంచి సారనాథ్ వరకు; అమృతసర్ నుంచి పాట్నాసాహిబ్ వరకు; అండమాన్ నుంచి అజ్మీర్ వరకు; లక్షదీవుల నుంచి లేహ్ వరకు యావత్ దేశం రాముని కోసం, రాముని చేత ఆవరించి ఉంది.
దేశంలోని ప్రతీ ఒక్కరి హృదయం ఈ అపూర్వ ఘట్టంతో పారవశ్యంలో మునిగి ఉంది. అందరి హృదయాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. దేశం యావత్తు చారిత్రక ఘట్టంలో తాము కూడా భాగంగా ఉన్నామని, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రక ఘట్టాన్ని కనులారా చూడగలుగుతున్నామన్న భావోద్వేగంతో నిండి ఉంది.
శతాబ్దాల నిరీక్షణ ఈ రోజుతో అంతం అవుతోంది. జీవితంలోనే అరుదైన, ఈ చారిత్రక ఘట్టంలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నామా అని యావత్ దేశ ప్రజలు నమ్మలేకుండా ఉన్నారని నేను కచ్చితంగా చెప్పగలను.
సోదరసోదరీమణులారా, పెద్దలారా
తాత్కాలికంగా నిర్మించిన గుడారం, పందిరిలో ఎన్నో దశాబ్దాలుగా విరాజమానుడై ఉన్న భగవాన్ రామునికి ఒక చక్కని ఆలయం నిర్మించే అపూర్వ చారిత్రక ఘట్టం రానే వచ్చింది. మన భగవాన్ రామునికి ఇప్పుడు అతి పెద్ద ఆలయం ఇప్పుడు నిర్మాణం కానుంది.
శతాబ్దాల పాటు సాగిన విధ్వంసం, పునరుజ్జీవం సంఘటనల సమాహారం నుంచి రామజన్మభూమి ఈ రోజు విముక్తి పొందబోతోంది. మరోసపారి నాతో కలిపి పలకండి, రాముని స్తుతించండి, రాముని స్తుతించండి.
మిత్రులారా,
స్వాంతత్ర్యోద్యమ కాలంలో ఎన్నో తరాలు తమ జీవితాలనే త్యాగం చేశాయి. బానిసత్వం అనుభవిస్తున్న కాలంలో స్వేచ్ఛ కోసం పోరాటం జరగని క్షణం ఏదీ లేదు. స్వతంత్రం కోసం త్యాగాలు చేయని క్షణం లేదు. లక్షలాది మంది ప్రజల త్యాగాలు, అనుభవించిన వేదనల పరాకాష్ఠ ఆగస్టు 15.
అలాగే ఎన్నో శతాబ్దాలుగా పలు తరాలకు చెందిన వారు రామాలయం నిర్మాణం కోసం నిస్వార్ధ త్యాగాలు చేశారు. శతాబ్దాలుగా చేసిన ధ్యానం, త్యాగాలు, సంకల్పం అన్నింటికీ పతాక ఘట్టం ఇది. రామాలయ నిర్మాణం కోసం సాగిన త్యాగాలు, అంకిత భావం, సంకల్పం కారణంగానే ఇది సాకారం అయింది. వారి త్యాగాలు, పోరాటంతో ఈ కల నెరవేరుతోంది. ఈ రోజు ఈ మహత్తర ఘట్టానికి త్యాగాలు చేసిన వారందరికీ 130 కోట్ల భారతీయుల తరఫున నేను అభివాదం చేస్తున్నాను. ఈ రోజు ఈ విశ్వంలోని శక్తులన్నీ, రామాలయ నిర్మాణం కోసం పవిత్ర త్యాగాలు చేసిన వారు ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. శ్రీరాముని ఆశీస్సులు తమకు లభించాయన్న భావంతో వారంతా ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు.
