పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

లైఫ్‌లైన్ ఉడాన్‌ కింద 430 విమానాలతో సేవలు 4.21 లక్షల కి.మీ. ప్రయాణం, 795.86 టన్నులు తరలింపు మారుమూల ప్రాంతాలకు వైద్య సామగ్రి చేరవేత

Posted On: 03 MAY 2020 4:47PM by PIB Hyderabad

ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్ సహా ప్రైవేట్ క్యారియర్లు ‘లైఫ్‌లైన్ ఉడాన్’ కింద 430 విమానాలను న‌డుపుతున్నాయి. వీటిలో 252 విమానాలను కేవలం ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ నిర్వహిస్తున్నాయి. ఈ విమానాల ద్వారా నేటి వరకు రవాణా చేసిన‌ సరకు 795.86 టన్నులు. ఇప్పటివరకు లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు తిరిగివచ్చిన గ‌గ‌న‌త‌ల దూరం 4,21,790 కిలోమీట‌ర్లు. కోవిడ్-19పై భార‌త్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సరకును రవాణా చేయడానికి ‘లైఫ్‌లైన్ ఉడాన్’ విమానాలను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నడుపుతోంది.

    జమ్ము&కశ్మీర్‌, లడఖ్‌, ద్వీప ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతానికి ముఖ్యమైన ఔషధాలు, రోగులను తరలించడానికి పవన్‌ హాన్స్‌ లిమిటెడ్‌ సహా హెలికాఫ్టర్‌ సేవలను వినియోగిస్తున్నారు. మే 2, 2020 వరకు, 2.27 టన్నుల సరకును పవన్‌ హాన్స్‌ మోసుకెళ్లింది. 7,729 కిలోమీటర్లు ప్రయాణించింది. స‌ర‌కు త‌ర‌లింపున‌కు సంబంధించి ఈశాన్య ప్రాంతం, ద్వీప భూభాగాలు, కొండ ప్రాంత రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జ‌మ్ముకశ్మీర్‌, లడఖ్, ఈశాన్య ప్రాంతం, ఇతర ద్వీప ప్రాంతాలకు సరకు రవాణాలో ఎయిర్ ఇండియా, ఐఏఎఫ్ ప్రధానంగా స‌హ‌కారాన్ని అందించాయి.

వాణిజ్య ప్రాతిపదికన సరకు రవాణా
    దేశీయంగా సరకు రవాణా చేసే స్పైస్‌ జెట్‌, బ్లూడార్ట్‌, ఇండిగో, విస్తారా సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన విమానాలు నడుపుతున్నాయి. స్పైస్‌ జెట్‌, మార్చి 24 నుంచి 2, మే 2020 వరకు 760 సరకు రవాణా విమానాలను నడిపింది. 13,09,310 కిలోమీటర్లు ప్రయాణించి, 5,519 టన్నుల సరకు తరలించింది. వీటిలో 279 అంతర్జాతీయ సరకు రవాణా విమానాలు కూడా ఉన్నాయి. బ్లూడార్ట్‌ సంస్థ, మార్చి 25 నుంచి 2 మే 2020 వరకు 253 విమానాలను నడిపింది. 2,76,768 కిలోమీటర్లు ప్రయాణించి, 4,364 టన్నులను రవాణా చేసింది. వీటిలో 12 అంతర్జాతీయ సరకు రవాణా విమానాలు ఉన్నాయి. ఇండిగో సంస్థ, ఏప్రిల్‌ 3 నుంచి 2 మే 2020 వరకు 87 విమానాలను నడిపింది. వీటిలో 32 అంతర్జాతీయ సరకు రవాణా విమానాలు ఉన్నాయి. మొత్తం 1,43,604 కిలోమీటర్లు ప్రయాణించిన విమానాలు, 423 టన్నుల సరకును తీసుకెళ్లాయి. భారత ప్రభుత్వం కోసం ఉచితంగా తీసుకెళ్లిన వైద్య సామగ్రి కూడా ఇందులో ఉంది.విస్తారా సంస్థ, ఏప్రిల్‌ 19 నుంచి 2 మే 2020 వరకు 20 సరకు రవాణా విమానాలను నడిపింది. 28,590 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ విమానాలు 139 టన్నుల సరకును చేరవేశాయి.

విదేశాల నుంచి సామగ్రి తరలింపు
    ఔషధాలు, వైద్య సామగ్రి, కొవిడ్‌-19 చికిత్స పరికరాల తరలింపు కోసం తూర్పు ఆసియాతో కార్గో ఎయిర్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీంతో, 899 టన్నుల వైద్య సరకును తూర్పు ఆసియా నుంచి ఎయిర్‌ ఇండియా తీసుకువచ్చింది. ఏప్రిల్‌ 14 నుంచి 2 మే 2020 వరకు, గ్వాంగ్జౌ మరియు షాంఘై నుంచి 114 టన్నుల వైద్య సామగ్రిని బ్లూడార్ట్‌ తీసుకొచ్చింది. స్పైస్‌జెట్‌ కూడా 2 మే 2020 వరకు 204 టన్నుల వైద్య సామగ్రిని గ్వాంగ్జౌ మరియు షాంఘై నుంచి; 16 టన్నుల సామగ్రిని హాంకాంగ్‌ మరియు సింగపూర్‌ నుంచి తీసుకొచ్చింది.



(Release ID: 1620692) Visitor Counter : 180