వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫార్మా పరిశ్రమ, సంఘాల ప్రముఖులతో శ్రీ పీయూష్ గోయల్ సమాలోచనలు

కోవిడ్ సంక్షోభంలో పరిశ్రమ సేవలకు అభినందనలు
భారత్ కు ఇప్పుడు ప్రపంచ ఔషధ నిలయంగా గుర్తింపు
ఆత్మనిర్భర్ భారత్ లో ఫార్మా పరిశ్రమకు కీలకపాత్ర ఉందన్న మంత్రి

Posted On: 31 MAY 2020 5:16PM by PIB Hyderabad

వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు ఫార్మాస్యూటికల్ పరిశ్రమ ప్రముఖులతోను, ఫార్మా సంఘం కార్యవర్గ సభ్యులతోను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో సహాయమంత్రులు శ్రీ హెచ్ ఎస్ పూరి, శ్రీ సోమ్ ప్రకాశ్, వాణిజ్య, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య  విభాగాల కార్యదర్శులు. అధికారులు కూడా పాల్గొన్నారు.  


కోవిడ్ సంక్షోభ సమయంలో సకాలంలో భారత్ సగర్వంగా చెప్పుకునేలా ఫార్మా పరిశ్రమ స్పందించిందని ఈ సమాలోచనల సందర్భంగా శ్రీ గోయల్ అభినందించారు. ప్రపంచానికే ఔషధ నిలయంగా భారత్ గుర్తింపు పొందిందన్నారు. గడిచిన రెండు నెలల్లో 120 కి పైగా దేశాలకు అత్యవసర మైన ఔషధాలు అందించగా అందులో 40 దేశాలకు  ఉచితంగా గ్రాంటు రూపంలో అందించటాన్ని మంత్రి ప్రస్తావించారు.  సంక్షోభ సమయంలో ఈ ఎగుమతులు సకాలంలో చేరేలా విదేశీ వర్తక విభాగం డైరెక్టర్ జనరల్, విదేశాంగ మంత్గ్రిత్వశాఖ, ఆరోగ్య విభాగాలు రేయింబవళ్ళు కృషిచేశాయన్నారు. భారత్ అందించిన ఆపన్న హస్తాన్ని యావత్ ప్రపంచం అభినందించటంతో భారత ప్రతిష్ఠ గణానీయంగా పెరిగిందని మంత్రి గుర్తుచేశారు. స్వదేశీ అవసరాలకు తగినంత హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసెటమాల్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికుందని, అయితే అవసరమున్న అన్ని దేశాలకూ అందుబాటులో ఉండేందుకు, అవాంఛనీయ శక్తులు నిల్వచేసి లాభాలు సొంతం చేసుకునే అవకాశం లేకుండా అడ్డుకోవటానికే వాళ్ళ ఎగుమతులమీద కొన్ని ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు.
అసాధారణమైన పనితీరు కనబరచినందుకు, ఈ సమయంలో ఎలాంటి మందుల కొరతా లేకుండా చూసినందుకు ఫార్మా పరిశ్రమకు మంత్రి నుంచి ప్రశంసలు లభించాయి. తొలినాళ్ళలోనే లాక్ డౌన్ ప్రకటించటం వల్ల కరోనా వ్యాప్తిని తగిన విధంగా అడ్డుకోవటంతోబాటు ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు పెంచుకోవటం, ప్రజలలో అవగాహన పెంచటం, నివారణ చర్యలు చేపట్టటం సాధ్యమైందని శ్రీ పీయుష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సమర్థవంతమైన నాయకత్వం, మార్గదర్శనంలో భారత్ కోవిడ్-19 ను ఎదుర్కోవటంలో కనబరచిన చొరవ ఆదర్శంగా నిలిచిందన్నారు. దాని పర్యవసానాల ప్రభావాన్ని తగ్గించటంలో సంక్షేమ, సహాయక పాకేజీలు కూడా ప్రధాని మార్గదర్శకులయ్యారని మంత్రి అభివర్ణించారు.
ఫార్మా పరిశ్రమ విస్తరణకు, వ్యాప్తికి, బలోపేతం కావటానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని శ్రీ గోయల్ హామీ ఇచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ లో ఫార్మా రంగం  కీలకపాత్ర పోషించవలసి ఉంటుందన్నారు. ఎపిఐ లలో దేశం వీలైనంత త్వరగా ఆత్మనిర్భర్ కావాలని చెబుతూ, ప్రభుత్వం ఈ దిశలో ఎన్నో చర్యలు తీసుకున్నదని గుర్తుచేశారు. బల్క్ డ్రగ్ పార్క్స్ ఏర్పాటుకు ఒక పథకాన్ని ఇప్పటికే ఆమోదించామన్నారు. దీనిద్వారా మూడు బల్క్ డ్రగ్ పార్కుల ఉమ్మడి మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. కీలకమైన ఔషధాల తయారీని ప్రోత్సహించేందుకు అత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకాలు ఇవ్వటానికి పచ్చజెండా ఊపామన్నారు. 
యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియని వేగవంతం చేసినట్టు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ద్వైపాక్షిక ఎఫ్ టి ఎ ల విషయంలో ఏ విధమైన ఆటంకం గాని. అనుచితమైన పోటీ గాని తారసపడితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు యూరప్ లోను, రష్యాలోను ఖాళీగా ఉన్న మార్కెట్ లో ప్రవేశించటానికి ప్రయత్నించాలని సూచించారు. పరిశోధన, అభివృద్ధి రంగంలో సహకార మార్గం ఎంచుకోవాలని పిలుపునిస్తూ విద్యారంగ నిపుణులు, విశ్వవిద్యాలయాలు, ఐసిఎంఆర్, ప్రైవేట్ రంగం చేతులు కలపాలన్నారు. కొన్ని ప్రభుత్వ రంగ ఫార్మాస్యుటికల్స్ వాటాలు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేస్తూ, ఉత్పత్తికి సంసిద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థలను భారత కంపెనీలు వాడుకోవాలని ఆహ్వానించారు. సమావేశంలో ప్రస్తావించిన అన్ని సూచనలనూ ప్రభుత్వం వేగంగా పరిశీలిస్తుందని, అవసరమైతే అంతర్ మంత్రిత్వశాఖల సమాలోచనలు సైతం త్వరగా పూర్తి చేస్తామని మంత్రి ఫార్మా పరిశ్రమకు హామీ ఇచ్చారు.



(Release ID: 1628210) Visitor Counter : 160