గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
"గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమస్య ఆధారిత అంతర్గత తనిఖీ బలోపేతం"పై వీడియో కాన్ఫరెన్స్
"గ్రామీణాభివృద్ధి కోసం ఆర్థిక నిర్వహణ సూచిక"ను విడుదల చేసిన కేంద్రమంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్
గ్రామ పంచాయతీలకు అందించే నిధులను గ్రామ అభివృద్ధి పనులకు సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూడాలని రాష్ట్రాలకు తోమర్ పిలుపు; పథకాల అమలులో సంపూర్ణ పారదర్శకతపై కేంద్రం దృష్టి పెట్టిందని వెల్లడి
Posted On:
25 JUL 2020 3:22PM by PIB Hyderabad
కేంద్ర గ్రామీణాభివృద్ధి&పంచాయతీ రాజ్, వ్యవసాయం&రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, "గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమస్య ఆధారిత అంతర్గత తనిఖీ బలోపేతం"పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, కార్యదర్శి ఎన్.ఎన్.సిన్హా, ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసోం, బిహార్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
రాష్ట్రాల సహకారంతో, గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజికాభివృద్ధి కోసం కార్యక్రమాల రూపకల్పన, అమలు బాధ్యత గ్రామీణాభివృద్ధి శాఖకు ఉందని, ఈ కార్యక్రమంలో మంత్రి తోమర్ చెప్పారు. "మంత్రిత్వ శాఖ తన కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల సుస్థిర, సమగ్రాభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తుంది. వేతనాలు, స్వయం ఉపాధి, గృహ కల్పన, రహదారులు, సామాజిక భద్రత వంటివాటి ద్వారా జీవనోపాధి అవకాశాలను విస్తరించడానికి బహుముఖ వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలలో సుమారు రూ.1.2 లక్షల కోట్లు కేటాయించాం. కొవిడ్ పరిస్థితుల కారణంగా, ఉపాధి హామీ పథకానికి రూ.40 వేల కోట్లను అదనంగా ఇచ్చాం. పల్లెల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు, యూటీలకు ఇప్పటికే రూ.90 కోట్లు మంజూరు చేశాం" అని తోమర్ చెప్పారు.
ఈ సందర్భంగా, కొత్తగా, ఈ క్రింది అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరుకు ర్యాంకులు ఇచ్చేలా "గ్రామీణాభివృద్ధి కోసం ఆర్థిక నిర్వహణ సూచిక"ను నరేంద్ర సింగ్ తోమర్ విడుదల చేశారు:
* వార్షిక ప్రణాళిక తయారీ, ఆర్థిక సంవత్సరానికి నిధుల అవసరంపై అంచనాలు, రాష్ట్ర వాటాను వేగంగా విడుదల చేయడం, నిధులను సకాలంలో ఉపయోగించడం, వినియోగ పత్రాలు సమర్పించడం మొదలైనవి.
* 'పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం' (పీఎఫ్‌ఎంఎస్) అత్యుత్తమ అమలు &ప్రత్యక్ష ప్రయోజన బదిలీ.
* అంతర్గత తనిఖీ
* సామాజిక తనిఖీ
రాష్ట్రాల మధ్య పోటీ, సహకార సమాఖ్య స్ఫూర్తిని ఈ సూచిక పెంచుతుందని శ్రీ తోమర్ అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన మొదలైన పథకాల సమర్థవంత అమలు కోసం నిధులను అత్యుత్తమంగా వినియోగించాలని రాష్ట్రాలకు సూచించారు.
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్రం అందిస్తున్న నిధులను, గ్రామ స్థాయి అభివృద్ధి పనులకు సమర్థవంతంగా ఉపయోగించేలా చూడాలని మంత్రి తోమర్ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నిధుల వినియోగంలో అవకతవకలు జరిగితే అంతర్గత తనిఖీ ద్వారా బయట పెట్టాలని, తదనుగుణంగా వెంటనే చర్యలుంటాయని అన్నారు.
ఈ పథకాల అమలులో సంపూర్ణ పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని తోమర్ ఉద్ఘాటించారు.
(Release ID: 1641209)
Visitor Counter : 926