సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌కు ఆర్థిక వెసులుబాటు ముఖ్యం- శ్రీ‌నితిన్ గ‌డ్క‌రి

దేశంలో ఆటోమెబైల్ త‌యారీ రంగానికి మ‌రింత ఊపునివ్వ‌నున్న వాహ‌నాల స్క్రాపేజ్‌ విధానం- శ్రీ‌గ‌డ్క‌రి

Posted On: 21 MAY 2020 6:01PM by PIB Hyderabad

 

ఉన్న‌త విద్యాసంస్థ‌ల‌కు ఆర్థిక వెసులు బాటు అత్యంత కీల‌కమైన‌ద‌ని కేంద్ర ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రి అన్నారు.ఈ సంస్థ‌లు నాణ్య‌తలో ఏమాత్రం రాజీప‌డ‌కుండా  త‌మ నిర్వ‌హ‌ణా ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

   ఉన్న‌త విద్యారంగ భ‌విష్య‌త్‌పై,  ఎంఐటి ఎడిటి విశ్వ‌విద్యాల‌య ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన‌ స‌మావేశంలో ఆయ‌న  వీడియో కాన్ఫ‌రెన్స్‌ద్వారా  ప్ర‌సంగించారు.

   విశ్వ‌విద్యాల‌యాల స్థాయి పెంపు అవ‌స‌ర‌మ‌ని, విలువ‌ల‌తో కూడిన విద్య స‌మాజానికి బ‌లం చేకూరుస్తుంద‌ని ఆయ‌న  అన్నారు. మ‌న దేశ యువ‌త ,వారి బ‌లాలు , బ‌ల‌హీన‌త‌ల‌ను అవ‌గాహ‌న చేసుకోవాల‌ని, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అవ‌కాశాలుగా మ‌ల‌చుకోవాల‌ని అన్నారు. ప్ర‌స్తుత ద‌శ‌లో యువ‌త సామ‌ర్ధ్యాల‌పెంపు దేశానికి కీల‌క‌మైన‌ద‌ని ఆయ‌న  చెప్పారు.

  ప్ర‌స్తుతం స‌వాలుగా నిలిచిన‌ ద‌శ‌ను అధిగ‌మించ‌డానికి ,  ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు సానుకూల‌ దృక్ఫ‌థం, ఆత్మ విశ్వాసం క‌లిగి ఉండాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వివిధ భాగ‌స్వామ్య ప‌క్షాల మ‌ధ్య స‌మ‌ర్ధ‌మైన స‌మ‌న్వ‌యం, టీమ్ స్పిరిట్‌ , స‌మీకృత విధానం అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు.

 ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌షిప్‌, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ప‌రిశోధ‌న నైపుణ్యాలు, జ్ఞానాన్ని సంప‌దగా మార్చ‌డం వంటి విష‌యాల‌పై మ‌రింత దృష్టి పెట్టాల‌న్నారు.

 చైనా నుంచి  జ‌పాన్ పెట్టుబ‌డుల‌ను  త‌ర‌లించి  ఇత‌ర దేశాల‌లో పెట్టేందుకు జ‌పాన్ ప్ర‌భుత్వం త‌మ దేశ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌త్యేక ప్యాకేజ్‌ని ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇది ఇండియాకు ఒక అవ‌కాశ‌మ‌ని దీనిని ఉప‌యోగించుకోవాల‌ని అన్నారు.

ప‌రిశ్ర‌మ‌ల వికేంద్రీక‌ర‌ణ ను ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటూ  ఆయ‌న‌, దేశంలోని గ్రామీణ ప్రాంతాలు, గిరిజ‌న‌, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌పై దృష్టిపెట్టాలని చెప్పారు. ఆగ్రో ఎం.ఎస్‌.ఎం.ఇ రంగంలో అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉందని ఆయ‌న తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం వెహిక‌ల్ స్క్రాపేజ్ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టే అంశాన్ని ప‌రిశీలిస్తోంద‌ని,పోర్టుల స‌మీపంలో రీసైక్లింగ్ క్ల‌స్ట‌ర్లు ప్రారంభించ‌వ‌చ్చ‌ని చెప్పారు. ఇది దేశంలో ఆటోమొబైల్ త‌యారీ ప‌రిశ్ర‌మ పుంజుకునేలా చేస్తుంద‌ని అన్నారు.
ఈ స‌మావేశంలో పాల్గొన్న ప‌లువురు , ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌పైన‌, నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో మార్గ‌నిర్దేశం గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు.



(Release ID: 1625874) Visitor Counter : 191