ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అత్యధిక కోవిడ్ - 19 కేసుల మున్సిపల్ ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి ముఖాముఖి

కోవిడ్ - 19 నియంత్రణ, నిర్వహణ చర్యల మీద సమీక్ష
కోలుకుంటున్నవారు 41.39 శాతానికి పెరుగుదల

Posted On: 23 MAY 2020 7:50PM by PIB Hyderabad

కోవిడ్-19 కేసులు అత్యధికంగా నమోదైన 11 మునిసిపల్ ప్రాంతాల అధికారులతో ఈరోజు ఆరోగ్యశాఖ కార్యదర్శి  శ్రీమతి ప్రీతి సుడాన్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ప్రత్యేకాధికారి శ్రీ రాజేశ్ భూషణ్ ఈరోజు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి  సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శులు, పట్టణాభివృద్ధి కార్యదర్శులు. మున్సిపల్ కమిషనర్లు, మిషన్ డైరెక్టర్లు ( ఎన్ హెచ్ ఎమ్),  ఆరోగ్య కార్యదర్శులు, 11 మున్సిపల్ ప్రాంతాలకు చెందిన అధికారులతోబాటు గృహ, పట్టణ వ్యవహారాల అదనపు కార్యదర్శి శ్రీ కమ్రాన్ రిజ్వీ  హాజరయ్యారు.

ఈ 11 మున్సిపల్ ప్రాంతాలు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్విమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవి కాగా భారతదేశంలో చురుగ్గా ఉన్న కోవిడ్ కేసుల్లో  70%  ఈ ప్రాంతాలవే కావటం గమనార్హం.

మొత్తం ధ్రువపడిన కేసులు, మరణాల శాతం, ప్రతి పది లక్షలమందిలో పరీక్షలు జరిపించుకున్నవారు, ధ్రువపడినవారిశాతం తదితర అంశాలను తెలియజెబుతూ ఈ సమావేశంలో  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జాతీయ సగటు తో పోల్చుకున్నప్పుడు అతి తక్కువ సమయంలోనే బాధితుల సంఖ్య రెట్టింపు కావటం, మరణాల శాతం ఎక్కువగా ఉండటం ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉందన్న సంగతి చెప్పారు. కంటెయిన్మెంట్ జోన్లను, బఫర్ జోన్లను గుర్తించటంలో అనుసరించాల్సిన అంశాల గురించి, కంటెయిన్మెంట్ జోన్ల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇల్లిల్లూ వెతికి బాధితులను గుర్తించటం, భౌతిక దూరం పాటింపజేయటం, చేతుల పరిశుభ్రత గురించి వారికి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు. గట్టి నిఘా కొనసాగించటం, పాత బస్తీలను, పట్టణ మురికివాడలను, ఇతర జనసమ్మర్ద ప్రాంతాలను పర్యవేక్షించటంతో బాటు వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా పట్టణ ప్రాంతాల్లో  కోవిడ్ - 19 నివారణకు ప్రయత్నించాలని కోరారు.


