ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ధన్వంతరీ రథం: అహమ్మదాబాద్ లో గుమ్మం దగ్గరికే కోవిడ్ సంబంధం లేని ఆరోగ్య సేవలు

Posted On: 04 JUL 2020 2:07PM by PIB Hyderabad

ఒకవైపు కోవిడ్ సంక్షోభం కొనసాగుతుండగా దీనికి సంబంధించిన వైద్య సేవలకు అత్యంత ప్రధాన్యం ఇస్తూ వచ్చారు, అయితే అదే సమయంలో ఇతర ముఖ్యమైన వైద్య సేవలకు సైతం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాధాన్యం ఇస్తూనే వచ్చారు. ఈ విషయంలో అహమ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం తన ధన్వంతరీ రథం తో ఒక ప్రత్యేకత చాటుకుంటూ ఆదర్శంగా నిలిచింది. కోవిడ్ కాని ఇతర ముఖ్యమైన వైద్య సేవలు అందించటానికి ఏర్పాటు చేసుకున్న సంచార వైద్యశాల పేరే ధన్వంతరీ రథం.  ఆ విధంగా ఈ వైద్య సేవలను నగరప్రజల గుమ్మానికే తీసుకెళ్లగలిగింది. నగరంలోని అనేక పెద్ద పెద్ద ఆస్పత్రులన్నీ కోవిడ్ చికిత్సలో నిమగ్నమై ఉండటంతో  మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులలాంటి ఇతర వైద్య పరమైన అత్యవసరాలను తీర్చటానికి ఈ సంచార వైద్యశాల బాగా ఉపయోగపడింది. చాలా ఆస్పత్ర్రులు ఔట్ పేషెంట్ వార్డులను నిర్వహించకపోవటం వలన ఆస్పత్రులకు రాలేని వాళ్లకు కూడా ఇవి ఒక వరంలా మారాయి.

అహమ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ వినూత్న విధానంలో ధన్వంతరీ రథంలో అనేక సౌకర్యాలున్నాయి. ఈ ఒక్కో సంచార వైద్య శాలలో ఒక ఆయుష్ డాక్టర్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, అర్బన్ హెల్ట్ సెంటర్ కి చెందిన ఒక స్థానిక డాక్టర్ ఉంటారు. ఈ ధన్వంతరీ రథాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కోవిడ్ కాని ఇతర వ్యాధులవారందరికీ చికిత్స అందజేస్తుంది. క్షేత్రస్థాయిలో అక్కడికక్కడే వైద్య సలహాలు ఇవ్వటం ద్వారా అహమ్మదాబాద్ నగరంలో ప్రజలందరికీ వైద్య సేవల కొరత రాకుండా చూసుకోగలిగింది. ఈ సంచార వాహనాలలో ఆయుర్వేద, హోమియోపతి మందులు, విటమిన్ సప్లిమెంట్స్ సహా అత్యవసరమైన మందులు, పల్స్ ఆక్సీమీటర్ సహా ప్రాథమికమైన పరీక్షా పరికరాలు ఉంటాయి. ఆరోగ్య సేవలతోబాటు రకరకాల కారణాల వలన ఆస్పత్రుల దాకా వెళ్లలేని వారికి కూడా ఈ ధన్వంతరీ రథం పరీక్షలు చేసి వారికి అదనంగా అవసరమయ్యే చికిత్స చేయటం, మరీ ముఖ్యమైన సందర్భాలలో వెంటనే ఆస్పత్రులకు తరలించటం సాధ్యమైంది.

నగరం అంతటా మొత్తం 120 ధన్వంతరీ రథాలు ఏర్పాటయ్యాయి. ఈ రథాలు ఇప్పటిదాకా 4.27 లక్షలమందిని చూడటంలో విజయం సాధించాయి. మొత్తంగా 20,143 మంది జ్వరం బాధితులను, 74,048 మంది దగ్గు, జలుబుతో బాధపడేవారిని, 462 మంది తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధులున్నవారిని చికిత్స కోసం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సిఫార్సు చేశాయి. మరో 826మందిలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాల రోగాలను గుర్తించి వారిని కూడా దగ్గర్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు చికిత్సకు తరలించింది. ధన్వంతరీ రథాల ఏర్పాటు వలన కోవిడ్ చికిత్సకు సైతం మేలు జరిగింది. లక్షణాలు దాగి ఉన్న కేసులను కూడా సకాలంలో గుర్తించగలిగారు.

2020 జూన్ 15 నుంచి ఈ సంచార వైద్యశాలల పరిధిని మలేరియా, డెంగ్యు పరీక్షలకు సైతం విస్తరించారు. రుతుపవనాలు మొదలవుతున్న ఈ సమయంలో ఇలాంటి వ్యాధులు పెద్ద ఎత్తున వ్యాపించే ప్రమాదాన్ని గుర్తించి అహమ్మదాబాద్ నగరపాలక సంస్థ ఈ ముందు జాగ్రత్త తీసుకుంది.

***********(Release ID: 1636475) Visitor Counter : 259