మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాల పాఠ్యాంశాల్లో యోగా యొక్క ఏకీకరణను ప్రోత్సహించడానికి ఎన్.సి.ఇ.ఆర్.టి. ఆన్‌లైన్ యోగా క్విజ్ పోటీని ప్రారంభించింది
పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు జీవనశైలిని పెంపొందించడానికి ఈ పోటీ సహాయపడుతుంది -శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్'
దేశవ్యాప్తంగా 6 నుండి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు
Posted On:
21 JUN 2020 6:08PM by PIB Hyderabad
జాతీయ విద్యా పరిశోధనా, శిక్షణా మండలి (ఎన్.సి.ఇ.ఆర్.టి) ద్వారా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఆర్.డి) పాఠశాల పాఠ్యాంశాల్లో యోగా యొక్క ఏకీకరణను ప్రోత్సహించడానికి బహుముఖ కార్యక్రమాలను చేపట్టింది. ఆరోగ్యకరమైన జీవనం కోసం యోగా అనే అంశంపై ప్రాధమికోన్నత స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు ఎన్.సి.ఇ.ఆర్.టి. పాఠ్యాంశాలను అభివృద్ధి చేసింది. 2016 నుండి యోగా ఒలింపియాడ్‌ను కూడా నిర్వహిస్తోంది. కోవిడ్-19 పరిస్థితిల్లో, పాఠశాల విద్య యొక్క వివిధ దశల కోసం అభివృద్ధి చేసిన ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ ఆధారంగా శారీరక వ్యాయామాలతో పాటు యోగా అభ్యాసాలు చేయడానికి పిల్లలను వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఇంటి వద్దే మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా, ఈ సంవత్సరం యోగా ఒలింపియాడ్ నిర్వహించడం కష్టం. విద్యార్థులు ఇంట్లో నేర్చుకోవటానికి మరియు సురక్షితంగా ఉండటానికి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' సోషల్ మీడియా ద్వారా ఎన్.సి.ఇ.ఆర్.టి నిర్వహించిన ఆన్ లైన్ యోగా క్విజ్ పోటీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించడం, వివిధ యోగ పద్ధతులపై ప్రామాణికమైన వనరుల నుండి సమగ్ర సమాచారాన్ని పొందటానికి వీలుగా పిల్లలను ప్రోత్సహించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. లోతైన అవగాహనను పెంపొందించడం మరియు ఒకరి జీవితంలో మరియు జీవనంలో ఈ పద్ధతుల యొక్క అవగాహనను వర్తింపజేయడానికి పిల్లలను ప్రేరేపించడం ఈ పోటీ లక్ష్యమని మంత్రి చెప్పారు. పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు జీవనశైలిని పెంపొందించడానికి ఈ పోటీ దోహదపడుతుందనీ, తద్వారా, భావోద్వేగాలను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనీ ఆయన పేర్కొన్నారు.
ఎం.సి.ఈ.ఆర్.టి అభివృద్ధి చేసిన పాఠ్యప్రణాళిక ఆధారంగా యమ మరియు నియమ, షట్కర్మ / క్రియ, ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం, బంధ మరియు ముద్రా వంటి యోగ యొక్క వివిధ అంశాలపై యోగ క్విజ్ పోటీ ఉంటుందని శ్రీ పోఖ్రియాల్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చునని కూడా ఆయన తెలియజేశారు. ప్రశ్నలను వాచకం నుండి శ్రవ్య మాధ్యమం లోకి మార్చడం ద్వారా ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు కూడా చురుకుగా పాల్గొనే అవకాశం కల్పిస్తూ చర్యలు తీసుకున్నామని మంత్రి ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ ఆన్‌లైన్ పోటీలో అడిగే ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ తో ఉంటాయి. ఈ ప్రశ్నలు హిందీ మరియు ఆంగ్ల భాషలలో ఉంటాయి. అభ్యర్థులు తమకు ఇష్టమైన భాషను ఎంచుకోవచ్చు. అత్యధిక మార్కులు పొందిన మొదటి వంద మందికి ప్రశంసా పత్రాలు బహుకరిస్తారు.
ఈ పధకం వివరాలు ఇప్పటికే ఎన్.సి.ఇ.ఆర్.టి. వెబ్ సైట్ ( ncert.nic.in ) లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ క్విజ్ లో జూన్ 21వ తేదీ నుండి ఒక నెల రోజుల లోపు పాల్గొనవచ్చు. గడువు 2020 జూలై 20వ తేదీ అర్ధరాత్రి ముగుస్తుంది.
క్విజ్ యొక్క లింక్ క్రింద ఇవ్వబడింది :
ఇంగ్లీష్ క్విజ్ : https://bit.ly/EYQ_NEWS
హిందీ క్విజ్ : https://bit.ly/HYQ_NEWS
*****
(Release ID: 1633250)
Visitor Counter : 212