ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తాజా సమాచారం


ప్రజల భాగస్వామ్యం, డిజిటల్ వినియోగంతో కోవిడ్ తో తలపడిన ఒడిశా

Posted On: 23 JUN 2020 4:25PM by PIB Hyderabad

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి ఉమ్మడిగా కోవిడ్ 19 మీద యుద్ధం సాగించింది. అనేక రాష్ట్రాలు కేంద్రం అందించిన మార్గదర్శకాలు, విధి విధానాలు పాటిస్తూ వాటికి అనుగుణంగా తమకు తాముగా కొన్ని వ్యూహాలు రూపొందించుకొని అమలు చేశాయి. అలాంటి రాష్ట్రాల్లో ఒకటి అయిన ఒడిశా,  ఐటి ని సమర్థంగా వాడుకుంటూ స్థానిక సర్పంచ్ లను బలోపేతం చేస్తూ ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ ఆరోగ్య రంగంలో నైపుణ్యం పెంచుకుంది. ఆ విధంగా కోవిడ్ ప్రమాదం పొంచి ఉన్నవాళ్లను కాపాడగలిగింది. దీనివలన తక్కువ కేసులు, తక్కువ మరణాలు నమోదయ్యాయి. ఒడిశా తీసుకున్న చర్యలలో కొన్ని: 


సచేతక్ యాప్ ద్వారా వృద్ధులు, దీర్ఘకాల రోగులకు అండ

భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ( బిఎంసి) ; సచేతక్’ అనే ఒక యాప్ తయారుచేసింది. దీని సాయంతో వృద్ధులు, దీర్ఘకాల రోగులను ఓ కంట కనిపెట్టటం సాధ్యమైంది. వారి రక్షణకు గాను ఆ కుటుంబం నుంచి ఒకరిని రిజిస్టర్ చేయించింది. ఒకవేళ వృద్ధులు ఒంటరిగా ఉంటున్న సందర్భంలో వార్డు స్థాయి సచేతక్ కమిటీ సభ్యుణ్ణి రక్షణదారుగా నియమించింది. వ్యాధి సొకే అవకాశమున్నవారిని గమనిస్తూ ఉండే బాధ్యత వాళ్లకు అప్పగించి తగిన శిక్షణ ఇచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు కోవిడ్ రక్షణ, డాక్టర్ల సంప్రదింపు, కోవిడ్ క్వారంటైన్, పాజిటివ్ కేసుల మీద తాజా సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఈ యాప్ లోని సమాచారం ఆధారంగా స్థానిక సంస్థలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే అవకాశమేర్పడింది. 


సమర్థవంతమైన పర్యవేక్షణకు సర్పంచ్ లు

జిల్లా కలెక్టర్ల కుండే అధికారాలను గ్రామ సర్పంచ్ లు వాళ్ళ పరిధిలో ఉపయోగించుకునేలా బదలాయింపు చేసింది. దీనివలన డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ (2005), ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (1897) తోబాటు ఒడిశా కోవిడ్-19 నియమావళి (2020) కిందస్ వారికి అధికారాలు సంక్రమించాయి.  దీనివలన  14 రోజుల క్వారంటైన్ నిబంధనలు పటిష్ఠంగా అమలుచేసే అవకాశం సర్పంచ్ లకు లభించింది. ముఖ్యంగా ఊళ్లకు తిరిగి వచ్చిన వలస కార్మికుల విషయంలో చర్యలు తీసుకోగలిగారు.


టెలిమెడిసిన్ సేవల అందుబాటు

104 కు అదనంగా ఉచిత టెలిమెడిసిన్ హెల్ప్ లైన్ సర్వీస్ 14410 ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్  వ్యవస్థ ద్వారా వైద్య సూచనలు చేయటం, కోవిడ్-19 సంబంధిత వనరుల గురించి చెప్పటం సాధ్యమైంది. ఇందుకోసం 300 మంది వైద్య నిపుణుల సేవలు వాడుకున్నారు.  దీనివలన ప్రజలలో అనవసరమైన భయాలు పోగొట్టగలిగారు. 


వైద్య నిపుణుల సామర్థ్యం పెంపు

కోవిడ్-19 బాధితులకు వైద్య సేవలు అందించటానికి వీలుగా ఒడిశా ప్రభుత్వం లక్షా 72 వేలమంది ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. సరికొత్త ఆలోచనకు ప్రాణంపోస్తూ, గంజాం జిల్లా అధికారులు వేలాది మంది వలస కార్మికులకు క్వారంటైన్ కేంద్రాల్లోనే శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాలలో ఆరోగ్య కార్యకర్తల్లా పనిచేసేందుకు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు వారి సేవలు వాడుకుంటోంది. ఇదే పద్ధతిని మిగతా జిల్లాలకు కూడా విస్తరింపజేస్తోంది.
 


****



(Release ID: 1633697) Visitor Counter : 204