యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించ‌నున్న కేంద్ర మంత్రి శ్రీ కిర‌ణ్ రిజ్జు

Posted On: 13 JUL 2020 3:23PM by PIB Hyderabad

 

కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు , క్రీడ‌ల శాఖ మంత్రి శ్రీ కిర‌ణ్ రిజ్జు,  2020 జూలై 14,15 తేదీల‌ల‌లో అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రుల‌తో రెండురోజుల స‌మావేశాన్ని వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా నిర్వ‌హించ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో క్రీడ‌ల అభివృద్ధికి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌లు, నెహ్రూ యువ కేంద్ర సంఘ‌ట‌న్ (ఎన్ వై కె ఎస్‌), జాతీయ సేవా ప‌థ‌కం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) కార్య‌క‌లాపాల‌పై  ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.
   ఈ స‌మావేశం ఏర్పాటు చేయ‌డానికి తీసుకున్న నిర్ణ‌యం గురించి మాట్లాడుతూ శ్రీ‌రిజ్జూ, “ దేశం ప్ర‌స్తుతం అన్‌లాక్ రెండ‌వ ద‌శ‌లో ఉంది. క్రీడ‌లు, యువ‌జ‌న సంబంధింత కార్య‌క‌లాపాలను ముందుకు తీసుకువెళ్లే మార్గాన్ని సుగ‌మం చేయ‌డం కోసం రాష్ట్రాల‌తో చ‌ర్చించ‌డం ఎంతో అవ‌స‌రం. లాక్‌డౌన్ స‌మ‌యంలో క్రీడ‌లు, యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ చురుకుగా ప‌నిచేస్తూ రావ‌డ‌మే కాక‌, దేశం నిర్దేశించిన విస్తృత ల‌క్ష్యాల సాధ‌న‌కు  ఎంత‌గానో పాటుప‌డుతూ వ‌చ్చింది. క్షేత్ర స్థాయిలో శిక్ష‌ణ మూత‌ప‌డిన‌ప్ప‌టికీ క్రీడాకారుల‌కు, కోచ్‌ల‌కు అన్ని స్థాయిల‌లో ఆన్‌లైన్ శిక్ష‌ణ ఇప్పించి, వారిని ఆయా క్రీడ‌ల‌కు స‌న్నిహితంగా ఉండేట్టు చేయ‌డం జ‌రిగింది. అలాగే మ‌న నెహ్రూ యువ కేంద్ర సంఘ‌ట‌న్‌లు, ఎన్,ఎస్‌.ఎస్ వ‌లంటీర్లు ఆయా జిల్లా పాల‌నా యంత్రాంగాల‌తో క‌ల‌సి కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా అలుపెరగ‌కుండా ప‌ని చేశారు. 75 ల‌క్ష‌ల మందికి పైగా వ‌లంటీర్లు కోవిడ్ కు సంబంధించి ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ,భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, ఆరోగ్య ప‌ర‌మైన  మార్గ‌ద‌ర్శ‌కాలు తెలియ‌జేయ‌డానికి, మాస్కులు పంపిణీ చేయ‌డానికి, వ‌యోధికుల‌కు స‌హాయ‌ప‌డ‌డానికి ఇలా ఎన్నో విష‌యాల‌లో కృషి చేశారు. ఈ కార్య‌క‌లాపాల‌న్నింటి ప్ర‌భావాన్ని అంచ‌నా వేయాల‌ని అనుకుంటున్నాం. అలాగే రాష్ట్రాల‌తో క‌లిసి భ‌విష్య‌త్ మార్గానికి  ప్ర‌ణాళిక‌లు రూపొందించాల్సి ఉంది” అని ఆయ‌న అన్నారు.
ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్న అంశాల‌లో, కోవిడ్ 19 సంద‌ర్భంగా తీసుకున్న చ‌ర్య‌ల‌పై స‌మీక్ష‌తోపాటు , రాష్ట్ర స్థాయిలో క్రీడా కార్య‌క‌లాపాల‌ను తిరిగి ప్రారంభించ‌డం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో జిల్లా , బ్లాకు స్థాయిలో ప్ర‌తిభా పోటీలు నిర్వ‌హించి ఔత్సాహిక క్రీడాకారుల‌ను గుర్తించ‌డం వంటివి ఉన్నాయి. అలాగే దేశ‌వ్యాప్తంగా పాఠ‌శాల‌ల్లొ ఫిట్‌నెస్‌, క్రీడ‌ల‌ను పాఠ్య‌ప్ర‌ణాళిక‌లో భాగంగా చేయ‌డం గురించి కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. ఖేలో ఇండియా ఈవెంట్ నిర్వ‌హించ‌డానికి ప్ర‌ణాళిక‌, యువ‌జ‌న ఉత్స‌వాల‌ను ఈ ఏడాది చివ‌ర‌లో కానీ వ‌చ్చే ఏడాది మొద‌ట్లో కాని నిర్వ‌హించే అంశాన్ని నిర్ణ‌యించ‌నున్నారు.
“  2028 ఒలింపిక్ పోడియంలో అగ్ర‌భాగంలొ ఉండే మొద‌టి ప‌ది దేశాల జాబితాలో ఇండియా కూడా ఒక‌టిగా ఉండాల‌న్న క‌లను సాకారం చేసుకోవాలంటే ,క్రీడ‌ల వాతావ‌ర‌ణాన్ని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేయ‌డం కీల‌కం. ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను మ‌నం ఇప్ప‌టినుంచే ప్రారంభించాలి.  క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌ ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో ఖేలో ఇండియా స్టేట్ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స‌లెన్స్ (కెఐఎస్‌సిఇ)ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికితోడు,  స్థానిక ప్ర‌తిభ‌ను గుర్తించేందుకు  14 ఒలింపిక్ క్రీడ‌ల‌లో , సంప్ర‌దాయ క్రీడ‌ల‌లో శిక్ష‌ణ ఇచ్చేందుకు 1000 ఖేలో ఇండియా సెంట‌ర్ల(కెఐసి)ను  జిల్లాస్థాయిలొ ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది. కె.ఐ.ఎస్‌.సి.ఇ.లు, కె.ఐ.సిలు ఇండియాలో  క్షేత్ర‌స్థాయిలో క్రీడావాతావ‌ర‌ణాన్ని పెద్ద ఎత్తున  బ‌లోపేతం చేయ‌నున్నాయి.రాష్ట్రాలు ఈ విష‌యంలో కీల‌క పాత్ర వ‌హించాల్సి ఉంది. ప్ర‌భుత్వం రూపొందించిన‌ ఒక రాష్ట్రం, ఒక క్రీడా విధానం గురించి చ‌ర్చించి దీనిని వీలైనంత త్వ‌రగా అమ‌లు చేయాల్సి ఉంది. అన్ని రాష్ట్రాలతో ఆలోచ‌న‌లు పంచుకోవ‌డం ద్వారా దేశాన్ని క్రీడ‌ల సూప‌ర్ ప‌వ‌ర్‌గా తీర్చిదిద్దేందుకు  ఒక స‌మ‌ష్టి రోడ్‌మాప్‌ను రూపొందించ‌డానికి వీలు క‌ల‌గ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నాం” అని కిర‌ణ్ రిజ్జు అన్నారు.
 రెండు రోజుల పాటు జ‌రిగే ఈ స‌మావేశంలో వివిధ అంశాల‌ను స‌మ‌గ్రంగా ప్ర‌తి రాష్ట్రం చ‌ర్చించ‌డానికి త‌గిన స‌మ‌యం ఇచ్చే విధంగా రాష్ట్రాల‌ను రెండు గ్రూపుల‌గా విభ‌జించారు.

 

***


(Release ID: 1638397) Visitor Counter : 245