ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక సుస్థిరత పరిరక్షణకు రిజర్వు బ్యాంకు రెండోవిడత చర్యలు

అవసరాల్లో ఉన్నవారికి... నిస్సహాయులకు నగదు లభ్యతే లక్ష్యం
కోవిడ్‌-19 నిర్వహణ కోసం రాష్ట్రాలకు మరింత రుణం పొందే వీలు
రివర్స్‌ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింపు
బ్యాంకింగేతర సంస్థలకు, స్థిరాస్తి రంగానికి ఊరట కల్పన
మనం కోలుకుని.. నిలబడతాం.. పుంజుకుంటాం: ఆర్బీఐ గవర్నర్‌
భారత్‌ 2021-22లో 7.4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా

Posted On: 17 APR 2020 3:33PM by PIB Hyderabad

"మరణం నడుమనే జీవితం కొనసాగుతుంది... అసత్యాల మధ్యనైనా సత్యం సజీవంగా ఉంటుంది... అంధకారం అలమినా వెలుగు దూసుకొస్తుంది.” లండన్‌లోని కింగ్‌స్లే హాల్‌లో 1931 అక్టోబర్‌ నాటి చరిత్రాత్మక ప్రసంగం సందర్భంగా మహాత్మాగాంధీ పలుకులివి. మహాత్ముడు నాడు పలికిన ఈ మాటలను ఉటంకిస్తూ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తన ‘ఆన్‌లైన్‌’ ప్రకటను ప్రారంభించారు. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభంవల్ల ఒడుదొడుకులలో చిక్కుకున్న  దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజమిచ్చే 9 రకాల చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇంతకుముందు 2020 మార్చి 27న కొన్ని చర్యలను ప్రకటించిన నేపథ్యంలో వీటిని రెండోవిడత చర్యలుగా పేర్కొనవచ్చు. ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బిగించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిని జయించాలన్న మానవాళి సంకల్పం సరికొత్త స్ఫూర్తిని రగిల్చిందని ఆయన అన్నారు.

రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ప్రకటన ప్రకారం ఈ అదనపు చర్యల లక్ష్యం ఏమిటంటే:

 • కోవిడ్‌-19 సంబంధిత స్థానభ్రంశాల నడుమ వ్యవస్థలో... దాని విభాగాలలో సముచిత ద్రవ్య లభ్యత నిర్వహణ;
 • బ్యాంకులకు రుణ ప్రవాహ సౌలభ్యం, ప్రోత్సాహం
 • ఆర్థిక ఒత్తిడి నుంచి ఊరట కల్పన;
 • విపణులు సాధారణ స్థాయిలో పనిచేసేలా చూడటం.

మహమ్మారి విసిరిన కఠిన సవాళ్లను ఎదుర్కొనడంలో కేంద్ర బ్యాంకు తనవద్దగల అన్నిరకాల ఉపకరణాలనూ వినియోగిస్తుందని గవర్నర్‌ చెప్పారు. వ్యవస్థలోని భాగస్వాములవద్ద... ప్రత్యేకించి అవసరాల్లో ఉన్నవారు, నిస్సహాయులు, దుర్బలవర్గాలకు ద్రవ్య లభ్యతే ఈ చర్యల ప్రధానోద్దేశమని తెలిపారు. మొత్తంమీద జాతి సమష్టి కృషితో ఈ పరిస్థితి నుంచి  కోలుకోవడంతోపాటు నిలదొక్కుకుని, పుంజుకోగలదని ధీమా వ్యక్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ రిజర్వు బ్యాంకు ప్రకటించిన 9 చర్యలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.

https://youtu.be/HRTjao84K6s 

ద్రవ్య లభ్యత

 1. లక్ష్య నిర్దేశిత దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు (TLTRO) 2.0

ప్రారంభ సమీకృత మొత్తం రూ.50,000 కోట్ల నిర్వహణకు వీలుగా రెండో విడత లక్ష్య నిర్దేశిత దీర్ఘకాలిక రెపో కార్యకలాపాలు (TLTRO) ఉద్దేశించబడ్డాయి. తద్వారా కోవిడ్‌-19 వల్ల తీవ్రంగా ప్రభావితమైన బ్యాంకింగేతర, సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థలు (MFI) సహా చిన్న-మధ్యతరహా కార్పొరేట్‌ సంస్థలకు సముచిత నిధుల ప్రవాహం ఉంటుంది. ఆ మేరకు టీఎల్‌టీఆర్‌ఓ 2.0 కింద బ్యాంకులకు అందుబాటులోకి వచ్చే నిధులను పెట్టుబడి స్థాయి బాండ్లు, వాణిజ్య పత్రాలతోపాటు బ్యాంకింగేతర ఆర్థిక సహాయ సంస్థల (NBFC)కు చెందిన  మార్పిడికి వీల్లేని డిబెంచర్ల కొనుగోలుకు వినియోగించాలి. అయితే, ఇలా వినియోగించే మొత్తం నిధుల్లో కనీసం 50 శాతం చిన్న-మధ్యతరహా ఎన్‌బీఎఫ్‌సీలు, సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థ (MFI)లకు అందాలి.

