ఆర్థిక మంత్రిత్వ శాఖ

ద్వైపాక్షిక స‌మాచార మార్పిడి మ‌రింత‌ సుల‌భ‌త‌రానికి సీబీఐసీ, సీబీడీటీ ఒప్పందం

Posted On: 21 JUL 2020 12:40PM by PIB Hyderabad

రెండు సంస్థల మధ్య స‌మాచార‌ మార్పిడి కోసం ప్ర‌త్య‌క్ష ప‌న్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) మరియు ప‌రోక్ష ప‌న్నులు, క‌స్ట‌మ్స్ కేంద్ర బోర్డు మంగ‌ళ‌వారం ఒక అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై సీబీడీటీ ఛైర్మెన్ శ్రీ ప్రమోద్ చంద్ర మోడీ, సీబీఐసీ ఛైర్మన్ శ్రీ ఎం. అజిత్ కుమార్‌లు సంత‌కం చేశారు. రెండు సంస్థలకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. తాజా ఒప్పందం 2015లో సీబీడీటీ మ‌రియు పూర్వపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అధిగమించి ఇక‌పై అమ‌లులోకి రానుంది. 2015 ఏడాదిలో రెండు సంస్థ‌లు ఒక
ఒప్పందం కుదుర్చుక‌న్న‌ప్ప‌టికీ  అప్ప‌టి నుంచి ప‌లు కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్త‌గా జీఎస్‌టీని ప్రవేశపెట్టడం, జీఎస్‌టీఎన్‌ను చేర్చడం మరియు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌(సీబీఈసీ) విభాగం పేరును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ మరియు కస్టమ్స్‌గా (సీబీఐసీ) మార్చ‌డం వంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతితో సహా మారిన పరిస్థితుల‌ను ఈ రోజు చేసుకున్న అవగాహన ఒప్పందంలో చేర్చబడ్డాయి. ఈ అవగాహన ఒప్పందం సీబీడీటీ మరియు సీబీఐసీ మధ్య ఆటోమేటిక్ మరియు క్ర‌మం త‌ప్ప‌కుండా సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. క్రమం తప్పకుండా డేటా మార్పిడితో పాటు, సీబీడీటీ మరియు సీబీఐసీ కూడా ఒకదానితో ఒకటి, అభ్యర్థన మరియు ఆకస్మిక ప్రాతిపదికన, ఆయా సంస్థ‌లు కలిగి ఉన్న సంబంధిత స‌మాచారాన్ని డేటాబేస్‌ను వాడుకొనే వీలు కలుగనుంది. ఈ అవగాహన ఒప్పందం సంతకం చేసిన తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుంది. సీబీడీటీ మ‌రియు సీబీఐసీ సంస్థ‌లు ఇప్పటికే ఉన్న వివిధ యంత్రాంగాల ద్వారా స‌హ‌కరించుకుంటున్నాయి. వాటికి ఇది ‌కొనసాగుతున్న చొరవగా ఉండ‌నుంది.
డేటా ఎక్స్ఛేంజ్ స్టీరింగ్ గ్రూప్ ఏర్పాటు..
స‌మాచార మార్పిడి స్థితిని స‌మీక్షించేందుకు గాను డేటా ఎక్స్ఛేంజ్ స్టీరింగ్ గ్రూప్ కూడా ఈ చొరవ కింద ఏర్పాటు చేయబడింది. ఇది స‌మాచార మార్పిడి స్థితిని సమీక్షించడానికి మరియు డేటా పంచుకొనే వ్య‌వ‌స్థ‌ యొక్క ప్రభావాన్ని మరింత మెరుగు పరచడానికి గాను చర్యలు తీసుకుంటుంది. ఈ అవగాహన ఒప్పందం సీబీడీటీ మరియు సీబీఐసీ ల మధ్య సహకారం మరియు స‌మ‌న్విత చ‌ర్య‌ల విష‌య‌మై కొత్త శకానికి నాంది ప‌లుక‌నుంది.

***



(Release ID: 1640211) Visitor Counter : 267