ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ - 19 కేసుల చికిత్సకు సంబంధించి తాజా వైద్య నియమాలు జారీచేసిన కేంద్ర ఆరోగ్య శాఖ


ఒకమోస్తరు నుంచి తీవ్రమైన కేసులకు ప్రత్యామ్నాయ మందుల సూచన

Posted On: 27 JUN 2020 1:41PM by PIB Hyderabad

 

ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న పరిజ్ఞానపు వేగాన్ని అందుకుంటూ సమర్థమైన మందులవాడకాన్ని సూచిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్ కేసుల చికిత్సకు తాజా చికిత్సావిధానాన్ని ప్రకటించింది. ఈ తాజా వైద్యంలో భాగంగా మెథైల్ ప్రెడ్నిసొలోన్ స్థానంలో డెక్సామెథాసోన్ ను ప్రత్యామ్నాయంగా వాడవలసిందిగా సూచించింది. మందులవాడకం ద్వారా వచ్చిన ఆధారాలను, నిపుణుల సూచనలను దృష్టిలో ఉంచుకొని ఒక మోస్తరు నుంచి తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నవారికి ఈ చికిత్స చేయాలని సూచించింది.

 

వ్యాధినిరోధకత తగ్గినప్పుడు వాడటానికి ఉపయోగపడే డెక్సామెథాసోన్ మందు కోవిడ్ బాధితులకు కూడా పనికొస్తుందని తెలియటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రిలొ చేరిన కోవిడ్ బాధితులమీద ఈ మందును ప్రయోగించినప్పుడు సత్వరం కోలుకున్నట్టు నిర్థారణ కావటంతో దాని ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాధి తీవ్ర ఎక్కువగా ఉన్నవారిలో మరణాల రేటును బాగా తగ్గించగలిగినట్టు, వెంటిలేటర్ల మీద ఉన్నవారిలో మూడోవంతు మందికి సత్ఫలితాలు ఇచ్చినట్టు గుర్తించారు. అదే విధంగా ఆక్సిజెన్ థెరపీలో ఉన్నవారిలొ ఐదోవంతు మంది కూడా దీనివల్ల కోలుకున్నారు. ఈ మందు జాతీయ అత్యవసర మందుల జాబితాలో ఉండటం వలన సులభంగా అందుబాటులో ఉన్నట్టు కూడా మంత్రిత్వశాఖ తెలియజేసింది.

 

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సిదాన్ ఈ తాజా చికిత్సా నియమావళిని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపుతూ వీటి వాడకం, అందుబాటు తదితర విషయాలలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. సంస్థాగతంగా కూడా డెక్సామెథాసోన్ వాడాలని కోరారు. ఈ మార్గదర్శక నియమావళిని మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఈ చిరునామాలో చూడవచ్చునని తెలిపారు.

 

https://www.mohfw.gov.in/pdf/ClinicalManagementProtocolforCOVID19dated27062020.pdf

 

చికిత్సాపరమైన ప్రొటోకాల్ ఆఖరిసారిగా జూన్ 13న అప్ డేట్ చేశారు.

 

****

 


(Release ID: 1634756) Visitor Counter : 237