శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 నిర్థారణ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించనున్న శ్రీ చిత్రా తిరునాళ్ సంస్థ
Posted On:
20 MAY 2020 5:24PM by PIB Hyderabad
మాగ్నెటిక్ నానో పార్టికిల్ ఆధారంగా కోవిడ్-19 అనుమానితుల ఆర్ ఎన్ ఎ ను సేకరించే కిట్ "అగప్పే చిత్రా మాగ్నా" ను 2020 మే 21 సాయంత్రం 4.30 గంటలకు వాణిజ్య పరంగా ఆవిష్కరించబోతున్నారు. తిరువనంతపురం కేంద్రంగా ఉన్న శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ( ఎస్ సి టి ఐ ఎం ఎస్ టి) అనే సంస్థ దీన్ని రూపొందించింది. శాస్త్ర సాంకేతిక విభాగానికి చెందిన ఈ జాతీయ ప్రాధాన్యమున్న సంస్థతో బాటు కొచ్చిన కేంద్రంగా పనిచేసే ఆరోగ్యపరీక్షల పరికరాల తయారీ సంస్థ అగప్పే డయాగ్నస్టిక్స్ లిమిటెడ్ దీన్ని రూపొందించాయి.
శ్రీచిత్ర తిరునాళ్ సంస్థ తన బయోమెడికల్ టెక్నాలజీ విభాగంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబోతోంది.
సంస్థ అధ్యక్షుడు, నీతి ఆయోగ్ సభ్యుడు అయిన డాక్టర్ వికె సారస్వత్, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. ఆవిష్కరణని డాక్టర్ వికె సారస్వత్ లాంఛనంగా ప్రకటిస్తారు. ఆ తరువాత తొలి అమ్మకాన్ని అగప్పే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ థామస్ జాన్ నిర్వహిస్తారు. కొచ్చి లోని అమృతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారులు తొలి కొనుగోలు చేస్తారు.
తక్కువ ఖర్చుతో, వేగంగా, కచ్చితంగా కోవిడ్ - పరీక్షలు చేయటం ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి, వైరస్ సోకినవాళ్ళకు సాయం చేయటానికి వీలవుతుంది. సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అనూప్ కుమార్ తెక్కువెట్టిల్ సారధ్యంలో శ్రీ చిత్ర తిరునాళ్ సంస్థ ఈ సరికొత్త కిట్ సాంకేతిక పరిజ్జానాన్ని రూపొందించి ఏప్రిల్ లో అగప్పే డయాగ్నస్టిక్స్ కు అందించింది, ఇప్పుడది అగప్పే చిత్ర మాగ్నా ఆర్ ఎన్ ఎ ఐసొలేషన్ కిట్ పేరుతో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోంది. కోవిడ్19 నిర్థారణ కోసం పనికొస్తుందని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దీనిని ధ్రువీకరించింది. కేంద్ర ఔషఢ ప్రమాణాల నియంత్రణ సంస్థ దీన్ని వాణిజ్యపరంగా విడుదల చేయటానికి ఆమోదం తెలియజేసింది. సార్స్- కరోనా వైరస్ 2 కనుగొనటానికి ఆర్ ఎన్ ఎ తీయటానికి, ఆర్ టి - ఎల్ ఎ ఎమ్ పి , ఆర్ టి - క్యుపిసిఆర్, ఆర్ టి పిసిఆర్ తదితర ప్రొటోకాల్స్ కోసం ఈ కిట్ వాడవచ్చు.
మాగ్నెటిక్ నానో పార్టికిల్స్ సాయంతో రోగి నమూనా నుంచి ఆర్ ఎన్ ఎ ను వేరు చేయటానికి ఇది సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటుంది. అయస్కాంత క్షేత్రం మీదికి పంపినప్పుడు వైరల్ ఆర్ ఎన్ ఎ చుట్టూ మాగ్నెటిక్ నానోపార్టికిల్స్ చుట్టుకుంటాయి. దీనివలన అత్యంత నాణ్యమైన, గాఢ ఆర్ ఎన్ ఎ లభిస్తుంది. తగినంత వైరల్ ఆర్ ఎన్ ఎ అందుబాటులో ఉండటమే వ్యాధి నిర్థారణలో కీలకం గనుక ఈ కొత్త పరిజ్ఞానంతో పాజిటివ్ కేసులు గుర్తించటం సులభమవుతుంది.
ఇలా ఆర్ ఎన్ ఎ సేకరించగలిగే కిట్స్ వచ్చే ఆరు నెలల్లో భారతదేశానికి దాదాపు 8 లక్షలు అవసరమవుతాయి. అగప్పే చిత్రా మాగ్నా ఆర్ ఎన్ ఎ కిట్ ధర ఒక్కొక్కటి రూ. 150 గా నిర్ణయించారు. దీనివలన పరీక్షల ధర బాగా తగ్గుతుంది. పైగా ప్రస్తుతం ఒక్కొక్కటి రూ.300 విలువచేసే విదేశీ కిట్స్ ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. అగప్పే డయాగ్నస్టిక్స్ సంస్థకు నెలకు మూడు లక్షల కిట్స్ తయారు చేసే సామర్థ్యం ఉంది
(Release ID: 1625554)
Visitor Counter : 264