సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
లోక్‌పాల్ సభ్యుడు జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి కన్నుమూత కొవిడ్-19కు చికిత్స తీసుకుంటూ మరణం
प्रविष्टि तिथि:
03 MAY 2020 5:04PM by PIB Hyderabad
కరోనా వైరస్‌తో పోరాడుతూ, లోక్‌పాల్ న్యాయ సభ్యుడు జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి, దిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూశారు. మే 2, 2020 శనివారం రాత్రి 8.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏప్రిల్ 2, 2020న దిల్లీ ఎయిమ్స్‌లో ఆయన్ను కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స తీసుకుంటూ ఆస్పత్రిలో జస్టిస్ త్రిపాఠి మరణించారు.
జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి 1957 నవంబర్ 12న జన్మించారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఆర్థిక శాస్త్రంలో (హానర్స్) డిగ్రీ పూర్తి చేశారు. దిల్లీ విశ్వవిద్యాలయం క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయవిద్య అభ్యసించారు. చదువు పూర్తయ్యాక పాట్నా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2006 అక్టోబర్ 9న పాట్నా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ త్రిపాఠి నియమితులయ్యారు. 2007 నవంబర్ 21న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యయమూర్తిగా 2018, జులై 7 నుంచి సేవలు అందించారు.
2019 మార్చి 27న భారత లోక్‌పాల్ సభ్యుడిగా జస్టిస్ త్రిపాఠి ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌పాల్ వ్యవస్థను నెలకొల్పడంలో, తన ఆలోచనలు, ప్రమేయంతో జస్టిస్ త్రిపాఠి ముఖ్య భూమిక పోషించారు.
జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి మరణం పట్ల లోక్‌పాల్ కుటుంబం సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, జరిగిన నష్టం నుంచి కోలుకునేందుకు జస్టిస్ త్రిపాఠి కుటుంబ సభ్యులకు ధైర్యం అందించాలని దేవుడిని ప్రార్థించింది.
(रिलीज़ आईडी: 1620657)
आगंतुक पटल : 271