రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నౌకాదళ అతి పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

Posted On: 23 JUL 2020 5:03PM by PIB Hyderabad

దక్షిణ నౌకాదళ స్థావర కమాండింగ్‌ అధికారి, వైస్‌ అడ్మిరల్‌ అనిల్‌ కుమార్‌ చావ్లా, ఎజిమ‌లలోని "ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ" ‍(ఐఎన్‌ఏ)లో మూడు మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంటును ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. 2022 నాటికి వంద మెగావాట్ల సౌర విద్యుత్‌ సాధనకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన "నేషనల్‌ సోలార్‌ మిషన్‌"లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

    భారత నౌకాదళంలోనే ఇది అతి పెద్ద సౌర విద్యుత్‌ ప్లాంటు. 25 ఏళ్లపాటు సేవలు అందిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన 9180 అత్యంత సమర్థవంతమైన ఏకస్పటికాకార సౌర ఫలకాలు సహా, ఈ ప్లాంటులో ఉపయోగించిన వస్తువులన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిందే. "కేరళ స్టేట్‌ ఎలక్ట్రానిక్స్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌" (కెల్ట్రాన్‌) ఈ ప్లాంటు ఏర్పాటులో పాల్గొంది.

    భారీ వర్షాలు, కొవిడ్‌ ఆంక్షలు ఇబ్బంది పెట్టినా, "కేరళ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌" ‍‍‍(కేఎస్‌ఈబీ) సహా సంబంధిత సంస్థలన్నీ పనులు ఆపకుండా ఈ ప్రాజెక్టులో పాల్గొన్నాయి. కాల పరిమితి పెట్టుకుని, కొవిడ్ ప్రొటోకాల్‌ పాటిస్తూ పనులు పూర్తి చేశాయి.

    ఎజిమలలోని ఈ సౌర విద్యుత్‌ ప్లాంటు కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి తోడ్పడుతుంది. స్వచ్ఛ, హరిత పర్యావరణం కోసం ఐఎన్‌ఏ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్లాంటులో మిగులు విద్యుత్‌ను కేఎస్‌ఈబీ ఎలక్ట్రిసిటీ గ్రిడ్‌కు అనుసంధానిస్తారు.


(Release ID: 1640740) Visitor Counter : 259