రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నియంత్రణలో సాయుధ దళ వైద్యసేవల తీరుపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష
Posted On:
17 APR 2020 3:04PM by PIB Hyderabad
కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో సాయుధ దళ వైద్యసేవలతోపాటు పౌర అధికారులకు వారు సహకరిస్తున్న తీరును రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ సమీక్షించారు. ఆ శాఖ కార్యదర్శిసహా త్రివిధ దళాల వైద్య సర్వీసుల డైరెక్టర్ జనరళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో ఆయా దళాల వైద్యసేవా సంస్థలు కల్పించిన మౌలిక వసతులను, సిబ్బంది సేవలను, పౌర అధికార యంత్రాంగాలకు తాము సహకరిస్తున్న తీరును వారు రక్షణ మంత్రికి వివరించారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ విజ్ఞాపన మేరకు కోవిడ్-19 పీడితుల కోసం సైనిక బలగాలకు చెందిన ఆరుచోట్ల క్వారంటైన్ కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఇటలీ, ఇరాన్, చైనా, మలేషియా, జపాన్‌ల నుంచి భారతీయులను ఆయా కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటిదాకా 1,738 మందికి వీటిలో ఆశ్రయం కల్పించామన్నారు. అలాగే ఐసీఎంఆర్ సహకారంతో ఆరు టెస్టింగ్ లేబొరేటరీలను సాయుధ దళాల ఆస్పత్రులలో ఏర్పాటు చేశామని తెలిపారు. రక్షణమంత్రి అత్యవసర ఆర్థికాధికారాలు కల్పించిన నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ సామగ్రి, మాస్కులు, వెంటిలేటర్లు తదితరాలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్-19 రోగులకు ఏకాంత చికిత్స కోసం 9,038 పడకలతో దేశంలోని 50 సాయుధ దళాల ఆస్పత్రులను ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. శిక్షణలో ఉన్న 650 మంది పీజీ డాక్టర్లుసహా నియామక సంస్థల నుంచి అదనంగా 100 మంది వైద్యాధికారులను కోవిడ్-19 రోగుల సేవలకు పంపామన్నారు. అధికారులు వెల్లడించిన అంశాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు వారికి అభినందనలు తెలిపారు. కోవిడ్-19 సవాలును త్వరగా అధిగమించడంలో పౌర యంత్రాంగాలకు మరింత సహకరించాలని సూచించారు.
*****
(Release ID: 1615366)
Visitor Counter : 194