ప్రధాన మంత్రి కార్యాలయం
బొగ్గు గనుల వాణిజ్య మైనింగ్‌కు వేలం ప్రక్రియను ప్రారంభించిన ప్రధానమంత్రి
బొగ్గు, మైనింగ్ రంగాలలో పోటీ, పెట్టుబడి, పాల్గొనడం, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో పూర్తి బాహాటతకు ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది: ప‌్రధానమంత్రి
బొగ్గురంగంలో సంస్కరణలు తూర్పు , మధ్య భారతం, గిరిజన ప్రాంతాలను అభివృద్ధికి కీలక స్తంభాలుగా మార్చనున్నాయి : ప‌్రధానమంత్రి
బలమైన మైనింగ్, ఖనిజ రంగం లేనిదే స్వావలంబన సాధ్యం కాదు: ప‌్రధానమంత్రి
Posted On:
18 JUN 2020 2:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 41 బొగ్గు బ్లాక్‌ల వాణిజ్య మైనింగ్ కు సంబంధించిన వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద భారత ప్రభుత్వం చేసిన పలు ప్రకటనల్లో భాగంగా దీనిని ప్రారంభించారు. ఫిక్కి సహకారంతో బొగ్గుమంత్రిత్వశాఖ , బొగ్గుగనుల వేలం ప్రక్రియను ప్రారంభించింది.బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి రెండంచెల ఎలక్ట్రానిక్ వేలం ప్రక్రియను అనుసరించనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ , ఇండియా, కోవిడ్ -19 సంక్షోభంనుంచి బయట పడుతుందని, దేశం ఈ సంక్షోభాన్నిఒక అవకాశంగా మార్చుకుంటుందని అన్నారు. ఈ సంక్షోభం ఇండియాకు స్వావలంబన ,అంటే ఆత్మనిర్బర్ సాధించాల్సిన పాఠాన్ని బోధించిందని ప్రధానమంత్రి చెప్పారు. ఆత్మనిర్భర భారత్ అంటే దిగుమతులపై భారం తగ్గించడం, దిగుమతులపై విదేశీ కరెన్సీ ఖర్చుకాకుండా పొదుపు చేయడమని అన్నారు. దీనివల్ల ఇండియా దేశీయంగా వనరులను అభివృద్ది చేసుకోగలుగుతుందని, ఫలితంగా దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అన్నారు. అంటే ప్రస్తుతం మనం పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటున్నసరకుల విషయంలో మనం పెద్ద ఎగుమతిదారుగా ఎదగడమన్నమాట.
దీనిని సాధించడానికి ప్రతి రంగం, ప్రతి ఉత్పత్తి, ప్రతి సర్వీసును దృష్టిలో ఉంచుకుని ఆయా రంగాలలో స్వావలంబన సాధనకు పరిపూర్ణ దృష్టితో పనిచేయడం జరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. ఇవాళ చేపట్టిన కీలక చర్యవల్ల ఇంధన రంగంలో దేశం స్వావలంబన సాధిస్తుందన్నారు. ప్రస్తుత నిర్ణయంతో బొగ్గు మైనింగ్ రంగంలో సంస్కరణలను అమలు చేయడం మాత్రమే కాక, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడానికి ఇది ఆరంభం కానున్నదని చెప్పారు. ఇవాళ మనం వాణిజ్య బొగ్గుగనులకు సంబంధించిన వేలంను ప్రారంభించడం మాత్రమే కాక , బొగ్గు రంగాన్ని దశాబ్దాల లాక్‌డౌన్ నుంచి విముక్తి చేస్తున్నట్టు అయిందని ఆయన చెప్పారు.
భారతదేశం, బొగ్గునిల్వలలో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని, రెండో అతిపెద్ద ఉత్పత్తి దారుగా ఉందని అయితే రెండో అదిపెద్ద బొగ్గుదిగుమతి దారుగా ఉన్నది కూడా మన దేశమేనని ప్రధానమంత్రి అన్నారు.ఇలాంటి పరిస్థితి గత కొన్నిదశాబ్దాలుగా ఉందని, బొగ్గు రంగాన్ని కాప్టివ్, నాన్ కాప్టివ్ గనుల చిక్కుముడిలో పడిపోయేట్టు చేశారన్నారు. ఈ రంగాన్ని పోటీ, పారదర్శకతకు దూరంగా ఉంచడం వల్ల అది ఒక పెద్ద సమస్య గా మారిందని అన్నారు. ఫలితంగా బొగ్గురంగంలో పెట్టుబడులు లేకుండా పోయాయని, దాని సమర్ధత కూడా ప్రశ్నార్థకంగా మారిందని ప్రధాని అన్నారు.
