ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో ప్ర‌యివేటు రంగం నుంచి జాతీయ పెన్ష‌న్ విధానంలోకి 1.03 లక్షల సభ్యత్వాలు

- 2020-21 ఆర్థిక సంవత్సరం మొద‌టి త్రైమాసికంలో 206 కార్పొరేట్ సంస్థ‌ల నమోదు

- కార్పొరేట్‌ల నమోదు ద్వారా కొత్త‌గా 43,000 కొత్త చందాలు
- సర్వ‌జ‌న విధానం కింద దాదాపు 60,000 పైగా నమోదులు

Posted On: 17 JUL 2020 3:52PM by PIB Hyderabad

భారత ప్రభుత్వపు కంట్రిబ్యూషన్ పెన్షన్ ప‌థ‌కం అయిన 'జాతీయ పెన్ష‌న్ విధానం' (ఎన్‌పీఎస్) విభాగం ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2020-21) మొద‌టి త్రైమాసికపు చందాదారుల సంఖ్యను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో చందాదారుల సంఖ్యలో 30 శాతం వృద్ధిని నమోదు చేసిట్టుగా తెలిపింది. తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగం నుండి దాదాపుగా 1.03 లక్షల మంది వ్యక్తిగత చందాదారులు మరియు 206 కార్పొరేట్ సంస్థ‌లు నమోదు చేయబడ్డాయి. దీంతో 18 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం 10.13 లక్షల మంది కార్పొరేట్ చందాదారులు ఎన్‌పీఎస్‌లో చేరిన‌ట్ట‌యింది. నమోదు చేసుకున్న 1,02,975 మంది సభ్యులలో 43,000 మంది తమ యజమాని / కార్పొరేట్ సంస్థ‌ల ద్వారా సభ్యత్వం తీసుకోవాల‌ని సూచించ‌బ‌డిన వారు కాగా.. మిగిలిన వారు స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరారు.
మ‌హ‌మ్మారి ప్ర‌భావం లేకుండా చ‌ర్య‌లు..
కోవిడ్‌-19 నేప‌థ్యంలో యజమానులు వారి ఆర్థిక శ్రేయస్సు పరంగా ఉద్యోగులకు తగిన మద్దతునిచ్చేలా లోతైన చర్యల్ని స్వీకరించడానికి లేదా అనుసరించడానికి సంసిద్ధులుగా ముందుకు వ‌స్తున్నారు. విల్లిస్ టవర్స్ వాట్సన్ సంస్థ ఇటీవలి సర్వే ప్రకారం ప్రైవేటు రంగంలో దాదాపు 20 శాతం మంది యజమానులు పదవీ విరమణ సమర్ధతలు, అందుబాటులో ఉన్న పొదుపు ఎంపికలను గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించాల‌న్న లక్ష్యంతో ఉన్నారు. కొన్ని కంపెనీలు స్వతంత్ర, నిష్పాక్షికమైన ఆయా ఆర్థిక సలహాలను అందించే విష‌య‌మై పదవీ విరమణకు వచ్చే ఉద్యోగులపై దృష్టి సారిస్తున్నాయి. దీనికి తోడు 30 శాతం మంది యజమానులు కోవిడ్ మ‌హమ్మారి కార‌ణంగా ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రభావం త‌మ సంస్థ ఉద్యోగుల ఆర్థిక మరియు మానసిక శ్రేయస్సుపై ప‌డ‌కుండా ఉండేందుకు గాను త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నారు. యజమానుల స్వల్పకాలిక చర్యలు తీసుకుంటున్న‌ప్ప‌టికీ పదవీ విరమణ ప్రయోజనాలు తగ్గించే అవకాశం లేనందున ఎక్కువ‌గా ఉద్యోగులు త‌గిన చందా చెల్లింపులు, విత్‌డ్రాలు, టైమింగ్‌, ఏక‌మొత్తంలో చెల్లింపుల గురించిన ప‌లు సౌలభ్య‌త‌లను అన్వేషిస్తున్నారు.
క్రియాశీలక చర్యల్ని అనుస‌రిస్తున్నాము..
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డిఎ) ఛైర్మన్ శ్రీ సుప్రతీం బంధోపాధ్యాయ మాట్లాడుతూ “కార్పొరేట్ ఉద్యోగుల విష‌యంలోనూ జాతీయ పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్) విజయవంతమైంది. ఉద్యోగుల వ్య‌క్తిగ‌తపు జీవితంలో ఆర్థిక ప్రణాళికపై ఆస‌క్తి త‌గ్గుతున్న వేళ కోవిడ్ దానిని ముందంజలోకి తెచ్చింది. ఇలాంటి పరీక్ష సమయాల్లో త‌మ ఆర్థిక భద్రత గురించి అవగాహన కల్పిస్తోంది. రిటైర్మెంట్ ప్ర‌ణాళిక కేవలం పొదుపు లేదా ఇత‌ర‌ పన్ను ప్రయోజన ఎంపిక కాదన్న విష‌యాన్ని ఈ మహమ్మారి తెలియ‌ప‌రిచింది. ఎన్‌పీఎస్ యొక్క ప్రయోజనాల గురించి ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు గాను ప్రైవేట్ కార్పొరేట్‌లు పోషించిన పాత్ర ఎంత‌గానో ప్ర‌శంస‌నీయ‌మైంది. ఫలితంగా పెన్షన్ సెక్టార్ రెగ్యులేటర్‌కు ఆసక్తికర మెరుగైన‌ త్రైమాసికం లభించింది. అనూహ్య‌పు సంక్షోభం నెల‌కొని ఉన్న ఈ కాలంలో చందాదారులకు మేటి నిరంతరాయమైన సేవలను అందించేందుకు గాను.. మేము వివిధ ర‌కాల క్రియాశీలక చర్యలను అనుసరించాము” అని అన్నారు. పౌరులకు పెన్షన్ల గురించి తెలియ‌ప‌ర‌చ‌డం మరియు అవగాహన కల్పించేందుకు గాను పీఎఫ్‌ఆర్‌డీఏ జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్‌) ఇండస్ట్రీ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సహకారంతో వెబ్‌నార్లను నిర్వహిస్తోంది.

                                 

****



(Release ID: 1639494) Visitor Counter : 166