మిత్రులారా,
భగవాన్ రాముడు మన హృదయాల్లో విరాజమానుడై ఉన్నాడు. ఎప్పుడు ఏ పని చేపట్టినా మనందరం స్ఫూర్తి కోసం రాముని వైపు చూస్తాం. భగవాన్ రాముని అపారమైన శక్తి ఎంతటిదో చూడండి. భవనాలు నేలమట్టం అయ్యాయి. దాని అస్తిత్వాన్ని తుడిచి పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కాని భగవాన్ రాముడు మనందరి హృదయాల్లో నిండి ఉన్నాడు. మన సంస్కృతికి మూల కారకుడు శ్రీరాముడు. మన గౌరవానికి ప్రతీక శ్రీరాముడు. ఆ ఆనందంలోనే ఈ రోజు శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం ఈ "శంకుస్థాపన" కార్యక్రమం జరుగుతోంది.
ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందు నేను హనుమాన్ గఢిని దర్శించుకున్నాను. భగవాన్ రాముని కార్యక్రమం రక్షణ బాధ్యత హనుమాన్ జీ స్వీకరిస్తారు.
ఈ కలియుగంలో భగవాన్ రాముని ఆదర్శాలను కాపాడే బాధ్యత హనుమాన్ జీదే. ఈ రోజు భగవాన్ హనుమాన్ ఆశీస్సులతోనే మనం శ్రీరామజన్మభూమిలో ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించాం.
శ్రీరామ ఆలయం మనం ఆధునికతకు ప్రతీక. నేను ఉద్దేశపూర్వకంగానే ఆధునిక పదం ఉపయోగించాను. అది ఎల్లలు లేని మన ఆశాలకు చిహ్నం. మన జాతీయ భావానికి ప్రతిబింబం.ఆ రకంగా కోట్లాది మంది ప్రజల సంఘటిత శక్తికి ఈ ఆలయం ఒక చిహ్నంగా నిలుస్తుంది. రాబోయే తరాల ఆశలు, అంకిత భావం, సంకల్పానికి ఈ ఆలయం ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.
ఒక సారి ఈ ఆలయ నిర్మాణం పూర్తయితే అయోధ్య వైభవం ఎన్నో రెట్లు పెరిగిపోవడమే కాదు, ఈ ప్రాంతానికి చెందిన మొత్తం ఆర్థిక వ్యవస్థ పూర్తి పరివర్తన చెందుతుంది. ప్రతీ రంగంలోనూ కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు వస్తాయి. యావత్ ప్రపంచ ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. భగవాన్ రాముడు, సీతమ్మవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఈ ప్రాంతం ఎంత విప్లవాత్మకంగా పరివర్తన చెందుతుందో మీరే ఊహించండి.
నా తోటి మిత్రులారా,
శ్రీరామాలయం నిర్మాణం మన జాతిని, మనందరినీ ఐక్యం చేసే పెద్ద ప్రయత్నం. అందరి నమ్మకాలను వాస్తవికతకు మార్చే ప్రయత్నం ఇది. మానవుని అపార శక్తివంతుడైన భగవంతునితో, మానవాళిని సంకల్పశుద్ధితో, వర్తమానాన్ని చరిత్రతో, స్వార్థపరత్వాన్ని నైతిక విలువలతో అనుసంధానం చేస్తుంది.
ఎన్నో తరాల పాటు ప్రపంచం యావత్తు ఈ మహత్తరమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తుంచుకుంటుంది. దేశానికి ఎన్నో ప్రశంసలు అందుతాయి. కోట్లాది మంది అంకిత భావం గల శ్రీరామ భక్తుల గౌరవానికి చక్కని ప్రతీక ఈ రోజు.
