వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతులకు తీపికబురు చెబుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

స్వల్పకాలిక వ్యవసాయ రుణాల చెల్లింపు గడువు ఆగస్టు 31 వరకు పెంపు
రుణాలను సరిగా చెల్లించే రైతులకు రుణంలో 3 శాతం ప్రోత్సాహకం

Posted On: 01 JUN 2020 5:42PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, వ్యవసాయ రంగానికి దన్నుగా నిలిచే నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ, అనుబంధ కార్యక్రమాల కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న స్వల్పకాలిక రుణాల చెల్లింపు గడువును ఈ ఏడాది ఆగస్టు 31 వరకు పెంచింది. రూ.3 లక్షల వరకు తీసుకున్న రుణాలకు సంబంధించి ఇప్పటికే బకాయి ఉన్నా; మార్చి 1, 2020 నుంచి ఆగస్టు 31, 2020 మధ్యకాలంలో బకాయిగా మారినా, గడువు పెంపు వెసులుబాటు వర్తిస్తుంది. దీనిపై బ్యాంకులకు 2 శాతం వడ్డీ రాయితీ ‍(ఐఎస్‌), తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించే రైతులకు 3 శాతాన్ని ప్రోత్సాహకంగా (పీఆర్‌ఐ) అందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
 
ప్రయోజనాలు:
    కేంద్ర మంత్రివర్గం నిర్ణయం వల్ల.. బ్యాంకుల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్న వ్యవసాయ రుణాల చెల్లింపు లేదా రెన్యువల్‌కు, ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రైతులకు సమయం దక్కుతుంది. వారు ఈ గడువు కాలంలో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రుణాలను కూడా పావలా వడ్డీతో, ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చు.

    రైతులకు స్వల్పకాలిక రాయితీ రుణాలను బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. బ్యాంకులకు 2 శాతం వడ్డీ రాయితీ, తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించే రైతులకు 3 శాతం అదనపు ప్రోత్సాహకాన్ని ఇస్తోంది. దీంతో రైతులకు రూ.3 లక్షల వరకు రుణాలు కేవలం పావలా వడ్డీకే అందుతున్నాయి.

    దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా, ప్రజల రాకపోకలపై కేంద్రం ఆంక్షలు విధించింది. దీనివల్ల చాలామంది రైతులు, తాము తీసుకున్న స్వల్పకాలిక రుణాలను చెల్లించేందుకు బ్యాంకులకు వెళ్లలేకపోయారు. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం లేక ఆదాయం పొందలేకపోయారు. ఈ కారణంగా బ్యాంకులకు బకాయిలు చెల్లించలేక, రుణాలను రెన్యువల్‌ చేసుకోలేకపోయారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రైతుల వెన్నుతట్టి ప్రోత్సహించేలా కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.



(Release ID: 1628451) Visitor Counter : 207