ప్రధాన మంత్రి కార్యాలయం

ఆంఫన్ తుపాను బాధిత ఒడిశాలో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే; రూ. 500 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటన

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా: గాయపడినవారికి రూ. 50,000

Posted On: 22 MAY 2020 6:10PM by PIB Hyderabad

ఆంఫన్ తుపాను బీభత్సం నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిశా సందర్శించి అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట కేంద్ర మంత్రి  శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రులు శ్రీ బాబుల్ సుప్రియో, శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి, కుమారి  దేబశ్రీ చౌధురి ఉన్నారు. ఒడిశా గవర్నర్ శ్రీ గణేశ్ లాల్,  ముఖ్యమంత్రి శ్రీ  నవీన్ పట్నాయక్ కూడా వెంటరాగా ప్రధాని ఈ పర్యటనలో భద్రక్, బాలాసోర్ ప్రాంతాలను గగన తలం నుంచి చూసి తుపాను నష్టాన్ని అంచనావేశారు.

ఈ ఏరియల్ సర్వే అనంతరం ప్రధాని అధ్యక్షతన భువనేశ్వర్ లో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు, బాధ్యులు పాల్గొన్నారు. అంతర్ మంత్రిత్వశాఖల కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేయాల్సి ఉండగా ఈలోపే ప్రధానమంత్రి ఒడిశా రాష్ట్రానికి  రూ. 500 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో భుజం భుజం కలిపి పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.  తుపాను వల్ల దెబ్బతిన్న  ప్రాంతాల్లో మౌలిక వసతుల పునర్నిర్మాణానికి, యథాపూర్వ స్థితికి రావటానికి అవసరమైన అన్ని రకాల సాయమూ అందిస్తామని కూడా ప్రకటించారు. 


ఒడిశా ప్రజలకు ప్రధాని తన సంఘీభావం ప్రకటిస్తూ,  ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తుపాను మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, తీవ్రంగా గాయపడినవారికి రూ. 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.



(Release ID: 1626258) Visitor Counter : 185