వ్యవసాయ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలోనూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటన

గత ప్రభుత్వాలేవీ వ్యవసాయం, రైతు సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం తరహాలో అధికంగా దృష్టి సారించలేదు : శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

ఆహారధాన్యాలు, ఉద్యానవన పంటల్లో రికార్డు ఉత్పత్తి దిశగా భారత్

భారత ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం కొనసాగుతుంది : శ్రీ రమేశ్ చంద్, సభ్యుడు, నీతి ఆయోగ్

Posted On: 29 APR 2020 8:38PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలో కూడా ప్రభుత్వం వ్యవసాయం, పంటల పెంపకానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని కేంద్ర రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం కారణంగానే దేశంలో ఎక్కడా ఆహార ధాన్యాలు, పప్పుదినుసుల కొరత లేదని, దీనికి తోడు కూరగాయలు, పాల సరఫరా నిరంతరాయంగా ఉండేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నదని ఆయన చెప్పారు. ఆయన బుధవారం శ్రీ తోమర్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్రామాలు, పేదలు, రైతులకు (గావోం, గరీబ్, కిసాన్) ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రకటించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా వ్యవసాయానికి, రైతాంగానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదని శ్రీ తోమర్ చెప్పారు. ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీ మోదీ నభూతో నభవిష్యతి అన్నట్టుగా చేపట్టిన ఈ పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్), ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు (కెసిసి) ఉన్నట్టు ఆయన తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో కూడా వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరాయంగా జరిగేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని శ్రీ తోమర్ తెలిపారు. లాక్ డౌన్ నుంచి వ్యవసాయ కార్యకలాపాలకు ఇచ్చిన మినహాయింపులు ఇలా ఉన్నాయి...

- వ్యవసాయ క్షేత్రాల్లో వ్యవసాయదారులకు, వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతి. ఎంఎస్ పి కార్యకలాపాలు నిర్వహించే వారు సహా వ్యవసాయ ఉత్పత్తులు సేకరించే వారందరికీ అనుమతి.
- వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని “మండీ”లు
- విత్తనాలు, ఎరువులు, కీటక నాశనుల తయారీ, ప్యాకేజింగ్ యూనిట్లు, విక్రయ దుకాణాలు
- పంట ఉత్పత్తులను, వ్యవసాయ పరికరాలను, ఇతర వ్యవసాయ, ఉద్యానవన పనిముట్లను తరలించే వాహనాల అంతర్ రాష్ట్ర రవాణా
- శీతలీకరణ కేంద్రాలు, గిడ్డంగి సేవలు
- నిత్యావసర వస్తువుల రవాణా
- వ్యవసాయ యంత్ర పరికరాలు, విడిభాగాలు (సరఫరా వ్యవస్థ సహా), వాటి మరమ్మత్తు కార్యకలాపాలు నిర్వహించే దుకాణాలు
- వ్యవసాయ యంత్రపరికరాలను అద్దెకిచ్చే కేంద్రాలు

వ్యవసాయ కార్యకలాపాలను నిరంతరం ప్రోత్సాహం ఇచ్చే చర్యల్లో భాగంగా ధాన్యం, గోధుమ, పప్పు దినుసులు, నూనెగింజలు సహా ఖరీఫ్, రబీ పంటలకు ఉత్పత్తి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల ప్రతిఫలం అందించే విధంగా మద్దతు ధరలు ప్రతీ సీజన్ లోనూ ప్రకటిస్తున్నట్టు శ్రీ తోమర్ చెప్పారు. రబీ పంటలకు వ్యయాలపై 50% నుంచి 109% వరకు రాబడి ఉండేలా ఎంఎస్ పి పెంచుతున్నామన్నారు. రబీలో పప్పుదినుసులు, నూనె గింజలు సేకరించే కేంద్రాలను గత ఏడాదిలో 1485 స్థాయి నుంచి ఈ ఏడాది 2790కి పెంచినట్టు ఆయన చెప్పారు. సేకరణ పెరిగిన కొద్ది అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

ఈ ప్రోత్సాహాలన్నింటి వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు అయిందని వ్యవసాయ మంత్రి అన్నారు. 2018-19లో 285.20 మిలియన్ టన్నులున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ఏడాది 291.95 మిలియన్ టన్నులకు చేరనున్నదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాదికి 298.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలిపారు. పప్పుల ఉత్పత్తి 28.3 % అంటే 2014-15లోని 17.20 మిలియన్ టన్నుల నుంచి  పెంచడం వల్ల 2019-20 నాటికి 23.02 మిలియన్ టన్నులకు పెంచడంతో పోషకాహార విప్లవం కూడా ఏర్పడిందని ఆయన అన్నారు. వేసవి పంటల మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల పంట విస్తీర్ణం గత ఏడాదితో పోల్చితే 41.31 లక్షల హెక్టార్ల నుంచి ఈ ఏడాది 57.07 లక్షల హెక్టార్లకు పెరిగిందని ఆయన తెలిపారు. ఉద్యానవన పంటలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏడాదితో పోల్చితే 310.74 మిలియన్ టన్నుల నుంచి 313.35 మిలియన్ టన్నుల రికార్డుకు చేరబోతున్నాయని ఆయన చెప్పారు.

సామాజిక దూరం నిబంధనల కారణంగా వ్యవసాయ రంగంలో మానవ వనరుల సంఖ్యను పరిమితం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీ తోమర్ తెలిపారు. వ్యవసాయం, సహకారం, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ చేపట్టిన ఈ టెక్నాలజీ ఆధారిత ప్రత్యామ్నాయాలివే...

- ఇ-నామ్ కొత్ సాకేంతికపరిజ్ఞానంతో కూడిన ప్రత్యామ్నాయాలతో రైతులకు అండగా ఉంది.
- 2020 ఏప్రిల్ లో ఇ-నామ్ కు చెందిన కొత్త మాడ్యూళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
- గిడ్డంగుల ఆధారిత ట్రేడింగ్ మాడ్యూల్ : ఇ-నామ్ తో అనుసంధానమూన ఇ-ఎన్ డబ్ల్యుఆర్
- ఎఫ్ పిఓ మాడ్యూల్ వల్ల వారి కలెక్షన్ కేంద్రాల నుంచి వ్యవసాయ ఉత్పత్తలు అప్ లోడింగ్, బిడ్డింగ్, చెల్లింపు కార్యకలాపాలు సులభం అయ్యాయి.
- ఎఫ్ పిఓలు సమీపంలోని నగరాలు, పట్టణాలకు కూరగాయలు సరఫరా చేస్తున్నాయి. వస్తువుల కదలికలు, ట్రేడింగ్ కు సంబంధించిన సమస్యలన్నీ వాస్తవిక దృక్పథంతో పరిష్కారం అయ్యాయి. ఎఫ్ పిఓలకు పాస్లు/ ఇపాస్ లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.
- వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సరైన రవాణా వాహనాన్ని ఎంచుకోవడంలో వ్యవసాయదారులు, రైతులకు సహాయపడేందుకు “కిసాన్ రథ్” యాప్ ను 2020 ఏప్రిల్ 17న ప్రారంభించారు. ఇందులో 11.37 లక్షల ట్రక్కులు, 2.3 లక్షల మంది రవాణా ఆపరేటర్లు నమోదు చేసుకున్నారు.
- 2020 ఏప్రిల్ లో అఖిల భారత వ్యవసాయ వస్తువుల రవాణా కాల్ సెంటర్ కూడా ప్రారంభించారు. కూరగాయలు, పళ్లు వంటి త్వరగా పాడైపోయే స్వభావం ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఉపకరణాల అంతర్ రాష్ట్ర రవాణాను సమన్వయపరిచేందుకు ఈ కాల్ సెంటర్ సహాయకారిగా ఉంటుంది. ఈ కాల్ సెంటర్ నంబర్లు - 18001804200;  14488.

- బడ్జెట్ అనంతరం చేసిన ప్రకటనల్లో కిసాన్ రైల్ కూడా ఒకటి. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల సత్వర రవాణాకు రైల్వే శాఖ 67 రూట్లలో 567 పార్సిల్ స్పెషల్స్ రైళ్లు (వాటిలో 503 టైమ్ టేబుల్ పార్సిల్ రైళ్లు) ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 20,653 టన్నుల సరకు రవాణా చేశాయి.

 


పీఎం-కిసాన్ స్కీమ్ కోవిడ్ సీజన్ లో రైతులకు ఎంతో ప్రయోజనకారిగా నిలిచింది. 2020 మార్చి 24 నుంచి ఇప్పటివరకు 17,986 కోట్ల రైతు ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ రోజు వరకు 9.39 కోట్ల రైతు కుటుంబాలు రూ.71 వేల కోట్ల బదిలీ ద్వారా లబ్ధి పొందాయి. 2020 ఏప్రిల్ 1 నుంచి జూలై 31 తేదీల మధ్య వాయిదాల కింద 8.13 కోట్ల మంది లబ్ధిదారులకు  ఏప్రిల్ మొదటి పక్షం రోజుల్లోనే సొమ్ము పంపడం జరిగింది. అయితే అసలు స్కీమ్ తక్కువ నుంచి ఒక మోస్తరు మంది రైతులకే లబ్ధి చేకూరుస్తున్నందు వల్ల వ్యవసాయ కుటుంబాలన్నింటికీ పాత స్కీమ్ ను విస్తరించేందుకు ప్రధానమంత్రి ఆమోదం తెలిపారు.

2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల (కెసిసి) సంపూర్ణ విస్తరణ కార్యక్రమం చేపట్టింది. దీని వల్ల పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కెసిసి ప్రయోజనాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఆ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుంచి పిఎం-కిసాన్ లబ్ధిదారుల నుంచి ఇప్పటికి 75 లక్షల దరఖాస్తులు బ్యాంకులకు రాగా 20 లక్షల దరఖాస్తులను ఆమోదించి రూ.18 వేల కోట్లు మంజూరు చేశారు.

రైతుల నుంచి వస్తున్న డిమాండు ఆధారంగా పీఎం ఫసల్ బీమా యోజనను వారి ప్రీమియం వాటాలో ఏమీ మార్పులు చేయకుండానే రైతులందరికీ స్వచ్ఛంద సభ్యత్వ ప్రాతిపదికన విస్తరించనున్నట్టు శ్రీ తోమర్ చెప్పారు. ఈ స్కీమ్ కింద ఈశాన్య రాష్ర్టాల రైతులకు గతంలో ఇచ్చిన 50 శాతం ప్రీమియం సబ్సిడీని 90 శాతానికి పెంచారు. ఆ ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతుల ప్రయోజనానికి రిస్క్ కవరేజి ఎంత ఇవ్వాలి, హామీ మొత్తం ఎంత అనేది ఎంచుకునే స్వేచ్ఛ రాష్ర్టాలకే వదిలివేశారు.2017-19 సంవత్సరాల్లో రైతుల వాటా కింద రూ.9 వేల కోట్లు అందిందని, బాధిత రైతులకు రూ.50 వేల కోట్ల మేరకు పంటల బీమా క్లెయిమ్ లకు ఆమోదం తెలిపారని శ్రీ తోమర్ చెప్పారు. లాక్ డౌన్ కాలంలో చెల్లించిన క్లెయిమ్ ల మొత్తం రూ.5326 కోట్లని తెలిపారు.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఈ ఏడాది బడ్జెట్ లో ఆవిష్కరించారని శ్రీ తోమర్ అన్నారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలన్నింటికీ 2020-21 బడ్జెట్ లో రూ.2.83 కోట్లు కేటాయించారు. అందులో రూ.1.6 లక్షల కోట్లు కేవలం వ్యవసాయ కార్యకలాపాలకే కాగా మిగతా మొత్తం నీటిపారుదల సహా అన్ని రకాల అనుబంధ కార్యకలాపాలకు కేటాయించినట్టు ఆయన చెప్పారు. 2009-14 సంవత్సరాల మధ్య కాలంలో యుపిఐ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 సంవత్సరాల వ్యవసాయ బడ్జెట్ పరిమాణం రూ.1.1 లక్షల కోట్ల కన్నా ఇది అధికమని ఆయన అన్నారు. 2024-25 నాటికి రూ.6866 కోట్ల కేటాయింపుతో 10 వేల రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ పిఓ) ఏర్పాటు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఒక స్కీమ్ కూడా ప్రారంభించిందని, దీని వల్ల అందరూ ఉమ్మడిగానే వ్యవసాయ ఉపకరణాలు సమీకరించుకోవడంతో పాటు తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా మార్కెట్ చేసుకోగలుగుతారని ఆయన తెలిపారు.

వ్యవసాయ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు పునాదిగా కొనసాగుతుందని, లాక్ డౌన్ కారణంగా 60 శాతం పారిశ్రామిక కార్యకలాపాలు స్తంభించిపోయినా జిడిపి వృద్ధిని మెరుగైన స్థాయిలోనే నిలపాలని ప్రభుత్వం భావిస్తున్నదని నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేశ్ చంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు. రుతుపవనాలు అనుకూలంగానే ఉంటాయన్న అంచనాల నడుమ రిజర్వాయర్లకు 50-60 % నీరు అందుబాటులో ఉంటుందని, వ్యవసాయ రంగం అత్యద్భుతంగా పని చేసే ఆస్కారం ఉన్నదని ఆయన చెప్పారు. ఈ నెలలో 28వ తేదీ నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఎరువుల కొనుగోళ్లు 5 శాతం అంటే 12.86 లక్షల కోట్ల నుంచి 13.5 లక్షల కోట్లకు పెరిగాయని ఆయన తెలిపారు. అలాగే ఈ ఏడాది తొలి నాలుగు నెలల కాలంలోనే కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు 20 శాతం అధికంగా విత్తనాలు విక్రయించినట్టు ఆయన చెప్పారు. పంటలకు అధిక ధరల హామీ కూడా ఇస్తున్నందు వల్ల రైతులకు మరింత ఉత్తేజం లభించి 3% దీర్ఘకాలిక వ్యవసాయ వృద్ధి సాధనకు తమ వంతు కృషి చేయగలరని ఆయన అన్నారు.

 


(Release ID: 1619517) Visitor Counter : 292