ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితిమీద ప్రధాని వ్యాఖ్యల తెలుగు అనువాదం

Posted On: 17 JUN 2020 3:35PM by PIB Hyderabad

మిత్రులారా,


భరతమాత సాహసపుత్రులు గాల్వన్ లోయలో మన మాతృభూమిని రక్షించే క్రమంలో సర్వోన్నత త్యాగం చేశారు


వారి అసమాన త్యాగానికి, దేశ సేవకు నేను వినమ్రంగా నమస్కరిస్తున్నా. నా హృదయ పూర్వక ధన్యవాదాలతో నివాళులర్పిస్తున్నా.


ఈ దుఃఖ సమయంలో ఆ అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా


ఈ రోజు జాతి యావత్తూ  మీతో ఉంది. యావద్దేశపు సానుభూతీ మీ పట్ల ఉంది


మన వీరుల  అత్యున్నత త్యాగం వృధా పోదు.


ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, భారత్ తనదైన ప్రతి అంగుళపు భూభాగాన్నీ, తన ఆత్మగౌరవాన్నీ కాపాడుకొని తీరుతుంది.


సాంస్కృతికంగా భారత్ శాంతి కాముక దేశం. శాంతిని ప్రేమించే దేసంగా మనకొక చరిత్ర ఉంది.


మన సిద్ధాంతం ఎప్పుడూ " లోకాస్సమస్తాః సుఖినో భవంతు"


ఎల్లప్పుడూ మనం యావత్ ప్రపంచ శాంతినీ, సంక్షేమాన్నీ, మానవత్వాన్నీ కోరుకున్నాం


మన పొరుగు దేశాలతో సహకార, స్నేహ సంబంధాలకోసమే ఎప్పుడూ కృషి చేశాం. వాళ్ళ అభివృద్ధినీ, సంక్షేమాన్నే కోరుకున్నాం


అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ఆ భేదాభిప్రాయాలు వివాదంగా మారకుండా ఉండటానికే ప్రయత్నించాం


మనం ఎవరినీ రెచ్చగొట్టం. అదే సమయంలో మన సమగ్రత, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడలేదు. అవసరమైనప్పుడు మన శక్తిని చాటుకున్నాం. మన సమగ్రత, సార్వభౌమాధికారం కాపాడుకునేందుకు మన సామర్థ్యం చూపించాం.

త్యాగాలు, ఓర్పు మన జాతీయ లక్షణంలో భాగాలు. అదే సమయంలో మన సాహసం, వీరత్వం కూడా అందులో సమాన భాగాలే


మన సైనికుల త్యాగాలు వృధాపోవని ఈ సందర్భంగా జాతికి హామీ ఇస్తున్నా


భారత సమగ్రత, సార్వభౌమాధికారం మనకు అత్యున్నతం. దీన్ని కాపాడుకోవటానికి ఎవరో అడ్డుపడజాలరు.


ఇందులో  ఎవరికీ ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదు
భారతదేశం శాంతి కోరుకుంటుంది. కానీ రెచ్చగొడితే తగిన బుద్ధి చెబుతుంది.

మన సైనికులు అలాంటి పోరులోనే అమరులు కావటం భారతదేశానికి గర్వకారణం. మీరంతా రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ భరతమాత ముద్దుబిడ్దలకు ఘనంగా నివాళులర్పించాలని కోరుతున్నా



(Release ID: 1632198) Visitor Counter : 311