పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

న్యూ ఢిల్లీ లోని కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కార్యాలయంలో ఒక వినూత్న పట్టణ అటవీ కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరిగింది


పట్టణ అడవులు నగరాలకు ఊపిరితిత్తులుగా, ఆక్సిజన్ బ్యాంకులుగా, కార్బన్ సింకులుగా పనిచేస్తాయి : శ్రీ ప్రకాష్ జావడేకర్

Posted On: 02 JUL 2020 2:26PM by PIB Hyderabad

గత కొన్ని సంవత్సరాలుగా, ఢిల్లీ లో తగ్గుతున్న గాలి నాణ్యతా సూచిక (ఏ.క్యూ.ఐ) ఆందోళనకు కారణమౌతుంది.   దీనికి తోడు, న్యూఢిల్లీలో ఐ.టి.ఓ. క్రాసింగ్ ముఖ్యంగా అధిక వాయు కాలుష్య స్థాయిలను నమోదు చేసింది.  ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా మరియు దాని సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, బహదూర్ షా జాఫర్ మార్గ్ వద్ద ఉన్న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం, తన ఆఫీస్ పార్కులో పట్టణ అటవీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అందుబాటులో ఉన్న పరిమిత ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని, వీలైనంత దట్టమైన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి స్థానికంగా లభ్యమయ్యే సామాగ్రిని ఉపయోగించడం జరిగింది.  ఈ అటవీ ప్రాంతాన్ని స్థానికంగా పెరిగే చెట్లతో అభివృద్ధి చేశారు. మూడు పొరలు, బహుళ-పొరలుగా ఈ ప్రాంతం అభివృద్ధిని రూపొందించారు. ఒక-లేయర్ లో ఉండే పచ్చిక బయళ్ళ ఉపరితల వైశాల్యానికి 30 రెట్లు ఎక్కువగా ఉండే ఈ చెట్లకు ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించే సామర్థ్యం 30 రెట్లు ఎక్కువగా ఉంటుంది, మరియు పర్యావరణ పరిరక్షణ కూడా ఎక్కువగా ఉంటుంది.

 

 

పట్టణ అటవీ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసినందుకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ సంతోషం వ్యక్తం చేశారు. మరో సంవత్సరంలో 59 దేశీయ జాతులకు చెందిన 12,000 మొక్కలతో సహా అనేక చెట్ల పొరలతో కూడిన దట్టమైన పట్టణ అడవిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. 

పట్టణ అడవుల ప్రాముఖ్యత గురించి శ్రీ జవదేకర్ పేర్కొంటూఅవి నగరాలకు ఊపిరితిత్తులుగా, ఆక్సిజన్ బ్యాంకులుగా, కార్బన్ సింకులుగా పనిచేస్తాయని చెప్పారు.  ఈ అటవీ ప్రాంతాన్ని మియావాకి పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నందుకు పర్యావరణ మంత్రి ప్రశంసించారు. ఇది స్థానిక ఉష్ణోగ్రతను 14 డిగ్రీల వరకు తగ్గించడానికీ, గాలిలో తేమను 40 శాతం కంటే ఎక్కువ పెంచడానికీ సహాయపడుతుందని చెప్పారు.

నీరు పెట్టడం, కలుపు తీయుటతో సహా కనీస నిర్వహణతో, ఈ పట్టణ అటవీ ప్రాంతం 2021 అక్టోబరు నాటికి స్వయం సమృద్ధిగా ఉంటుంది.  ఈ పట్టణ అటవీ ప్రాంతం, పక్షులు, తేనెటీగలు, సీతాకోకచిలుకలతో పాటు అనేక సూక్ష్మ జంతుజాలానికి తగిన నివాసాలను పునరుద్ధరించే సామర్థ్యాన్ని కలిగిన పర్యావరణ వ్యవస్థగా రూపొందుతుంది.  పంటలు, పండ్ల పరాగసంపర్కానికీ, సమతుల  పర్యావరణ వ్యవస్థను నిర్వహించడానికీ, ఇవి చాలా  అవసరం.

ఒక ఎకరం కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఈ ప్రాంతంలో, దట్టమైన అటవీ పర్యావరణ వ్యవస్థ సృష్టించబడింది.  అనేక పొరలుగా అభివృద్ధి చేస్తున్న ఈ అటవీ ప్రాంతంలో, పొదలు, చిన్న చిన్న మొక్కల నుండి మధ్య తరహా చెట్లుపొడవైన చెట్లను  పరిధీయ మరియు కోర్ మొక్కలు వివిధ సమూహాలుగా జాగ్రత్తగా అమర్చడం జరిగింది.

ఈ పట్టణ అటవీ ప్రాంతంలో నాటిన అరుదైన స్థానిక జాతులలో - అనోజిసస్ పెండ్యులా (ధోంక్), డియోస్పైరోస్ కార్డిఫోలియా (బిస్టెండు), ఎహ్రేటియా లేవిస్ (చామ్రోడ్), రిగ్టియా టింక్టోరియా (దూధి), మిత్రాజినా పార్విఫోలియా (కైమ్), బుటియా మోనోస్పెర్మా (పలాష్), ప్రోసోపిస్ సినేరారియా (ఖేజ్రీ), క్లెరోడెండ్రం ఫ్లోమిడిస్ (ఆర్ని), గ్రెవియా ఆసియాటికా (ఫల్సా), ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్ (ఖాజూర్) మరియు హెలిక్టెరెస్ ఐసోరా (మరోద్ఫాలి) మొదలైనవి ఉన్నాయి.  ఢిల్లీ యొక్క సంభావ్య సహజ వృక్షసంపదలో భాగంగా, ఈ ప్రాంతం యొక్క భూభాగం, వాతావరణం మరియు నేలలకు బాగా సరిపోయే జాతులను ఇక్కడ పెంచడం కోసం ఎంచుకోవడం జరిగింది.

కోల్పోయిన పర్యావరణ పరిరక్షణ అడవులను తిరిగి పునరుద్ధరించడానికి ఈ పట్టణ అటవీ కార్యక్రమం ఒక చర్య-ఆధారిత సందేశాన్ని పంపుతుంది.  సంభావ్య సహజ వృక్షసంపద యొక్క లోతైన క్షేత్ర సర్వేలు, చక్కటి ప్రణాళికాబద్ధమైన స్థానిక జాతుల ప్రచారం మరియు పునరుద్ధరణకు ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టడం, ప్రస్తుత సమయంలో చాలా అవసరం. మంచి పర్యావరణ సమతుల్యతతో, ముఖ్యంగా నగరాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి, సి.ఏ.జి. కార్యాలయం చేపట్టిన ఈ తరహా కార్యక్రమాలు, మాకు ఎంతో స్ఫూర్తి నిచ్చి, సహాయపడతాయని, కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  ఢిల్లీలో పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి ఇది ఒక చిన్నదైనా, చాలా ముఖ్యమైన సహకారం, ఇది తమ సహజ పరిసరాలను తిరిగి పెంపొందించడానికి, పునరుద్ధరించడానికి ప్రజలను ప్రేరేపిస్తుంది.

అటవీ శాఖ, మునిసిపల్ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, స్థానిక ప్రజల మధ్య భాగస్వామ్యం మరియు సహకారంపై నూతన దృష్టితో వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 200 పట్టణ అడవులను అభివృద్ధి చేయడానికి నగర వనాలు పథకాన్ని అమలు చేస్తున్నట్లు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవడం సముచితంగా ఉంటుంది. 

 

*****



(Release ID: 1635999) Visitor Counter : 509