సత్యం, అహింస, విశ్వాసం, త్యాగశీలత గల వారందరికీ చట్టానికే ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే భారతదేశం నుంచి అందిన బహుమతి ఇది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి వల్ల ఈ రోజు ఈ భూమిపూజ కార్యక్రమం కఠిన నిబంధనలతో నిర్వహిస్తున్నారు. జాతి యావత్తు ఈ సందర్భంగా ప్రదర్శించిన బాధ్యత శ్రీరాముని కోసం చేపట్టే ఏ పనికైనా చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చినప్పుడు మనం అదే విధమైన క్రమశిక్షణను పాటించాం. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని జాతి యావత్తూ ఆ నిర్ణయాన్ని శాంతియుతంగా, హుందాగా అంగీకరించడాన్ని ఆ రోజున మనం చూశాం. ఈ రోజున కూడా అలాంటి శాంతియుత ప్రవర్తన మన అనుభవంలోకి వస్తోంది.
సహచరులారా, ఈ ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం అనేది ఒక నూతన చరిత్రను రాస్తుండడమే కాదు చరిత్ర పునరావృతం కావడం కూడా.
భగవాన్ శ్రీరామచంద్ర మూర్తి సాధించిన విజయంలో ఉడత, కోతులు, బోటు మనిషి, అడవుల్లో నివసించేవారు ప్రధాన పాత్ర పోషించినట్టే...
గోవర్ధన పర్వతాన్ని ఎత్తడంలో శ్రీ కృష్ణ పరమాత్మునికి పశువుల కాపరులు సాయం చేసినట్టే...
స్వరాజ్యాన్ని సాధించడానికిగాను ఛత్రపతి శివాజీ చేసిన పోరాటంలో మావలే ముఖ్య భూమిక పోషించనట్టే...
విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా మహారాజా సుహేల్‌దేవ్ చేసిన పోరాటంలో పేదలు, వెనకబడిన వర్గాల ప్రజలు కీలక పాత్ర పోషించినట్టే...
భారతదేశ స్వాతంత్ర్యపోరాటంలో భాగంగా దళితులు, అణగారిన వర్గాల ప్రజలు, గిరిజనులతోపాటు అన్ని వర్గాల ప్రజలు గాంధీజీకి అండగా నిలిచినట్టే..
అదే తీరుగా ఈ రోజున దేశ ప్రజల మద్దతుతో రామాలయ నిర్మాణమనే పుణ్యకార్యక్రమం మొదలైంది.
శ్రీరామ నామం చెక్కిన రాళ్లతో రామసేతును నిర్మించినట్టుగానే అదే విధంగా ఎంతో భక్తి ప్రపత్తులతో దేశవ్యాప్తంగా వున్న భక్తులు పంపిన రాళ్లే ఇక్కడ శక్తి వనరులుగా మారాయి.
దేశవ్యాప్తంగా వున్న పలు పుణ్యక్షేత్రాలు, నదులనుంచి సేకరించిన మట్టి , నీళ్లు, ఆయా పుణ్య ప్రదేశాల సంస్కృతి, అవి అందించే స్ఫూర్తి ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక విశిష్టమైన బలాన్ని ఇస్తున్నాయి.
నిజం చెప్పాలంటే ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి. గతంలో ఎన్నడూ జరగలేదు. ముందు జరగబోదు అన్నట్టుగా వుంది.
భారతదేశ భక్తి ప్రపత్తులు, భారతీయుల ఐకమత్యం, భారతదేశ ఐకమత్యానికి వున్న గొప్ప బలాన్ని ప్రపంచ దేశాలు అధ్యయనం చేసి, విశ్లేషణ చేయాలి.
స్నేహితులారా, శ్రీరామచంద్రునిలో తేజోశక్తి, తెలివితేటల్ని సూర్యదేవునితో పోల్చి చూస్తారు. అలాగే ఆయన క్షమాగుణాన్ని ధరిత్రితో పోల్చుతారు. ఆయన జ్ఞానశక్తిని బృహస్పతితో సమానంగా చూస్తారు. ఇక పేరుప్రఖ్యాతుల్లో ఆయన్ను ఇంద్రునితో సమానంగా చెబుతారు.
భగవాన్ శ్రీ రామచంద్రుని స్వభావం సత్యానికి, నిజాయితీకి దర్పణాలు. అందుకే ఆయన సంపూర్ణ మానవునిగా కీర్తింపబడ్డారు.