వైరస్ సోకటానికి ఎక్కువ అవకాశమున్న జనాభాకు నిర్థారణ పరీక్షలు పెంచటం ద్వారా నివారణకు ప్రయత్నించటం మీద ఎక్కువగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. నిర్థారణ అనంతరం చేర్చుకున్నవారిలో మరణాల శాతాన్ని తగ్గించటానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చాలామంది ఈపాటికే రేయింబవళ్ళు నడిచే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారని, మిగిలినవారు కూడా ఆ బాటలో నడవాలని చెప్పారు. ప్రజలకు కోవిడ్ -19 విషయంలో  రకరకాల సహాయాలు చేయటానికే పరిమితం కాకుండా, డాక్టర్ల బృందాలు రేయింబవళ్ళూ వైద్యపరమైన సాయం అందిస్తూ మరణాల శాతం తగ్గించటానికి కృషిచేయాలన్నారు.
కొన్ని మున్సిపల్ ప్రాంతాల్లో కోవిడ్ నిర్థారణ పరీక్షలు బాగా పెంచటం ద్వారా తొలిదశలోనే నిర్థారించే అవకాశాలు మెరుగు పడాల్సి ఉందన్నారు. అప్పుడే సకాలంలో చికిత్స అందటానికి, మరణాల శాతం తగ్గించటానికి వీలు కలుగుతుందని గుర్తు చేశారు. వచ్చే రెండు నెలల కాలానికి సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు రుజువు చేసుకుంటూ ఐసొలేషన్ పడకలు, ఆక్సిజెన్, వెంటిలేటర్లు, ఐసియు పడకల వంటి ఆరోగ్యపరమైన మౌలిక వసతులు పెంచుకోవాలని సూచించారు. శాంపిల్ సేకరణ, పడకల సామర్థ్యం పెంపు, వ్యర్థాల పారవేత, కోవిడ్ పాజిటివ్ కేసుల్ ఇన్ఫెక్షన్ పోగొట్టటం వంటి విషయాలలో ప్రైవేట్ ఆస్పత్రులతో భాగస్వామ్యం మీద దృష్టిపెట్టాలని కూడా కోరారు. వలస కార్మికుల శిబిరాల నిర్వహణ, కోవిడ్ రోగుల పట్ల ఆదరణ, స్థానిక భాషలో అవగాహన కల్పించటం, స్థానిక నాయకులను, యువజన సంఘాలను, స్వచ్ఛంద సంస్థలను, స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేయటం ఎంతో అవసరమని చెప్పారు. దీనిద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించటానికి వీలవుతుందన్నారు.
కోవిడ్ - 19 కేసుల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్లు చేపట్టిన చర్యలు, అమలు చేసిన ఉత్తమ విధానాలను కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్  లో చర్చించారు. ప్రైవేట్ ఆస్పత్రులు, మున్సిపల్ అధికారులమధ్య సహకారం బలోపేతం చేయటం ద్వారా ఐసియు పడకలు, ఆక్సిజెన్ పడకల వంటి ఆరోగ్య మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవటం మీద ముంబై మున్సిపల్ కమిషనర్ వివరించారు.  త్వరలోనే ప్రతి పడకకూ ఒక ప్రత్యేకమైన నెంబర్ కేటాయిస్తూ ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నదీ ఆన్ లైన్ లోనే తెలుసుకోగలిగే  ఏర్పాటుతోబాటు జిపిఎస్ ఆధారిత అంబులెన్స్ ట్రాకింగ్ విధానం అమలు చేయబోతున్నట్టు కూడా చెప్పారు. ఇండోర్ అధికారులు ఇంటింటికీ సర్వే చేయటం ద్వారా రోగి ఎవరెవరిని కలిసిందీ తెలుసుకునే అంశం మీద దృష్టిపెట్టామన్నారు. ఇందుకోసం స్థానిక వాలంటీర్లు,  రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులతో  ’గల్లీ గస్తీ బృందాలు’ ఏర్పాటుచేశారు. ప్రత్యేక నిఘా బృందాలకు సహకరించటంతోబాటు కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారిలో ఆత్మస్థైర్యం పెంచటానికి. నిత్యావసరాలు అందించటానికి వీరు ఎంతగానో ఉపయోగపడ్దారు.

ఇప్పటివరకూ 51,783 మంది బాధితులు కోవిడ్ - 19  నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,250 మంది కోవిడ్ - 19  బాధితులు కోలుకోగా ప్రస్తుతం కోలుకుంటున్నవారి శాతం 41.39%. గా నమోదైంది. ధ్రువపడిన బాధితుల సంఖ్య 1,25,101 కు చేరింది. నిన్నటి నుంచి భారత్ లో  కోవిడ్- 19 బాధితులుగా ధ్రువపడినవారు 6654  మంది.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టొల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడవచ్చు



(Release ID: 1626502) Visitor Counter : 214