నౌకారవాణా మంత్రిత్వ శాఖ
కోల్కతానుంచి చటగావ్ ద్వారా అగర్తలాకు తొలి సరకు రవాణా నౌక
ప్రారంభించిన కేంద్రమంత్రి మన్.సుఖ్ మాండవీయ
భారతీయ సముద్రయాన రంగం, ఈశాన్య ప్రాంతపు ఆర్థికాభివృద్ధిలో
ఇది చారిత్రాత్మక ఘట్టమన్న మాండవీయ
Posted On:
16 JUL 2020 3:27PM by PIB Hyderabad
కోల్కతా ఓడరేవునుంచి అగర్తలాకు తొలి ప్రయోగాత్మక సరకు రవాణా నౌకను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్.సుఖ్ లాల్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు. ఈ నౌక బంగ్లాదేశ్ లోని చటగావ్ ఓడరేవు ద్వారా ప్రయాణిస్తుంది. ఆన్ లైన్ ద్వారా వర్చువల్ కార్యక్రమంగా నౌక ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. భారతదేశానికి చెందిన సరకు రవాణా నౌకలు బంగ్లాదేశ్ ద్వారా జరిపే సముద్రయానానికి చటగావ్, మోగ్లా ఓడరేవులను వినియోగించుకోవాలన్న ఒప్పందం మేరకు ఈ నౌకను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ,..ఈ సముద్రమార్గం ఉభయదేశాలకు కొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తుందని అన్నారు. బంగ్లాదేశ్ ద్వారా ఈశాన్య భారత ప్రాంతానికి మరింత దగ్గరి దారిలో చేరేందుకు ఇది అనుసంధానంగా ఉపయోగపడుతుందని చెప్పారు. భారతదేశానికి చెందిన సరకులను చటగావ్, మోంగ్లా రేవుల ద్వారా రవాణా చేసేందుకు తీసుకున్న ఈ చర్య చారిత్మాత్మకమైనదని, భారత, బంగ్లాదేశ్ సముద్రయాన సంబంధాల్లో ఇది కొత్త అధ్యాయం కాగలదని మంత్రి మాండవీయ చెప్పారు.
పశ్చిమ త్రిపుర జిల్లాకు వెళ్లాల్సిన టి.ఎం.టి. ఉక్కు కడ్డీలకు సంబంధించిన రెండు 20 అడుగుల కంటెయినర్లు, అస్సాంలోని కరీంగంజ్ కు వెళ్లాల్సిన పప్పు ధాన్యాలకు సంబంధించిన మరో రెండు 20 అడుగుల కంటెయినర్లు ఈ నౌకలో ఉన్నాయి. నౌక చటగావ్ చేరగానే ఈ సరకులను బంగ్లాదేశ్ కు చెందిన ట్రక్కుల ద్వారా అగర్తలాకు చేరుస్తారు.
బంగ్లాదేశ్, ఈశాన్య భారత రాష్ట్రాల మధ్య అనుసంధాన్ని పటిష్టం చేసుకోవాడనికి ఉభయదేశాలు చేసిన కృషిని ఈ ప్రయోగాత్మక నౌకాయానం ప్రస్ఫుటం చేసింది. 2019లో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశాన్ని పర్యటించిన సందర్భంగా,. ఉభయ దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో కుదిరిగిన అవగాహన మేరకు ఈ సరకు రవాణా నౌక ప్రయోగాత్మక సముద్రయానాన్ని ప్రారంభించారు. భారత్, బంగ్లాదేశ్ ల మధ్య సరుకు రవాణా నౌకల రాకపోకలకు బంగ్లాదేశ్ లోని చటగావ్, మోంగ్లా ఓడరేవులను వినియోగించుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులు, విధానాలపై ఆనాడే అంగీకారం కుదిరింది. దీనితో ఉభయదేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుంది.
ఈ కొత్త మార్గంతో భారత్ కోసం సరకు రవాణా దూరం, ప్రయాణ వ్యవధి తగ్గుతుంది. ఈ మార్గం వల్ల ఉభయదేశాలకూ సమాన స్థాయిలో ప్రయోజనాలు కలుగుతాయి. రవాణా, నిర్వహణ, ప్రణాళికా, వాణిజ్య సేవల రంగాల్లో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ సృష్టికిఅవకాశం ఏర్పడుతుంది. ఇది బంగ్లాదేశ్ కు కూడా సానుకూలంగా ఉంటుంది. భారతీయ సరుకుల రవాణాకు బంగ్లాదేశ్ నౌకలను, ట్రక్రులను వినియోగిస్తారు.
ఇటీవల కొన్నేళ్లుగా నౌకాయానం, జలరవాణా రంగాల్లో భారత్, బంగ్లాదేశ్.ల మధ్య సహకారం ఎంతగానో పెరిగింది. ఉభయదేశాల మధ్య కుదిరిన జలరవాణా, వాణిజ్య ఒప్పందం ప్రకారం,..ఇప్పటికే ఉన్న ఆరు పోర్ట్స్ ఆఫ్ కాల్ ఒడంబడికలతోపాటుగా, మరో ఐదింటిని ఇటీవల అదనంగా చేర్చారు. ఉభయదేశాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ లోని ఎంపిక చేసిన జలరవాణా మార్గాల్లో పూడికతీసే పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో 80శాతం ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తుండగా, 20శాతం ఖర్చును బంగ్లాదేశ్ ప్రభుత్వం భరిస్తోంది. పర్యాటక రంగం, ఉభయదేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు పెంపొందించేందుకు ఇరు దేశాల మధ్య క్రూయిజ్ సర్వీసులను కూడా ప్రారంభించారు.
***
(Release ID: 1639108)
Visitor Counter : 257