సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సమూలమైన మార్పులతో ప్రధానమంత్రి ప్రజాపాలన ప్రతిభా పురస్కారాల పథకం ఆవిష్కరణ

ప్రధాని స్ఫూర్తిదాయక పాలనకు అనుగుణంగా పథకంలో
మార్పులు, పౌరులకు భాగస్వామ్యం: మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 17 JUL 2020 6:03PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, ప్రధాని కార్యాలయం, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి ( స్వతంత్ర ప్రతిపత్తి)  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ప్రధానమంత్రి ప్రజాపాలన ప్రతిభా పురస్కారాల పథకాన్ని ఆవిష్కరించారు. దానితోబాటే అందుకు సంబంధించిన  వెబ్ పోర్టల్ www.pmawards.gov.in ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిత్వశాఖలను, రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పరిపాలనా నమూనాను అనుసరించిఈ పథకంలో సమూలమైన మార్పులు చేసామని, పౌరులకు కూడా భాగస్వాములను చేశామని చెప్పారు. పరిపాలనకు పెద్దపీట ,  కనీస స్థాయిలో ప్రభుత్వ జోక్యం అనే మంత్రాన్ని సాకారం చేయాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండితీరాలని, ప్రజలే కేంద్ర బిందువుగా సాగినప్పుడే పారదర్శకత, జవాబుదారితనం ఉంటాయని అన్నారు.

భారత పరిపాలనా నమూనా ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిందని, అందుకే  ప్రధాన పథకాలన్నిటిలో ప్రజాభాగ స్వామ్యానికి ప్రధాని ఇచ్చిన పిలుపుకు ప్రజలు స్పందించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 2014 ఆగస్టు  15న ఎర్రకోట నుంచి ప్రధాని ఇచ్చినపిలుపుకు స్పందించి దేసం యావత్తూ టాయిలెట్ల నిర్మాణానికి నడుం బిగించటాన్ని మంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. పిలుపునిచ్చిన కొద్ది వారాల్లోనే అదొక ప్రజా ఉద్యమంగా మారిందని, దీంతో బహిరంగ మల మూత్ర విసర్జనకు స్వస్తి పలికి 2019 అక్టోబర్ 2 నాటికల్లా లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించటంలో కూడా గణనీయమైన పురోగతి సాధించామన్నారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను, అంకితభావాన్ని ఆయన అభినందించారు.

ప్రధానమంత్రి ప్రజా పాలన ప్రతిభా పురస్కారం విధివిధానాలలో సమూలమైన మార్పులు చేశామన్నారు. జిల్లా కలెక్టర్లు రకరకాల సూచికల ద్వారా, ఆర్థికాభివృద్ధిలో, ప్రజల భాగస్వామ్యంలో, సమస్యల పరిష్కారంలో చేసిన కృషి మీద నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలను లెక్కలోకి తీసుకుంటామని చెప్పారు. జిల్లా పనితీరు సూచికలు, సరికొత్త ఆవిష్కారాలు, ఆసావహ జిల్లా కార్యక్రమం, నమామి గంగ లాంటి నాలుగు విభాగాలలో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. జిల్ల పనితీరు కింద ప్రాధాన్యతా రంగాలకు రుణాలు, ప్రజా ఉద్యమాలకు ప్రోత్సాహం, మెరుగైన సేవలతోబాటు సమస్యల పరిష్కారం అనే అంశాలను లెక్కలోకి తీసుకుంటామని వెల్లడించారు. సరికొత్త ఆవిష్కరణలకు కేంద్ర, రాష్ట్ర, జిలా స్థాయిలో చూపిన చొరవను ఆధారంగా తీసుకుంటారు. ఈ అవార్డులకోసం 2018 ఏప్రిల్ 1 నుంచి 2020.  మార్చి 31 మధ్య కాలాన్ని లెక్కిస్తారు. ఈ పథకం లో 2020 కింద అవార్డులు ప్రకటిస్తారు.

జులై 17 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్ లైన్ పద్ధతిలో www.pmawards.gov.in  పోర్టల్ ద్వారా జిల్లాలు, అమలు చేసే యూనిట్లు, సంస్థలనుంచి వివిధ విభాగాల కింద  నిర్ణీత నమూనాలో దరఖాస్తులు స్వీకరిస్తారు. అందులో వారు సాధించిన ప్రగతి, అద్భుతమైన సాధనలు వివరించవలసి ఉంటుంది. దరఖాస్తు తీరుతెన్నులను, సంబంధితులందరూ రిజిస్టర్ చేసుకోవటానికి సులువైన మార్గాన్ని తమ శాఖ ఖరారు చేసి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనేలా చేస్తుందని మంత్రి చెప్పారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాగిన ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

<><><><><>



(Release ID: 1639517) Visitor Counter : 189