ఆయుష్

డిజిటల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక‌లు


యోగా ప్రపంచాన్ని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన మానవత్వ‌పూరితంగా మార్చగలదు: ప‌్ర‌ధాన మంత్రి

Posted On: 21 JUN 2020 11:31AM by PIB Hyderabad

ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్ర‌జ‌లు ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కుటుంబ బంధాన్ని బలోపేతం చేయడంలో యోగా పాత్రను నొక్కి చెప్పారు. యోగా అందరినీ దగ్గర చేస్తుంది అన్నారు. పిల్లలు మరియు పెద్దలతో సహా కుటుంబంలోని ప్రతి సభ్యుడిని కుటుంబ బంధంతో ఇది చేరువ చేస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ‘యోగా విత్ ఫ్యామిలీ’ అనే ఇతివృత్తాన్ని ఈ ఏడాది అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వానికి థీమ్‌గా ఎంపిక చేయడానికి కార‌ణ‌మ‌ని తెలిపారు. కోవిడ్‌-19 ప్రధానంగా మానవ శరీరం యొక్క శ్వాస‌కోశ‌ అవయవాలపై దాడి చేస్తుందని, శ్వాస కోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాణాయామాలు సహాయపడతాయని ప్రధాని అన్నారు. "మన ఆరోగ్యం మరియు న‌మ్మ‌కం అనే అంశాల‌ను చక్కగా తీర్చిదిద్దగలిగితే..  ప్రపంచం ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన మానవత్వపు విజయాన్ని ‌చూసే రోజు ఎక్కువ దూరంలో లేదు. ఇది జరగడానికి యోగా క‌చ్చితంగా సహాయపడుతుందన్నారు.


యోగా దినోత్సవం అతిపెద్ద ప్రజారోగ్య ఉద్యమంగా మారింది కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అంత‌ర్జాతీయ యోగా దినోత్సవ సామూహిక సమావేశాలు మంచిది కాదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం.. ప్ర‌జ‌లు వారివారి కుటుంబ సభ్యులతో కలిసి వారి ఇండ్ల‌లోనే యోగా సాధన చేయమని ప్రజలను ప్రోత్సహించింది. ఈ విషయ‌మై ఆయుష్ శాఖ ప్ర‌జ‌లు ఆన్‌లైన్ వేదిక‌గా పాల్గొనడానికి వీలుగా.. సామాజిక మరియు డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంల‌ వినియోగాన్ని పెంచింది. ఈ సందర్భంగా ఆయుష్ శాఖ స‌హాయ మంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం అతిపెద్ద ప్రజారోగ్య ఉద్యమంగా మారిందన్నారు. "ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశం అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని జరుపుకుంటుంది. ప్రజలు యోగా దినోత్స‌వాన్ని సొంతం చేసుకొని త‌మ‌దిగా స్వీకరించారు. దీనిని భారత దేశం సంస్కృతి మరియు సాంప్రదాయ‌పు వేడుకగా స్వీకరించారు" అని మంత్రి అన్నారు. ఈ సంవత్సరం అంత‌ర్జాతీయ యోగా దినోత్సం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో వచ్చింద‌ని.. అందువల్ల ఆయుష్ మంత్రిత్వ శాఖ గత మూడు నెలల ముందు నుంచే వివిధ ఆన్‌లైన్ మరియు హైబ్రిడ్-ఆన్‌లైన్ కార్యక్రమాల ద్వారా ఇంట్లో యోగాసాధన చేసే ధోరణిని ప్రోత్సహించింది. యోగా గురించి ప్ర‌జ‌లు త‌గిన అవ‌గాహ‌న‌ను పెంచుకునేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన “మై లైఫ్ - మై యోగా” వీడియో బ్లాగింగ్ పోటీని మంత్రి ప్రశంసించారు. ఈ ప్రయత్నంలో అనేక ప్రముఖ యోగా సంస్థలు మంత్రిత్వ శాఖతో కలిసి ముందుకు సాగాయి. గ‌డిచిన నెల రోజుల కాలంలో ఇటువంటి కార్యకలాపాల‌ను మ‌రింత పెంచడ‌మైంది. కామన్ యోగా ప్రోటోకాల్‌లో (సీవైపీ) త‌గిన శిక్షణపై అదనపు దృష్టి పెట్టారు.  


వివిధ ఆన్‌లైన్ కార్యక్రమాల ప్రసారం ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ కోటేచా ఈ కార్య‌క్ర‌మానికి వంద‌న స‌మ‌ర్ప‌ణ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌స్తుత స‌రికొత్త దృష్టాంతంలో అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ఆరోగ్య-ల‌బ్ధితో పాటుగా యోగా దినోత్సవం రోజున ఇంటి వ‌ద్ద‌నే యోగా చేయడంపై ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్టుగా తెలిపారు. ఆయుష్ శాఖ తన ఐడీవై కార్యకలాపాలలో “ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా” అనే థీమ్‌ను ప్రోత్సహించడం ద్వారా.. ఈ ధోరణికి త‌గు విధంగా మద్దతు ఇచ్చింద‌న్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ ఆన్‌లైన్ కార్యక్రమాలను ప్రసారం చేసిందని వివ‌రించారు. ప్ర‌జ‌లు యోగా ప్రోటోకాల్‌ను అనుసరించి నేర్చుకొనేందుకు గాను దూరదర్శన్‌తో స‌హా సోషల్ మీడియాలో రోజూ ఉదయం సీవైపీ సెషన్ల‌ను ప్ర‌సారం చేసిన‌ట్లుగా తెలిపారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు మరియు సాంస్కృతిక సంస్థలతో సహా అనేక మంది వ్యక్తులు మరియు సంస్థలు తమ ఉద్యోగులు, సభ్యులు, ఇతర వాటాదారుల ప్రయోజనం కోసం వారి ఇండ్ల‌ నుండే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంలో చేరడానికి స్వీయ క‌ట్టుబడితో ముందుకు వ‌చ్చాయ‌ని కార్యదర్శి తెలిపారు.  ప‌లు సంస్థ‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోదరభావాన్ని పెంపొందించేలా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పాటించేందుకు గాను సిద్ధంగా ఉన్నాయి. 5 మిలియన్ల మంది ప్రజలను లక్ష్యంగా చేసుకుని.. భార‌త‌ ప్ర‌జ‌ల జనాభా డేటాను రూపొందించడానికి ఆయుష్ సంజీవని మొబైల్ యాప్ కృషి చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు. కోవిడ్-19 నివార‌ణ‌కు గాను ఆయుష్ అందిస్తున్న సూచ‌న‌లు, చ‌ర్య‌లు ఎంత వ‌ర‌కు ఉప‌యుక్తంగా ఉన్నాయ‌నే విష‌య‌మై స‌మాచారాన్ని రూప‌క‌ల్ప‌న‌ను ప్ర‌ధానంగా దీని నుంచి ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమం ముగింపులో కామన్ యోగా ప్రోటోకాల్ యొక్క ప్రత్యక్ష ప్రదర్శనను మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా నిపుణులు ప్రదర్శించారు, తరువాత యోగా నిపుణులతో చర్చా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ యొక్క అన్ని ఛానెళ్లలో ప్రసారం చేశారు.


(Release ID: 1633159) Visitor Counter : 221