2014లో బొగ్గు లింకేజ్ ని ప్రవేశపెట్టడం జరిగిందని, ఇది బొగ్గు రంగంలో పురోగతికి దారితీసిందని ప్రధానమంత్రి అన్నారు. బొగ్గు, గనుల రంగంలో మరింత పోటీకి వీలు కల్పిస్తూ ఈ రంగాల ద్వారాలు పూర్తిగా తెరవాలన్న కీలక నిర్ణయాన్ని మనదేశం తీసుకుందని ఆయన చెప్పారు. గనులు, ఖనిజ రంగం బలంగా లేనిదే స్వావలంబన సాధ్యం కాదని, ఆర్థిక వ్యవస్థకు ఇవి రెండూ ప్రధాన స్తంభాల వంటివని ఆయన చెప్పారు.
ప్రస్తుత సంస్కరణల తర్వాత , బొగ్గు ఉత్పత్తి, అలాగే మొత్తం బొగ్గు రంగం స్వావలంబన సాధిస్తుందన్నారు. ఇక ఇప్పుడు బొగ్గుకు మార్కెట్ ఓపెన్ అయిందన్నారు. దీనివల్ల ఏ రంగమైనా తమ అవసరాలకు అనుగుణంగా బొగ్గు కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఈ సంస్కరణలు బొగ్గు రంగానికి మాత్రమే కాక ఇతర రంగాలైన స్టీలు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగించనున్నాయని చెప్పారు . ఇది విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు.
ఖనిజరంగంలో సంస్కరణలకు బొగ్గు గనుల రంగంలో సంస్కరణల నుంచి బలం వచ్చిందని, దీనికి కారణం ఇనుము, బాక్సైట్, ఇతర ఖనిజాలు చాలావరకు బొగ్గు నిక్షేపాలకు దగ్గరగా ఉంటాయని ప్రధానమంత్రి చెప్పారు. బొగ్గు వాణిజ్య మైనింగ్ కు సంబంధించి ఈ రోజు ప్రారంభమైన వేలం, పరిశ్రమలోని స్టేక్ హోల్డర్లు, పరిశ్రమల వారందరికీ సానుకూల పరిస్థితులు కల్పించేదే నని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనివల్ల మరింత రాబడి పొందుతాయని, దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి పొందగలుగతారని చెప్పారు. ప్రతి రంగంపై దీని సానుకూల ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు.
పర్యావరణ రక్షణ విషయంలో ఇండియా చిత్తశుద్ది, బొగ్గు రంగంలో సంస్కరణల అమలు కారణంగా బలహీనపడకుండా చూడడం జరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. బొగ్గు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించవచ్చని కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ప్రధాని అన్నారు. కోల్ గ్యాస్‌ను రవాణారంగంలో, వంటగ్యాస్ గా , యూరియా తయారీ, స్టీలు రంగాలలో వాడవచ్చని చెప్పారు. ఇది తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. 2030 నాటికి సుమారు 100మిలియన్ టన్నుల బొగ్గునుంచి గ్యాస్ తయారు చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని ప్రధానమంత్రి తెలిపారు. ఇందుకు నాలుగు ప్రాజెక్టులు గుర్తించారని, ఇందులో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం జరుగుతుందని ప్రధాని చెప్పారు.
బొగ్గురంగంలో తీసుకువచ్చిన సంస్కరణలతో తూర్పు, మధ్య భారతం, మన గిరిజన ప్రాంతాలు, అభివృద్ధికి స్తంభాలు అవుతాయని చెప్పారు. ఈ ప్రాంతాలలో చాలా ఆకాంక్షిత జిల్లాలు ఉన్నాయని ఇవి ఆశించిన అభివృద్ధి, సుసంపన్నతకు నోచుకోని జిల్లాలని చెప్పారు. దేశంలోని 16 ఆకాంక్షిత జిల్లాలలో భారీ బొగ్గు నిల్వలు ఉన్నాయని, అయితే ఈప్రాంత ప్రజలు వీటినుంచి తగిన ఫలితాలు పొందలేక పోయారని చెప్పారు. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లవలసి వస్తున్నదని చెప్పారు.