అందుకే వేలాది సంవత్సరాలుగా భారతదేశానికి శ్రీరామచంద్రుడు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆయన తన పాలనలో సామాజిక సమతుల్యతను ఒక ప్రధానమైన అంశంగా చూశారు.
ఆయన గురు వశిష్టులనుంచి జ్ఞానాన్ని పొందారు. సీతమ్మ నుంచి ప్రేమ పొందారు. శబరినుంచి మాతృప్రేమను పొందారు. హనుమాన్ జీ నుంచి, ఆదివాసీలనుంచి మద్దతు సహకారం పొందారు. ప్రజలనుంచి నమ్మకాన్ని పొందారు.
ఆయన ఎంతో సంతోషంతో ఉడత సాయాన్ని, ప్రాధాన్యతను చాటారు. ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం, ఆయన ధైర్యసాహసాలు, దాతృత్వం, నిజాయితీ, ఓపిక, ప్రత్యేక దృక్పథం, తాత్విక దృక్పథం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిని ఇస్తూనే వుంటాయి.
శ్రీరామచంద్రుడు తన ప్రజలందరినీ ప్రేమించారు. అయితే ఆయన తన రాజ్యంలోని పేదలు, అణగారిన వర్గాలపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టి వారి సంక్షేమంకోసం కృషి చేశారు. అందుకే శ్రీరాముని గుణాలను వర్ణిస్తూ సీతమ్మవారు ఇలా అన్నారు. దీనదయాళ్ బిరిదుసంబారీ అనేవారు. అంటే శ్రీరాముడు పేదల, అణగారిన వర్గాల పక్షపాతి.
ప్రతి మనిషి జీవితంలోని ప్రతి దశ శ్రీరామచంద్రుని స్ఫూర్తితో వికసించినదే. భగవాన్ రామున్ని ప్రతిఫలించని ప్రదేశం భారతదేశంలో లేదు.
భారత దేశ నమ్మకం శ్రీరామచంద్రుడు. బారతదేశ ఆదర్శాల్లో వున్నది శ్రీరాములవారే. ఆయన దేశ ఆధ్యాత్మికతలో, దైవత్వంలో వున్నారు. భారతదేశ తాత్వికతలో ఆయన జీవిస్తున్నారు.
వేలాది సంవత్సరాల క్రితం పురాతన భారతదేశానికి శ్రీరాములవారు స్ఫూర్తినిచ్చారని వాల్మీకి రామాయణం చెబుతోంది. అదే రాముడు మధ్యయుగాల్లో తులసి, కబీర్, నానక్ లద్వారా ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. అదే శ్రీరాములవారు అహింస, సత్యాగ్రహాలనే ఆయుధాలతో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్న బాపు వెంట నిలిచి ఆయన భజనలద్వారా మనకు సాక్షాత్కరించారు.
తులసి వర్ణించిన రామునికి ఆకారం వుంది. నానక్, కబీర్ వర్ణించిన రాముడు నిరాకారుడు. భగవాన్ బుద్ధుడు కూడా భగవాన్ రామునితో సాన్నిహిత్యం కలిగి వున్నారు. అదే సమయంలో శతాబ్దాల తరబడి అయోధ్య నగరం జైన మతానికి కేంద్రంగా వుండేది. ఇది సర్వాంతర్యామి రాముని మహిమ. ఇది భారతదేశంలోని భిన్నత్వంలోని ఏకత్వాన్ని చాటుతోంది.
తమిళ భాషలో మనకు కంభ రామాయణముంది. తెలుగులో మనకు రంగనాధ రామాయణం వుంది
ఒడియా భాషలో మనకు రుయ్‌పాద్ కతేర్‌పాడి రామాయణం వుంది. కుముదేందు రామాయణాన్ని కన్నడ భాషలో చూడవచ్చు. కశ్మీర్లో రామవతర్ చరిత్ వుంది. మళయాళ భాషలో రామచరితాన్ని రాశారు.
బంగ్లా భాషలో కృతిబాస్ రామాయణం వుంది. గురు గోవింద్ సింగ్ స్వయంగా గోవింద రామాయణాన్ని రచించారు.
మనం పలు రామాయణాల్లో పలు రూపాల్లో రామున్ని చూడవచ్చు. అయితే రాముడు అన్ని చోట్లా వున్నారు. ఆయన అందరివాడు. అందుకే ఆయన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన మహనీయుడు.
స్నేహితులారా, ప్రపంచంలోని పలు దేశాలు భగవాన్ రామచంద్రునికి తమ అభివాదాలు తెలుపుతున్నాయి. ఆయా దేశాల పౌరులు తమను శ్రీరామచంద్రునితో అనుబంధం కలిగినవారిగా నమ్ముతున్నారు.
ప్రపంచంలోనే ఎక్కువ ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. ఆ దేశంలో పలు రామాయణ గాధలున్నాయి. మన దేశంలో వున్నట్టుగానే ఆ దేశంలో కూడా కకావిన్ రామాయాణం, స్వర్ణదీప్ రామాయాణం, యోగేశ్వర్ రామాయణం...ఇలా పలు పేర్లతో రామాయణాలున్నాయి. ఈ రోజుకు కూడా అక్కడ భగవాన్ శ్రీరామచంద్రులవారు పూజలందుకుంటున్నారు.
కంబోడియా దేశంలో రామ్ కెర్ రామాయణం వుంది. లావోలో ప్ర లాక్ ఫ్ర లామ్ రామాయణం వుంది. మలేషియాలో హికాయత్ సెరి రామ్, థాయ్ ల్యాండ్ లో రామాకెన్ పేర్లతో రామయణాలున్నాయి.
ఆఖరికి ఇరాన్, చైనా దేశాల్లో కూడా భగవాన్ రాములవారి ప్రస్తావనను, రామకథ వర్ణనను చూడవచ్చు.
ఇక శ్రీలంకను తీసుకుంటే ఈ దేశంలో జానకి అపహరణ పేరుతో రామాయణ గాధను బోధిస్తారు. గానం చేస్తారు. మాతా జానకి ద్వారా నేపాల్ దేశానికి నేరుగా భగవాన్ రాములవారితో సంబంధముంది.
ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో అక్కడి ప్రజల నమ్మకాలు లేదా గతాన్ని బట్టి అక్కడ భగవాన్ శ్రీరామచంద్రులవారు పూజలందుకున్నారు.
ఇప్పటికి కూడా భారతదేశం వెలుపల పలుదేశాల్లోని ప్రజల సంప్రదాయాల్లో రామకథకు ప్రజాదరణ వుంది.
నేడు అయోధ్యలో శ్రీరామచంద్రులవారి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతున్నందుకు ఈ దేశాల ప్రజలందరూ ఎంతగానో సంతోషిస్తుంటారని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఎందుకంటే భగవాన్ శ్రీరామచంద్రులవారు అందరివాడు. అందరిలో ఆయనే వున్నారు.
స్నేహితులారా, అయోధ్యలో నిర్మిస్తున్న ఈ మహా ఆలయం భారతదేశ సంస్కృతి, ఉన్నత వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని నాకు నమ్మకం వుంది.
ఇక్కడ నిర్మిస్తున్న రామ మందిరం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తూనే వుంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి భగవాన్ శ్రీరామచంద్రులవారి సందేశంతోపాటు రామాలయం గొప్పదనాన్ని, వేలాది సంవత్సరాల మన సంప్రదాయాలను రానున్న రోజుల్ల మొత్తం ప్రపంచానికి చేరేలా మనం కృషి చేయాలి.
మన దేశ విజ్ఞానం, మన జీవన విధానం ప్రపంచమంతా చాటడమనేది ఈ తరంతోపాటు భవిష్యత్ తరాల బాధ్యత.