 1. అఖిలభారత ఆర్థిక సంస్థలకు పునఃరుణ సదుపాయం

జాతీయ వ్యవసాయ-గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD), భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (SIDBI), జాతీయ గృహనిర్మాణ బ్యాంకు (NHB)లకు ప్రత్యేక పునఃరుణ సదుపాయ కల్పన కోసం రూ.50,000 కోట్లు కేటాయింపు. తద్వారా ఆయా రంగాల రుణావసరాలను ఇవి తీర్చగలుగుతాయి. ఈ మొత్తంలో నాబార్డుకు అందే రూ.25,000 కోట్ల నుంచి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, సూక్ష్మ ఆర్థిక సహాయ సంస్థలకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇక ‘సిడ్బి’కి అందే రూ.15,000 కోట్ల నుంచి రుణాలివ్వడంతోపాటు పునఃరుణ సదుపాయానికి వినియోగించాలి. జాతీయ గృహనిర్మాణ బ్యాంకుకు అందే రూ.10,000 కోట్లను గృహనిర్మాణ ఆర్థిక సహాయ కంపెనీలకు ఆర్థిక మద్దతు కోసం వినియోగించాలి. కోవిడ్‌-19 సంక్షోభ ఫలితంగా మార్కెట్‌ నుంచి రుణ సమీకరణలో ఈ సంస్థలన్నీ ఇబ్బందులు పడుతున్న కారణంగా ఈ వెసులుబాటు కల్పించబడింది. ఈ (రూ.50,000 కోట్ల) రుణాలపై వినియోగ సమయంలో రిజర్వు బ్యాంకు విధాన రెపో రేటు ప్రకారం వడ్డీ విధించబడుతుంది.

 1. ద్రవ్యలభ్యత సర్దుబాటు కింద రివర్స్ రెపో రేటు తగ్గింపు

మిగులు నిధులను ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు, రుణాల రూపేణా వినియోగించేలా బ్యాంకులను ప్రోత్సహించడం కోసం రివర్స్‌ రెపో రేటు (బ్యాంకులకు రిజర్వు బ్యాంకు చెల్లించే వడ్డీశాతం) 25 బేసిస్‌ పాయింట్లమేర కుదించి తక్షణం అమలులోకి వచ్చేవిధంగా 4.0 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించబడింది. సుస్థిర ప్రభుత్వ వ్యయం, ద్రవ్యలభ్యత పెంచేందుకు ఆర్బీఐ చేపట్టిన పలు చర్యలవల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగులు నిధులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ వివరించారు.

 1. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు తాత్కాలిక రుణాల పరిమితి పెంపు

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2020 మార్చి 31 వరకూగల పరిమితితో పోలిస్తే తాత్కాలిక రుణాల (WMA) పరిమితిని రిజర్వు బ్యాంకు 60 శాతం పెంచింది. కోవిడ్‌-19 నియంత్రణ, దాని ప్రభావాల ఉపశమన చర్యలు చేపట్టడంసహా మార్కెట్‌ రుణ సమీకరణ ప్రణాళికల రూపకల్పనలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించడమే ఈ నిర్ణయంలోని అంతరార్థం. రాష్ట్రాల రాబడి-వ్యయాల మధ్య తాత్కాలిక వ్యత్యాసాన్ని అధిగమించేందుకు తోడ్పాటునివ్వడమే ఈ తాత్కాలిక రుణ సదుపాయం లక్ష్యం. ఈ పరిమితి పెంపు 2020 సెప్టెంబరు 30దాకా అమలులో ఉంటుంది.

నియంత్రణ చర్యలు

   రిజర్వు బ్యాంకు 2020 మార్చి 27న కొన్ని చర్యలు ప్రకటించిన నేపథ్యంలో కోవిడ్‌-19 ప్రభావిత భారంనుంచి రుణగ్రహీతలను గట్టెక్కించడానికి ప్రస్తుత అదనపు చర్యలను ప్రకటించింది.

 1. ఆస్తుల వర్గీకరణ

నిరర్ధక ఆస్తుల (NPA) వర్గీకరణకు సంబంధించి- మార్చి 27నాటి తన ప్రకటన మేరకు వాయిదాల చెల్లింపుపై సహాయ సంస్థలు రుణగ్రస్థులకు ఇచ్చిన (90 రోజుల) విరామ సమయాన్ని పరిగణనలోకి తీసుకోరాదని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. తదనుగుణంగా అటువంటి రుణ ఖాతాలకు సంబంధించి 2020 మార్చి 1 నుంచి మే 31వరకూ ఆస్తుల వర్గీకరణ నిశ్చలంగా ఉంటుంది. బ్యాంకింగేతర ఆర్థిక సహాయ సంస్థలు నిర్దేశిత లెక్కంపు ప్రమాణాలకు లోబడి రుణగ్రస్థులకు ఊరట కల్పించవచ్చు. అదేవిధంగా అలాంటి రుణ ఖాతాల విషయంలో బ్యాంకులు అదనంగా 10 శాతం నిధులను ప్రత్యేకంగా ఉంచుకోవాలని రిజర్వు బ్యాంకు సూచించింది.

