రైల్వే మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలుగా సేవలకు సిద్ధమైన 5,231 రైలు బోగీలు

వీటిని రాష్ట్రాలకు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేసిన రైల్వే శాఖ
తమ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 60 రైల్వే కోచ్‌లు కావాలని కోరిన తెలంగాణ
షాకూర్‌ బస్తీ ప్రాంతంలో 10 కోచ్‌లు ఉంచాలని కోరిన దిల్లీ

Posted On: 11 JUN 2020 6:16PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో.. కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలుగా సేవలు అందించేందుకు 5,231 రైలు బోగీలుసిద్ధమయ్యాయి. వీటిని తమ ప్రాంతాలకు కేటాయించాలని.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం కొన్ని రాష్ట్రాలు కోరాయి. ఆయా రాష్ట్రాలకు కొవిడ్‌ బోగీలను రైల్వే శాఖ పంపుతోంది.
    
    తమ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌, కాచిగూడ, ఆదిలాబాద్‌ స్టేషన్లకు 60 బోగీలను కేటాయించాలని తెలంగాణ కోరింది. 10 బోగీలను పంపాలని దిల్లీ ప్రభుత్వం అభ్యర్థించింది.

    కొవిడ్‌పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి అనుబంధంగా, రైల్వే శాఖ కూడా సంపూర్ణ ప్రయత్నం చేస్తోంది. కొవిడ్‌ చికిత్సలు అందించేందుకు 5231 బోగీలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చి కేంద్రానికి అందించింది.
    
    తీవ్రత లేని కొవిడ్‌ కేసుల కోసం ఈ బోగీలను ఉపయోగిస్తారు. రాష్ట్రంలో కొవిడ్‌ రోగుల సంరక్షణ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో.., అనుమానితులు, రోగులను ఐసోలేషన్‌లో ఉంచడానికి ఈ బోగీలను రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నీతి ఆయోగ్‌ రూపొందించిన సమీకృత కొవిడ్‌ ప్రణాళికలో ఈ రైల్వే బోగీలు ఒక భాగం.

    215 స్టేషన్లకుగాను, 85 చోట్ల ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఆరోగ్య సిబ్బంది, ఔషధాలను అందించడానికి రాష్ట్రాలు అంగీకరించిన మరో 130 చోట్ల కొవిడ్‌ బోగీలను ఏర్పాటు చేసింది. ఈ బోగీలకు నీరు, ఛార్జింగ్‌ అందించేందుకు 158 స్టేషన్లను, నీటిని అందించేందుకు 58 స్టేషన్లను రైల్వే శాఖ సిద్ధం చేసింది.



(Release ID: 1630953) Visitor Counter : 185