దీన్ని దృష్టిలో పెట్టుకొని రామా సర్క్యుట్ ను తయారు చేయడం జరుగుతోంది. శ్రీరాములవారి పవిత్ర ప్రయాణాన్ని అనుసరించి ఇది వుంటుంది.
శ్రీరామచంద్రులవారి పట్టణం అయోధ్య. అయోధ్య వైభవం గురించి స్వయంగా శ్రీరాములవారే వర్ణించారు.
నా జన్మభూమి అయోధ్య అత్యంత సహజసిద్ధ అందాలతో అలరారే నగరమని ఆయన పేర్కొన్నారు.
భగవాన్ శ్రీరామచంద్రులవారి జన్మభూమి వైభవాన్ని, దైవత్వాన్ని ద్విగుణీకృతం చేసేలా ఇక్కడ చాలా చారిత్రాత్మక పనులను చేపట్టడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది.
స్నేహితులారా ఇతిహాసాల్లో, పవిత్ర గ్రంధాల్లో శ్రీరాములవారి గొప్పదనాన్ని వర్ణించారు. ఈ మొత్తం ప్రపంచంలో భగవాన్ శ్రీరామచంద్రులవారంత గొప్ప ప్రభువు మరొకరు లేరని వాటిలో చెప్పారు.
తన రాజ్యంలో ఎవరూ విషాదంతో వుండకూడదని, పేదరికం వుండకూడదని భగవాన్ శ్రీరామచంద్రులు చాటారు.
ఆడయినా మగయినా సరే ప్రజలందరూ సమానమైన సంతోషంతో జీవించాలని భగవాన్ శ్రీరామచంద్రులవారు సామాజిక సందేశమిచ్చారు.
అంతే కాదు ఆయన ఇచ్చిన మరో సందేశం రైతులు, గోపాలకులు ఎల్లప్పుడూ సంతోషంగా వుండాలనేది.
తన రాజ్యంలో వృద్ధులు, చిన్నారులు, వైద్యులు ఎల్లప్పుడూ తగిన భద్రత పొందుతూ వుండాలని భగవాన్ శ్రీరామచంద్రులవారు ఆదేశాలు జారీ చేశారు.
ఆశ్రయం కావాలని వచ్చిన శరణార్థులను రక్షించడమనేది అందరి బాధ్యత అని భగవాన్ శ్రీరామచంద్రులవారు తన పాలనలో పిలుపునిచ్చారు.
అంతేకాదు ఆయన ఇచ్చిన నినాదం మన మాతృభూమి స్వర్గంకంటే కూడా ఉన్నతమైంది.
సోదర సోదరీమణులారా భగవాన్ శ్రీరాములవారి నియమం ఏంటంటే భయభక్తులు లేకపోతే ప్రేమ వుండదనేది.
కాబట్టి భారతదేశం బలోపేతం కావడం కొనసాగినంతకాలం దేశం శాంతి, సంతోషాలతో వుంటుంది.
భగవాన్ శ్రీరాములవారు ఆచరించిన విధానమే చాలా సంవత్సరాలుగా భారతదేశానికి మార్గదర్శకత్వంగా వుంది.
శ్రీరాములవారి సందేశాల ప్రకారమే జాతిపిత మహాత్మాగాంధీ రామ రాజ్యం కోసం కలలు కనేవారు. భగవాన్ శ్రీరామచంద్రులవారి జీవితం, ఆయన జీవన విధానాలే స్ఫూర్తిగా గాంధీజీ రామరాజ్య భావన రూపొందింది.
స్నేహితులారా, భగవాన్ శ్రీరామచంద్రులవారు స్వయంగా ఇలా చెప్పారు.
కాలం, స్థలం, పరిస్థితులనుబట్టి రాముడు మాట్లాడతారు, ఆలోచిస్తారు, ఆచరిస్తారు అని ఆయనే స్వయంగా అన్నారు.
కాలంతోపాటు ఎలా ఎదగాలి, ఎలా జీవించాలి అనే విషయాన్ని భగవాన్ శ్రీరామచంద్రులవారు మనకు బోధించారు.