 1. పరిష్కార కాలవ్యవధి పొడిగింపు

ఒత్తిడితో కూడిన ఆస్తులు లేదా నిరర్థక ఆస్తులుగా మారే అవకాశంగల ఖాతాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి పరిష్కార ప్రణాళిక అమలు కాలవ్యవధిని రిజర్వు బ్యాంకు మరో 90 రోజులు పొడిగించింది. ప్రస్తుతం షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సహాయ సంస్థలు పరిష్కార ప్రణాళికను ఎగవేత నమోదైన నాటినుంచి 210 రోజుల్లో అమలు చేయలేకపోతే 20 శాతం నిధులను అదనంగా కేటాయించాలన్న నిబంధన ఉంది.

 1. డివిడెండ్‌ పంపిణీ

షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు 2019-20 ఆర్థిక సంవత్సరపు లాభాంశాన్ని (డివిడెండ్‌)ను పంపిణీ చేయరాదని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బ్యాంకుల ఆర్థిక స్థితిగతులనుబట్టి 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సమీక్షించనుంది. అనిశ్చితి పెరిగే పరిస్థితి ఏర్పడితే బ్యాంకులు నష్టాలను తట్టుకోవడంతోపాటు ఆర్థిక వ్యవస్థకు అవి దన్నుగా నిలవగల సామర్థ్యం కల్పించేలా మూలధన పరిరక్షణ దిశగా రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.

 1. ద్రవ్యలభ్యత నిర్వహణ నిష్పత్తి తగ్గింపు

ఆర్థిక సహాయ సంస్థల ద్రవ్యలభ్యత మెరుగు దిశగా షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకులవద్ద ద్రవ్యలభ్యత నిర్వహణ నిష్పత్తిని రిజర్వు బ్యాంకు 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రాగా- తిరిగి 2020 అక్టోబరు 1న 90 శాతానికి, 2021 ఏప్రిల్‌ 1న 100 శాతానికి రెండు దశల్లో పునరుద్ధరించబడుతుంది.

 1. వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులకు ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు

వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులకు రుణాల‌పై ప‌రిశీల‌న‌లో వాటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభ తేదీ ధ్రువీక‌ర‌ణ‌ నిర్ణ‌యాధికారం బ్యాంకింగేత‌ర ఆర్థిక స‌హాయ సంస్థ‌ల‌కే ద‌ఖ‌లు చేయ‌బ‌డింది. దీనివ‌ల్ల ఎన్‌బీఎఫ్‌సీల‌తోపాటు స్థిరాస్తి రంగానికీ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం... ప్రాజెక్టు ప్రమోటర్ల నియంత్రణలో లేని అంశాల కారణంగా వాణిజ్య కార్యకలాపాలు ఆలస్యమయ్యే పరిస్థితుల్లో ప్రారంభ తేదీని అదనంగా ఏడాదిపాటు పొడిగించవచ్చు. అలాగే రుణ పునర్నిర్మాణంగా పరిగణించకుండా ఏడాది అంతకుమించి పొడిగింపు ఇవ్వడం కూడా సాధారణమే.

   ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తూ- స్థూల ఆర్థిక-ద్రవ్య పరిస్థితి  క్షీణించిందని, కొన్ని రంగాల్లో దాదాపు తలకిందులైందని గవర్నర్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ మరికొన్ని రంగాల్లో కాంతిపుంజం ప్రకాశవంతంగా కనిపిస్తున్నదని వివరించారు. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అంచనాల ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మునుపటి తీవ్ర ఆర్థిక మాంద్యంకన్నా దిగజారి 2020లో దారుణ పతనంతో ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల నడుమ 1.9 శాతం సానుకూల వృద్ధి నమోదుకాగల అవకాశమున్న కొన్ని దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. కాగా, జి20 దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది అత్యంత అధికమని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ చెప్పారు. కాగా, రిజర్వు బ్యాంకు ప్రకటించిన అదనపు చర్యలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. దీనివల్ల ద్రవ్యలభ్యత భారీగా పెరిగి, రుణ సరఫరా మెరుగవుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో చిన్న వ్యాపారాలు, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు, రైతులు, పేదల సంక్షేమానికి చేయూత లభిస్తుందన్నారు. అంతేకాకుండా తాత్కాలిక రుణాల పరిమితి పెంపుతో రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

*****(Release ID: 1615447) Visitor Counter : 264