రాష్ట్రప‌తి స‌చివాల‌యం

విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనిక ఆసుపత్రికి రాష్ట్రపతి విరాళం

విరాళ నిధులతో, కరోనా యోధుల కోసం గాలి వడపోత సామగ్రి కొనుగోలు

Posted On: 26 JUL 2020 12:57PM by PIB Hyderabad

కార్గిల్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాడి, దేశం కోసం ప్రాణాత్యాగం చేసిన సైనికులకు నివాళిగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిల్లీలోని సైనిక ఆసుపత్రికి రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కోసం ఈ డబ్బుతో రక్షణ సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించిన రోజును 'విజయ్‌ దివస్‌'గా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఇది, 21వ విజయ్‌ దివస్‌.
 
    రాష్ట్రపతి భవన్‌లో పొదుపు చర్యల కారణంగా సైనిక ఆసుపత్రికి విరాళం సాధ్యమైంది. కరోనాను కట్టడి చేయడానికి మరిన్ని వనరులు అందుబాటులోకి వచ్చినట్లయింది. రాష్ట్రపతి భవన్‌లో చేపట్టే కొన్ని చర్యలను నిలిపేస్తూ, రాష్ట్రపతి గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. వేడుకల సందర్భాల్లో ఉపయోగించేందుకు 'లిమౌజిన్' కారును కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఆయన వాయిదా వేశారు.

    సైనిక ఆసుపత్రికి రాష్ట్రపతి ఇచ్చిన విరాళంతో 'పీఏపీఆర్‌' (పవర్డ్‌ ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ రెస్పిరేటర్‌) యూనిట్లు కొనుగోలు చేయనున్నారు. ఇవి అత్యాధునికమైవి. శస్త్రచికిత్స సమయంలో వైద్యులు వీటిని ధరించడం వల్ల సులభంగా శ్వాస సాధ్యమవడంతోపాటు, వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యులకు, రోగులకు కూడా ఇవి ఉపయుక్తంగా ఉంటాయి.
 
    సర్వ సైన్యాధిపతిగా రాష్ట్రపతి చూపిన ఉదారత, సైనిక ఆసుపత్రిలో కరోనా విధుల్లో ఉన్న సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. వారికి రక్షణ లభించడం వల్ల అత్యుత్తమ పనితీరును ప్రదర్శించగలుగుతారు. ఇతరులు, సంస్థలు కూడా పొదుపు చర్యలు పాటించి, ఆ డబ్బును కొవిడ్‌ యోధులకు మద్దతుగా ఉపయోగించడానికి స్ఫూర్తి పొందుతారు.
 
    దిల్లీలోని సైనిక ఆసుపత్రి, భారత సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి ఆరోగ్య సంరక్షణ కేంద్రం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో, ఈ ఆసుపత్రి వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అవిరామంగా 24 గంటలూ పనిచేస్తున్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు నాణ్యమైన వైద్య సంరక్షణ అందిస్తున్నారు.    

***



(Release ID: 1641356) Visitor Counter : 204