వాణిజ్య మైనింగ్‌కు సంబంధించి తీసుకున్న చర్యలు తూర్పు, మధ్య భారతానికి ఎంతో ఉపయోగపడతాయని , స్థానిక ప్రజలకు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉపాధి దొరుకుతుందని ప్రధానమంత్రి చెప్పపారు. బొగ్గు వెలికితీత రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, రవాణాకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రధానమంత్రి చెప్పారు.
ఇది కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు.
బొగ్గు రంగంలో సంస్కరణలు, పెట్టుబడి గిరిజనుల జీవితాలను సులభతరం చేయడంలో కీలక పాత్ర వహించనున్నట్టు ప్రధానమంత్రి వివరించారు. బొగ్గు ఉత్పత్తి ద్వారా వచ్చిన అదనపు రాబడిని ఈ ప్రాంతంలో ప్రజా సంక్షేమ పథకాలకు వినియోగించనున్నట్టు తెలిపారు. జిల్లా ఖనిజ నిధి నుంచి రాష్ట్రాలు కూడా సహాయం పొందుతూ ఉంటాయని ఆయన చెప్పారు. ఇందులో ఎక్కువ మొత్తాన్ని పరిసర ప్రాంతాలలో అత్యావశ్యక సదుపాయాల అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న ప్రస్తుత దశలో బొగ్గు వేలం ప్రక్రియ జరుగుతున్నదని ప్రధానమంత్రి చెప్పారు. బొగ్గు వినియోగం, డిమాండ్ తిరిగి వేగంగా కోవిడ్ ముందు స్థాయికి చేరుకుంటున్నదని తెలిపారు. కోవిడ్ -19 ముందు స్థాయికి డిమాండ్ వేగంగా చేరుకుంటున్న రంగాల గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. విద్యుత్ వినియోగం, పెట్రోలు ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్నదన్నారు. ఈ-వే బిల్లులు,టోల్ రాబడి, రైల్వే సరకురవాణా ట్రాఫిక్, డిజిటల్ రీటైల్ లావాదేవీలు పుంజుకుంటున్న వాటిలో ఉన్నాయని అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడడం ప్రారంభమైందని ప్రధానమంత్రి తెలిపారు. ఖరీఫ్ సాగుకింద పంట విస్తీర్ణం, గోధుమల ప్రోక్యూర్‌మెంట్ ఈ ఏడాది పెరిగిందన్నారు. అంటే రైతుల జేబులలోకి మరింత మొత్తం వెళ్లినట్టు అని ఆయన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుని ముందుకు సాగేందుకు సిద్దంగా ఉందని ప్రధానమంత్రి చెప్పారు.
ఇండియా ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కగలదన్న ఆకాంక్షను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. గతంలో ఇంతకంటె పెద్ద సంక్షోభాన్ని దేశం అధిగమించిందని ఆయన చెప్పారు. ఇండియా ఆత్మనిర్భర్ కాగలదన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. భారత దేశ వృద్ధి, విజయం తథ్యమని ఆయన అన్నారు. కొద్ది వారాల క్రితం మన దేశానికి అవసరమైన ఎన్-95 మాస్క్‌లు, కరోనా పరీక్షల కిట్లు పిపిఇలు, వెంటిలేటర్లు వంటి వాటిని దిగుమతుల ద్వారా సమీకరించుకునే వారమని, అయితే ప్రస్తుతం వీటిని మేక్ ఇన్ ఇండియా ద్వారా సమకూర్చుకుంటున్నామని ప్రధానమంత్రి దేశ విజయ పథాన్ని వివరించారు. త్వరలోనే మనం వైద్య ఉత్పత్తులకు సంబంధించి ప్రధాన ఎగుమతిదారుగా మారబోతున్నామన్నారు. ప్రజలు ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని కొనసాగించాలని తద్వారా మనం ఆత్మనిర్భరభారత్ ను సాకారం చేయగలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.
***
(Release ID: 1632381)
Visitor Counter : 380
Read this release in:
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada