రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కరోనా సవాళ్ల సమయంలోనూ ఉత్పత్తుల విక్రయాల్లో ఆర్‌సీఎఫ్‌ ఘనత

ఈ ఆర్థిక ఏడాదిలో అమ్మకాల ద్వారా రూ.100 కోట్లకు పైబడి ఆదాయం
మార్చి త్రైమాసికంలో మూడు రెట్లు పెరిగిన ఆర్‌సీఎఫ్‌ లాభం
2018-19తో పోలిస్తే, 2019-20లో 49 శాతం పెరిగిన లాభం
సంస్థ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 28.40 శాతం డివిడెండ్‌ ప్రకటన

Posted On: 06 JUN 2020 5:01PM by PIB Hyderabad

ప్రస్తుత కరోనా సమయంలోనూ, రాస్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌) విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే, తన పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకం ద్వారా 100 కోట్ల ఆదాయాన్ని దాటింది.

ముఖ్యమైన ఉత్పత్తులు : 

అమ్మోనియా - శీతలీకరణకు, ఉక్కు నైట్రైడింగ్‌, రాకెట్ల ఇంధనం, ఔషధాలు
అమ్మోనియం నైట్రేట్‌ - బొగ్గు గనుల్లో పేలుడు పదార్థాలు మొ.
అమ్మోనియం బయో కార్పొనేట్‌ - బేకరీ ఉత్పత్పులు, తోళ్ళ శుద్ధి కర్మాగారాల కోసం
మిథైల్ అమైన్స్- పురుగుమందులు, రంగులు, ఔషధాల కోసం
కాన్సంట్రేటెడ్‌ నైట్రిక్ యాసిడ్: పేలుడు పదార్థాలు, ఔషధాల కోసం
పలుచటి నైట్రిక్ యాసిడ్‌ - ఆభరణాలు, ప్రొపెల్లెంట్‌ కోసం
ఆర్గాన్ - వెల్డింగ్ కోసం
ఫార్మిక్‌ యాసిడ్‌ - రబ్బర్‌, తోళ్ల కోసం
డై మిథైల్ ఫార్మామైడ్ - ఫైబర్లు, స్పాండెక్స్, పాలిమైడ్ల కోసం ద్రావకం
డై మిథైల్ అసిటమైడ్ - పాలిస్టర్ ఫిల్మ్, యాక్రిలిక్ ఫైబర్ల కోసం ద్రావకం
సోడియం నైట్రేట్ - ప్రొపెల్లెంట్స్, పేలుడు పదార్థాల కోసం

    2019-20 నాలుగో త్రైమాసికంలో పన్నుల తర్వాత ఆర్‌సీఎఫ్‌ లాభం బాగా వృద్ధి చెందింది. 2018-19 నాలుగో త్రైమాసికం కంటే  190 శాతం ఎక్కువ సాధించింది. మార్చి త్రైమాసికంలో ఆర్‌సీఎఫ్‌ లాభం మూడు రెట్లు పెరిగి, రూ.48.47 నుంచి రూ.142.28 కోట్లకు చేరింది. 193.54 శాతం వృద్ధిని సాధించింది. 2018-19తో పోలిస్తే, 2019-20లో ఆర్‌సీఎఫ్ పన్ను తర్వాత లాభం 49 శాతం పెరిగింది. 2019-20లో పన్ను తర్వాత లాభం రూ.208.15 కోట్లు. అంతకుముందు ఆర్థిక ఏడాది లాభం రూ.139.17 కోట్లు. 

    కార్యకలాపాల నుంచి వచ్చే వార్షికాదాయం ఏటా 9 శాతం పెరుగుతూ, రూ.9698 కోట్లకు చేరింది. ఇది ఆర్‌సీఎఫ్‌ చరిత్రలోనే అత్యధికం. ఆసీఎఫ్‌ బోర్డు 28.40 శాతం డివిడెండ్‌ ప్రకటించింది. ఇది కూడా సంస్థ చరిత్రలో రికార్డే.

    అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే, 2019-20లో మొత్తం ఎరువుల అమ్మకాలు 7 శాతం పెరిగాయని ఆర్‌సీఎఫ్‌ సీఎండీ ఎస్‌.సి.ముడ్గేరికర్‌ వెల్లడించారు. సంస్థ కాంప్లెక్స్‌ ఎరువు "సుఫాలా" అమ్మకాల్లో 15 శాతానికి పైగా వృద్ధి నమోదైందన్నారు. "ఆర్గానిక్‌ గ్రోత్‌ స్టిమ్యులాంట్‌", "వాటర్‌ సొల్యూబుల్‌ సిలికాన్‌ ఫెర్టిలైజర్‌" పేరిట 2019-20లో సంస్థ రెండు కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. రోజుకు 15 మిలియన్‌ లీటర్ల మురికినీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఖాతాలో విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకునేందుకు "స్టేట్ ట్రేడింగ్ ఎంటర్‌ప్రైజ్‌" గుర్తింపును ఆర్‌సీఎఫ్‌ పొందింది. 16 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంది.
 



(Release ID: 1629977) Visitor Counter : 249