మార్పు మరియు ఆదునికతల అవసరాన్ని ఆయన ప్రచారం చేశారు.
భగవాన్ శ్రీరామచంద్రులవారు ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశాల ప్రకారం, ఆయన ఆదర్శాల ప్రకారమే భారతదేశం ఎంతో గర్వంగా గొప్పగా ముందుకు సాగుతోంది.
స్నేహితులారా మనం మన బాధ్యతలను ఎలా నెరవేర్చాలనే విషయాన్ని భగవాన్ శ్రీరామచంద్రులవారు మనకు బోధించారు.
సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, జ్ఞాన సముపార్జన ఎలా చేయాలో అనే విషయం కూడా ఆయన మనకు బోధించారు.
ప్రేమ, గౌరవం, సోదరత్వమనే ఇటుకలతో శ్రీరాములవారి మందిరాన్ని మనం నిర్మించాలి.
భగవాన్ శ్రీరామచంద్రులవారిపై విశ్వాసముంచినప్పుడు మానవాళి ప్రగతి సాధించింది. మానవాళి ఆయనకు దూరంగా జరిగినప్పుడు విధ్వంసంవైపు అది అడుగులు వేసింది.
అందరి విశ్వాసాలను నమ్మకాలను మనం గౌరవించాలి. మనం ఐకమత్యంగా వుండి అందరం కలిసికట్టుగా ప్రగతి సాధించాలి. ఒకరంటే మరొకరు నమ్మకం కలిగి వుండాలి.
మనం చేసే పనులు, మనం తీసుకున్న నిర్ణయాల సాయంతో దృఢమైన, స్వయం సమృద్ధ భారతదేశాన్ని తయారు చేసుకోవాల్సి వుంది.
స్నేహితులారా, తమిళ రామాయణంలో భగవాన్ శ్రీరామచంద్రులవారు ఇలా అంటారు. జాప్యం చేయకూడదు. మనం ముందడుగు వేయాలి అని ఆయన అంటారు.
భగవాన్ శ్రీరామచంద్రులవారు ఇచ్చిన ఆ సందేశం వర్తమాన భారతదేశానికి, మనందరికీ వర్తిస్తుంది.
మనం ముందడుగు వేస్తామని, మన దేశం ప్రగతిపథంలో ముందుకు వెలుతుందని నాకు విశ్వాసం వుంది. భగవాన్ శ్రీరామచంద్రులవారి ఈ ఆలయం భవిష్యత్తులో మానవాళికి స్ఫూర్తిని ఇచ్చి, మార్గదర్శకత్వం ఇస్తూనే వుంటుంది.
ఈ కరోనా మహమ్మారి వైరస్ విపత్కర పరిస్థితుల్లో... భగవాన్ శ్రీరామచంద్రులవారు ఆచరించిన స్వీయ నియంత్రణ విధానం చాలా అవసరం. మనం తప్పనిసరిగా రెండు గజాల భద్రమైన భౌతిక దూరాన్ని పాటించాలి. తప్పకుండా మాస్కు ధరించాలి.
మన దేశాన్ని ఆరోగ్యకరంగా, సంతోషంగా వుంచాలని నేను భగవాన్ శ్రీరామచంద్రులవారిని ప్రార్థిస్తున్నాను.
మాతృమూర్తి సీతమ్మవారు, భగవాన్ శ్రీరామచంద్రులవారు ...ఎల్లప్పుడూ వారి ఆశీస్సులను మనకు అందిస్తూనే వుండాలి.
ఈ ఆకాంక్షతో ఈ సందర్భంగా నా దేశ ప్రజలకు మరోమారు అభినందనలు తెలియజేస్తున్నాను.
సీతాపతి భగవాన్ శ్రీరామచంద్రులవారికి జేజేలు పలుకుతూ ముగిస్తున్నాను.
****
(Release ID: 1643683)
Visitor Counter : 382
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam