ప్రధాన మంత్రి కార్యాలయం
మణిపూర్ లో నీటి సరఫరా ప్రాజెక్టు కు శంఖుస్థాపన చేసిన - ప్రధానమంత్రి.
ఈ ప్రాజెక్టుతో లక్షలాది మంది ప్రజలు తమ ఇంటి వద్ద స్వచ్ఛమైన తాగునీరు పొందగలుగుతారు.
సులభంగా జీవించడం అనేది, మెరుగైన జీవితానికి ముందస్తు అవసరం, పేదలతో సహా అందరికీ అది ఒక హక్కు: ప్రధానమంత్రి
Posted On:
23 JUL 2020 1:47PM by PIB Hyderabad
మణిపూర్‌లో నీటి సరఫరా ప్రాజెక్టు కు ప్రధానమంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశం యావత్తూ ఈ రోజున కోవిడ్-19 కు వ్యతిరేకంగా నిరంతరాయంగా పోరాడుతుండగా, తూర్పు మరియు ఈశాన్య భారతదేశం భారీ వర్షాలు, వరదల యొక్క ద్వంద్వ సవాళ్లను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. దీని ప్రభావంతో చాలా మంది ప్రాణాలను కోల్పోయారు, అనేకమంది నిరాశ్రయులయ్యారు.
లాక్ డౌన్ సమయంలో మణిపూర్ ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసిందనీ, ముఖ్యంగా వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి రావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రధానమంత్రి చెప్పారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మణిపూర్‌లో సుమారు 25 లక్షల మంది పేదలు ఉచితంగా ఆహార ధాన్యాలు పొందారని ఆయన చెప్పారు. అదేవిధంగా, మణిపూర్‌లో 1.5 లక్షల మందికి పైగా మహిళలకు ఉజ్జ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సౌకర్యం కల్పించారు.
మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో అమలు చేయబడుతున్న ఈ నీటి సరఫరా ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ, ఇది రాష్ట్రంలో నీటి సమస్యలను తగ్గిస్తుందనీ, ముఖ్యంగా రాష్ట్ర మహిళలకు భారీ ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ ఇంఫాల్ తో పాటు, 25 చిన్న పట్టణాలు మరియు రాష్ట్రంలోని 1,700 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని శ్రీ నరేంద్రమోదీ చెప్పారు. రాబోయే రెండు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు ను రూపొందించడం జరిగింది.
ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి తమ ఇళ్ళల్లో స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుందనీ, వేలాది మందికి ఉపాధి లభిస్తుందనీ, ఆయన చెప్పారు.
15 కోట్లకు పైగా గృహాలకు నేరుగా పైపుల ద్వారా నీరు సరఫరా చేసే లక్ష్యంతో గత ఏడాది జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించిన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఈ రోజున దేశంలో ప్రతిరోజూ ప్రజల భాగస్వామ్యంతో సుమారు ఒక లక్ష నీటి కనెక్షన్లు ఏర్పాటు చేయబడుతున్నాయి.
సులభంగా జీవించడం అనేది, మెరుగైన జీవితానికి ముందస్తు అవసరమనీ, పేదలతో సహా అందరికీ అది ఒక హక్కు అనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
గత 6 సంవత్సరాల్లో, ప్రతి స్థాయిలో, ప్రతి రంగంలో, జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు, ముఖ్యంగా పేదలు సులభంగా జీవించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఈ రోజు మణిపూర్ తో సహా మొత్తం భారతదేశం బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎల్.పి.జి. గ్యాస్ నిరుపేదలకు చేరిందనీ, ప్రతి గ్రామం మంచి రహదారులతో అనుసంధానించబడిందనీ, నిరాశ్రయులకు పక్కా ఇళ్లు అందిస్తున్నామనీ, ఆయన వివరించారు.
ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే పని మిషన్ మోడ్‌లో ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు.
మెరుగైన జీవితం కూడా నేరుగా అనుసంధానంతో ముడిపడి ఉందని శ్రీ మోదీ అన్నారు. సురక్షితమైన, ఖచ్చితమైన ఆత్మ నిర్భర్ భారత్ కోసం ఈశాన్యప్రాంతంతో అనుసంధానమై ఉండడం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ "యాక్ట్ ఈస్ట్ విధానానికి" ఇది ఇక నిదర్శనంగా నిలుస్తుందనీ, ఇది దేశ ప్రయాణ, పర్యాటక రంగానికి ఒక ప్రధాన మార్గాన్ని కూడా అందిస్తుందనీ ఆయన వివరించారు.
రోడ్లు, రహదారులు, విమాన మార్గాలు, జలమార్గాలు, ఐ-వే లతో పాటు గ్యాస్ పైప్ లైన్ లతో ఈశాన్య ప్రాంతాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. గత 6 సంవత్సరాలలో, మొత్తం ఈశాన్య ప్రాంతంలో, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టారు.
నాలుగు ఈశాన్య రాష్ట్రాల రాజధానుల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాలకు రెండు వరుసల రోడ్ల తోనూ మరియు గ్రామాలకు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే రహదారులతోనూ అనుసంధానించడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రధానమంత్రి తెలియజేశారు. దీనిని సాధించడానికి సుమారు 3 వేల కిలోమీటర్ల రోడ్లు వేయాలనీ, దీనితో పాటు మరో 60,000 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి ప్రాజెక్టులు అమలు చేస్తున్నామనీ, ఆయన చెప్పారు.
కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించడానికీ, ప్రస్తుతం ఉన్న రైలు మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడానికి అవసరమైన ప్రాజెక్టులతో ఈశాన్య ప్రాంతంలో రైలు అనుసంధాన విస్తీర్ణాన్ని భారీగా మెరుగుపరుస్తున్నట్లు ప్రధానమంత్రి వివరించారు. అదేవిధంగా, ఈశాన్య ప్రాంతంలోని ప్రతి రాష్ట్ర రాజధానినీ రైలు మార్గంతో అనుసంధానించే పని గత 2 సంవత్సరాలుగా శీఘ్రగతిని కొనసాగుతోంది.
రోడ్లు, రైల్వేలతో పాటు, ఈశాన్య ప్రాంతానికి విమాన మార్గాల అనుసంధానం కూడా అంతే ముఖ్యమైనది. ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో సుమారు 13 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. ఇంఫాల్ విమానాశ్రయంతో సహా ఈశాన్య ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలను ఆధునీకరించడానికి మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒకటి తో సహా 20 కి పైగా జాతీయ జలమార్గాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, అవి కూడా పటిష్టమైన అనుసంధానతను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.
భారతదేశ సాంస్కృతిక వైవిధ్యానికీ, సాంస్కృతిక పటిష్టతకూ, ఈశాన్య ప్రాంతం ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం గొప్ప పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉందనీ, అయితే, ఇది ఇంకా పూర్తిగా కనిపెట్టబడలేదనీ ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో ఈశాన్య ప్రాంతం ముందంజలో ఉండాలని ప్రధానమంత్రి సూచించారు.
ఈ రోజు ఈశాన్య ప్రాంతంలోని యువత మరియు ప్రజలు హింసను త్యజించి, అభివృద్ధి మరియు పురోగతిని ఆకాంక్షిస్తున్నారనీ, ప్రధానమంత్రి అన్నారు. మణిపూర్ లో గతంలో ఉన్న దిగ్బంధనాలు ఇప్పుడు చరిత్రలో ఒక భాగంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
అస్సాం, త్రిపుర, మిజోరాం ప్రజలు ఇప్పుడు హింసా మార్గాన్ని విడిచిపెట్టారని శ్రీ మోదీ అన్నారు. బ్రూ-రీయాంగ్ శరణార్థులు ఇప్పుడు మెరుగైన జీవితం వైపు పయనిస్తున్నారని ఆయన తెలిపారు.
ఈశాన్య ప్రాంతంలో వెదురు పరిశ్రమకు ఉన్న గొప్ప సామర్థ్యాన్ని, సేంద్రీయ ఉత్పత్తులను అభివృద్ధి చేయగల సామర్థ్యానీ, ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం కింద స్థానిక ఉత్పత్తులకు విలువ పెంచే విధంగా మార్కెటింగ్ కోసం క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఈ క్లస్టర్ల నుండి వ్యవసాయ అంకురసంస్థలు, ఇతర పరిశ్రమలు లబ్ధి పొందుతాయని ఆయన చెప్పారు. భారతదేశం యొక్క వెదురు దిగుమతిని స్థానిక ఉత్పత్తి తో భర్తీ చేసే అవకాశం ఈశాన్య ప్రాంతానికి ఉందని ఆయన అన్నారు. దేశంలో అగరబత్తీలకు అతి పెద్ద డిమాండ్ ఉంది, అయితే, ఇప్పటికీ మనం బిలియన్ల రూపాయల విలువైన అగరబత్తీలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము. వెదురు రైతులు, హస్తకళలతో మరియు ఇతర సౌకర్యాలతో సంబంధం ఉన్న కళాకారుల కోసం జాతీయ వెదురు మిషన్ కింద వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఇది ఈశాన్య ప్రాంతాల్లోని, యువతకు, ఇక్కడ అంకురసంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, అంకురసంస్థలతో పాటు ఇతర శిక్షణా కార్యక్రమాల కోసం ఇప్పుడు ఈశాన్య భారతంలో అనేక సంస్థలను నిర్మిస్తున్నట్లు ప్రధానమంత్రి చెప్పారు. క్రీడల విశ్వవిద్యాలయం, ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడంతో, మణిపూర్ దేశ క్రీడా ప్రతిభకు ప్రధాన కేంద్రంగా మారనుంది.
*****
(Release ID: 1640710)
Visitor Counter : 256
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam