సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
దిగుమతులకు ప్రత్యామ్నాయం కోసం పనిచేయాలనీ, పోటీలో నిలదొక్కుకోవడం కోసం వినూత్న సాంకేతికతను అవలంబించాలనీ పరిశ్రమ వర్గాలకు పిలుపునిచ్చిన శ్రీ గడ్కరీ.
ఏప్రిల్ 20వ తేదీ నుండి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు సడలించనున్న నేపథ్యంలో ఆర్ధిక కార్యకలాపాల పునరుద్ధరణ పై పరిశ్రమకు చెందిన సంఘాలతో మంత్రి చర్చలు జరిపిన మంత్రి.
Posted On:
17 APR 2020 6:20PM by PIB Hyderabad
విదేశీ దిగుమతుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను భర్తీ చేయడానికి దిగుమతుల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మరియు ఆర్.టి.&హెచ్ శాఖల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ నొక్కి చెప్పారు. సాంకేతికతను ఉపయోగించుకోవాలని కోరుతూ, పారిశ్రామికాభివృద్ధిలో పరిశోధన, ఆవిష్కరణ, నాణ్యతలో మెరుగుదల ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ (వై.పి.ఓ.); ఇండియా ఎస్.ఎం.ఈ. ఫోరమ్ (ఐ.ఎస్.ఎఫ్.) తో పాటు నాగపూర్ కు చెందిన ఇతర సంస్థల ప్రతినిధులతో ఈ రోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ఆర్ధిక కార్యకలాపాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు పరిశ్రమల రంగాన్ని పునరుద్ధరించాలి. సుస్థిర ఆర్థికాభివృద్ధికి సమయం ఆసన్నమైంది.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ. రంగం పునరుద్ధరణ గురించి మంత్రి మాట్లాడుతూ, ఎగుమతులను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతూనే, విశ్వ విఫణిలో పోటీని తట్టుకునే విధంగా విద్యుత్, రవాణా, ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం కొన్ని పరిశ్రమ రంగాలలో ఉత్పత్తిని ప్రారభించమని అనుమతించిన విషయాన్ని శ్రీ గడ్కరీ ప్రస్తావిస్తూ, కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే విధంగా అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని గుర్తుచేశారు. కార్యాలయాలు / వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో మాస్కులు, సానిటైజర్లు, గ్లోవ్ లు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించాలనీ, సామాజిక దూరం వంటి నిబంధనలను తప్పకుండా పాటించాలనీ ఆయన నొక్కి చెప్పారు.
జపాన్ ప్రభుత్వం చైనా లోని తమ పెట్టుబడులను ఉపసంహరించి మరో చోటుకు మార్చాలని కోరుతూ ఆ దేశ పరిశ్రమవర్గాలకు అందిస్తున్న ప్యాకేజీ గురించి మంత్రి మాట్లాడుతూ, ఆ అవకాశాన్ని భారతదేశం అందిపుచ్చుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఢిల్లీ - ముంబాయి ఎక్స్ ప్రెస్ వే ఇప్పటికే ప్రారంభమైందని శ్రీ గడ్కరీ తెలియజేస్తూ, పారిశ్రామిక క్లస్టర్లు, పారిశ్రామిక పార్కులు, స్మార్ట్ విలేజెస్ లో భవిష్యత్ పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అవకాశమనీ, అటువంటి ప్రతిపాదనలు ఎన్.హెచ్.ఏ.ఐ. కి దాఖలు చేయాలనీ కోరారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ.ల చెల్లింపులన్నింటినీ వెంటనే చెల్లించే విధంగా కృషి జరుగుతోందనీ, ఈ విషయమై అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందనీ కూడా ఆయన తెలియజేశారు. కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్ డౌన్ వల్ల నెలకొన్న సవాళ్ళను అధిగమించడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ పడుతుందని కూడా గడ్కరీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లు, సమస్యల పట్ల తమ ఆందోళనల గురించి ఆయా సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో వివరించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ.ల రంగం సజావుగా సాగడానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ, వారు కొన్ని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రతినిధులు లేవనెత్తిన కొన్ని సమస్యలు, సూచనల్లో - మారటోరియం కనీసం ఆరునెలలకు పొడిగించాలి; ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు వర్కింగ్ క్యాపిటల్ ఋణం పరిమితిని పెంచాలి ; వినియోగ బిల్లులపై చార్జీలను రద్దు చేయాలి; అత్యవసర వస్తువుల విభాగంలో కంప్యూటర్ హార్డ్ వేర్ రంగంతో సహా మరికొన్ని వస్తువులను చేర్చాలి; లాక్ డౌన్ సమయంలో కార్మికుల వేతనాలు ఈ.ఎస్.ఐ. మరియు భవిష్య నిధి నిల్వల నుండి చెల్లించాలి; విద్యా,ఆరోగ్య సంస్థలపై చేసిన ఖర్చులన్నింటినీ పన్ను నుండి మినహాయించాలి వంటివి ఉన్నాయి.
తాను ఈ విషయాలను కేంద్ర ఆర్ధికమంత్రి, భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్.బీ.ఐ.) దృష్టికి తీసుకువెళ్తానని శ్రీ గడ్కరీ హామీ ఇచ్చారు.
కోవిడ్-19 సంక్షోభం ముగిసిన తర్వాత పరిశ్రమ వర్గాలు కలిసికట్టుగా పనిచేసి నూతన అవకాశాలను కల్పించుకోవాలని కూడా శ్రీ గడ్కరీ సూచించారు.
*****
(Release ID: 1615512)
Visitor Counter : 175